- భూములు దోచుకునేందుకే ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్
- ఐదేళ్లుగా దోపిడీలే.. అభివృద్ధి శూన్యం
- మహిళలకు రక్షణ లేని రాక్షసపాలనకు ముగింపు పలకాలి
- చంద్రబాబుతోనే రాష్ట్రానికి పూర్వవైభవం
కుప్పం/రామకుప్పం(చైతన్యరథం): చంద్రబాబు చేసేదే చెప్తారు…చెప్పింది చేస్తారని ఆయన సతీమణి నారా భువనేశ్వరి అన్నారు. ఇది అందరికీ తెలిసిన విషయమేనన్నారు. చంద్రబాబు పాలనలో భద్రంగా ఉన్న మహిళలకు, వైసీపీ పాలనలో రక్షణ లేకుండా పోయిందన్నారు. కుప్పం నియోజకవర్గంలో ప్రచారంలో భాగంగా బుధవారం రామకుప్పం మండలం, వీర్నమల గ్రామంలో ఎస్టీ మహిళలతో నిర్వహించిన ముఖాముఖి కార్యక్రమంలో భువనేశ్వరి మాట్లాడుతూ చంద్రబాబు పాలనలో నిందితులకు శిక్షలంటే భయం ఉండి ఆత్మహత్యలు చేసుకునేవాళ్లన్నారు. వైసీపీ పాలనలో నిందితులను పాలకులే కాపాడుతున్నారని విమర్శించారు. చంద్రబాబు పాలనలో మహిళలకు ఆర్థిక స్వేచ్ఛను కల్పించేందుకు అనేక పథకాలు అమలు చేశారు. డ్వాక్రా సంఘాలను బలోపేతం చేశారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మహిళలకు ఉపయోగపడే పథకాలన్నింటినీ రద్దు చేసింది. మహిళల్ని రోడ్డున పడేసింది. తమకు మేలు చేసే నాయకుడెవరో, తమ కోసం ఆలోచించే నాయకుడెవరో మహిళలే ఆలోచించుకోవాలి. మీ సొమ్ము తినే దొంగ నాయకులు కావాలా.. మీకు సంపదను తెచ్చిపెట్టే నాయకుడు కావాలా మహిళలు తేల్చుకోవాలని భువనేశ్వరి సూచించారు.
చంద్రబాబు గురించి మీకే బాగా తెలుసు….
ఎన్నికల ప్రచారంలో కుప్పం కుటుంబ సభ్యులు నాకు అడుగడుగునా ఘన స్వాగతం పలికారు. మీరు చూపించే ప్రేమాభిమానాలు నన్ను అడుగు ముందుకు వేయనీయడం లేదు. అయినా అందర్నీ కలవాలనే ఉద్దేశంతో వస్తున్నాను. ఈ క్రమంలో కొంచెం ఆలస్యమవుతోంది. కుప్పం ప్రజలు చంద్రబాబును గత 40ఏళ్లుగా గెలిపిస్తూ వస్తున్నారు. మా కుటుంబమంతా కుప్పం ప్రజలకు రుణపడి ఉంటాం. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా కుప్పం ప్రజలకు చంద్రబాబు ప్రత్యేక మేనిఫెస్టోను పెట్టారు. ముఖ్యమంత్రి అయ్యాక మేనిఫెస్టోలోని ప్రతి అంశాన్ని చంద్రబాబు అమలు చేస్తారు. నాకంటే మీకే చంద్రబాబు గురించి బాగా తెలుసు. అందుకే కుప్పం ప్రజలు చంద్రబాబును ముఖ్యమంత్రిగా గెలిపించుకుంటున్నారని భువనేశ్వరి అన్నారు.
అడ్డగోలుగా దోచుకున్నారు….
రాష్ట్ర విభజన అనంతరం కట్టుబట్టలతో రోడ్డున పడేస్తే, ఏపీని దేశంలోనే నంబర్ వన్ స్థానంలో నిలబెట్టేందుకు చంద్రబాబు అహర్నిశలు శ్రమించారు. కుటుంబాన్ని కూడా ఆయన ఎప్పడూ పట్టించుకోలేదు. చంద్రబాబు జీవితం ప్రజలకే అంకితం. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మీ జేబులకు చిల్లు పెట్టి తమ జేబులు నింపుకుంటోంది. ఈ ఐదేళ్లుగా రాష్ట్ర ప్రజలను వైసీపీ ప్రభుత్వం అడ్డగోలుగా దోచుకుంది. చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో అనేక పరిశ్రమలు, పెట్టబడులు తెచ్చారు. చంద్రబాబు తెచ్చిన కంపెనీలు, పరిశ్రమలను వైసీపీ రాక్షస ప్రభుత్వం కమీషన్ల కోసం వేధించి పక్క రాష్ట్రాలకు తరిమేసింది. కియా అనుబంధ పరిశ్రమలు, అమర్‌రాజా, జాకీ తదితర పరిశ్రమలన్నీ తమ పెట్టుబడులను ఇతర రాష్ట్రాలకు తరలించాయని భువనేశ్వరి విమర్శించారు.
