రెవెన్యూ, రిజిస్ట్రేషన్ శాఖలలో లంచం సర్వసాధారణం
రైతులను, ప్రజలను పీక్కుతింటున్న అధికారులు
అమరావతి : అవినీతి… అవినీతి… జగన్ రెడ్డి పాలనలో రాష్ట్రంలో ఎక్కడ చూసినా అవినీతే. రాష్ట్రంలో అవినీతి, అక్రమాలు పెరిగిపోయాయని, రాష్ట్రం మరో బీహార్ లా తయారైందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అటు ప్రభుత్వ పెద్దలతోపాటు ప్రభుత్వ అధికారులూ… అందరిలోనూ అవినీతి పరులు ఎక్కువైపోయారు. యథారాజా తథా ప్రజా అన్నట్లు వైసీపీ ప్రభుత్వం మద్యం, ఇసుక, గనులు… వంటి వాటి ద్వారా దోచుకుంటుంది. ప్రపంచం అంతా నగదు రహిత లావాదేవీలు జరుపుతుంటే ఒక్క ఆంధ్రప్రదేశ్ లో మాత్రమే మద్యం కొనాలంటే తప్పనిసరిగా నగదు చెల్లించవలసిందే. ఆ రకంగా లెక్కాపత్రం లేకుండా నగదు దోపిడీ చేసేస్తున్నారు. ఇక ఇసుక, మైన్స్ దోపిడీ గురించి ప్రతిరోజూ మీడియాలో చూస్తూనే ఉన్నాం. వేల కోట్ల దోపిడీ జరుగుతోంది. ప్రభుత్వమే అంత బహిరంగంగా దోపిడీ చేస్తుంటే ప్రభుత్వ అధికారులు ఊరుకుంటారా? వారు తెగబడి మరీ ప్రజలను నానా వేధింపులకు గురిచేసి దోచుకుంటున్నారు. తమది అవినీతికి తావులేని ప్రభుత్వం అని సీఎం జగన్ రెడ్డి చెబుతూ ఉంటారు, కాని వాస్తవంలో అంతా అవినీతి మయమే.
ఈ ప్రభుత్వంలో అవినీతికి పాల్పడిన అధికారుల జాబితా చాంతాడంత ఉంటుంది. రెవెన్యూ శాఖలో అవినీతికి అంతేలేదు. ప్రభుత్వంలోని పెద్దల అండతోనే తహసీల్దార్లు రెవెన్యూ రికార్డులను తారుమారు చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. విజయనగరం, విశాఖపట్నం, నెల్లూరు, అనంతపురం, కడప జిల్లాల్లో ప్రభుత్వ భూములను ప్రైవేటు వ్యక్తుల పేరిట రికార్డులు మార్చినట్లు ఫిర్యాదులు ఉన్నాయి. మ్యూటేషన్ విషయంలో భారీగా అక్రమాలు జరుగుతున్నాయి. భూముల రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి కాకుండానే కొందరు తహసీల్దార్లు మ్యూటేషన్ పూర్తి చేస్తున్నారు. నెల్లూరు జిల్లా పొదలకూరు తహసీల్దార్ స్వాతిపై అనేక ఆరోపణలు వచ్చాయి. ఎన్ని ఫిర్యాదులు అందినా రెవెన్యూ శాఖ మాత్రం స్పందించడంలేదు. అంటే ప్రభుత్వ పెద్దల అండ ఉన్నట్లు స్పష్టంగా అర్థమవుతోంది.
నెల్లూరు జిల్లాలో కోర్టు ఆదేశాల ప్రకారం తనకు సంక్రమించిన భూమిని అప్పగించమని ఓ తహసీల్దార్ ని అడిగితే రూ.50 లక్షలు లంచం డిమాండ్ చేశారు. ఆ హక్కుదారుడు తహసీల్దార్ పై జాయింట్ కలెక్టర్ కు ఫిర్యాదు చేస్తే జగన్ రెడ్డి ప్రభుత్వం ఆ జాయింట్ కలెక్టర్ నే బదిలీ చేసింది. ఆ తహసీల్దార్ పై ఎటువంటి చర్యా తీసుకోలేదు. ఆ తహసీల్దార్ పై చర్యలు తీసుకునే దమ్ము ఆ జిల్లా మంత్రి కాకాని గోవర్ధనరెడ్డికి గానీ, ఆ జిల్లా ఇన్ చార్జి మంత్రి అంబటి రాంబాబుకు గానీ, రెవెన్యూ శాఖా మంత్రికి గానీ లేదు. అనకాపల్లి జిల్లా మునగపాక మండలం పాటిపాల్లి వీఆర్ఓ శంకర్ పాటిపల్లి వెంకట అప్పారావు అనే రైతు వద్ద పాస్ బుక్ ఆన్ లైన్ చేయడానికి రూ.9వేలు లంచం డిమాండ్ చేశాడు. దీంతో వెంకట అప్పారావు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. రైతు వద్ద వీఆర్ఓ శంకర్ లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెండు రోజుల క్రితమే పట్టుకున్నారు.ఐదు జిల్లాల్లో దాదాపు 22 మంది తహసీల్దార్లు భూమి రికార్డులు తారుమారు చేస్తున్నట్లు ఆరోపణలు వచ్చాయి. రెవెన్యూ శాఖలో అవినీతి భారీస్థాయిలో పెరిగిపోయిందని స్వయంగా ఆ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావే అంగీకరించారు. అందుకు సిగ్గుపడాలని కూడా ఆయన చెప్పారు. అంటే రాష్ట్రంలో అవినీతి ఏ స్థాయిలో జరుగుతోందో అర్థమవుతోంది.
ఇక సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో జరిగే అవినీతికి అంతేలేదు. అక్కడ లంచం అనేది తప్పనిసరి. లంచం ఇవ్వనిదే ఒక్క పని కూడా జరగదు. రాష్ట్రంలోని దాదాపు 17 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో చలాన్ల అవకతవకలకు సంబంధించి గత ఏడాది రూ.5.85 కోట్ల మేర అక్రమాలు జరిగినట్లు తేల్చారు. తాడేపల్లి గూడెం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో గత ఏడాది విలువైన అనేక డాక్యుమెంట్లు గల్లంతయ్యాయి. విజిలెన్స్ అధికారుల దర్యాప్తులో 80 రకాల దస్త్రాలు మాయమైనట్లు తేలింది. ‘ఫీజు టు ఫీజు’ పేరుతో వారు కోట్ల రూపాయలు దండుకుంటున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ ప్రభుత్వంలో అవినీతి పరుల జాబితా చాంతాడంత అవుతుంది. రాష్ట్రంలో పెరిగిపోయిన అవినీతికి ప్రజలు అల్లాడుతున్నారు. ఈ వైసీపీ ప్రభుత్వానికి బుద్ధిచెప్పడానికి ప్రజలు ఎన్నికల కోసం ఎదురు చూస్తున్నారు. చంద్రబాబు నాయుడు మళ్లీ వస్తేగానీ రాష్ట్రం బాగుపడదనే కృతనిశ్ఛయానికి వారు వచ్చారు. రాబోయే సాధారణ ఎన్నికల్లో వైసీపీని గద్దె దించి టీడీపీని గద్దెనెక్కించడం ఖాయం.