అభివృద్ధి శూన్యం….
టీడీపీ కార్యకర్తలు ఈ రాక్షస పాలనలో అనేక నిర్బంధాలు ఎదుర్కొన్నారు. పార్టీకోసం అనేక అక్రమ కేసులు మోశారు. చంద్రబాబును అరెస్టు చేసిన సందర్భంలో 53 రోజులు కుప్పం ప్రజలు చాలా మనోవేదనకు గురయ్యారు. ప్రతిపక్ష కార్యకర్తలను ఇబ్బందులు పెట్టడం తప్ప, వైసీపీ ప్రభుత్వం ఈ ఐదేళ్లలో చేసిన అభివృద్ధి ఏమీ లేదు. రాష్ట్రానికి రాజధాని లేదు, యువతకు ఉద్యోగాలు లేవు. యువతకు ఐదేళ్లలో 20లక్షల ఉద్యోగాలు కల్పించడానికి చంద్రబాబు సిద్ధంగా ఉన్నారు. ఇందుకు అవసరమైన పెట్టుబడుల కోసం చంద్రబాబు చాలా శ్రమించాల్సి ఉంటుందని భువనేశ్వరి అన్నారు.
భూములు దోచుకునేందుకే…
రాష్ట్ర ప్రజల భూములను దోచుకునేందుకు వైసీపీ ప్రభుత్వం ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని తెచ్చింది. ఈ చట్టం ద్వారా మన భూములను మనకు తెలియకుండానే దోచుకునేందుకు వైసీపీ భారీ స్కెచ్ వేసింది. మన భూములు లాక్కోవడానికి ఈ ప్రభుత్వానికి ఎవరు అధికారం ఇచ్చారు? ఇష్టమొచ్చినట్లు చట్టాలు,పథకాలు తీసుకురావడం..వాటి మాటున మనల్ని దోచుకోవడం వైసీపీ ప్రభుత్వానికి అలవాటుగా మారింది. ఇలాంటి వాటిని రాష్ట్ర ప్రజలు ప్రశ్నించాలి, దుర్మార్గపు చట్టాలను తిప్పికొట్టాలి. రాష్ట్ర ప్రజలు సొంత ప్రయోజనాలతో పాటు భావితరాల భవిష్యత్తు గురించి కూడా ఆలోచించాలని భువనేశ్వరి హితవు పలికారు.
సూపర్‌సిక్స్‌తో అందరికీ మేలు….
ఎన్నికల సందర్భంగా చంద్రబాబు ఇప్పటికే సూపర్ సిక్స్ పథకాలను ప్రకటించారు. రైతులకు ప్రతిఏటా రూ.20వేలు ఆర్థికసాయం, ఆడబిడ్డ నిధి కింద ప్రతి నెల రూ.1,500, తల్లికి వందనం పథకం కింద కుటుంబంలో చదువుకునే పిల్లలు ఎందరున్నా అందరికీ సంవత్సరానికి రూ.15వేలు, ప్రతి ఇంటికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు, మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, పెన్షన్ రూ.4వేలకు పెంపు. ఇవన్నీ చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక అమలు చేస్తారని భువనేశ్వరి చెప్పారు.
రాక్షస పాలనను అంతం చేయాలి….
ఈ నెల 13న రాక్షస పాలనను అంతం చేసేందుకు రాష్ట్ర ప్రజలంతా సిద్ధంగా ఉన్నారు. కుప్పం ప్రజలు కూడా దుర్మార్గపు పాలనకు చరమగీతం పాడేందుకు సిద్ధంగా ఉండాలి. దుర్మార్గులను గద్దె దించేందుకు కూటమి ఏర్పడిరది. కూటమిలో పార్టీల జెండాలు వేరైనా..అజెండా ఒక్కటే..అది ప్రజా ప్రభుత్వ స్థాపన. ఇప్పటికే ఏపీలో అభివృద్ధి లేక మన యువత చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ వంటి నగరాలకు వలసలు వెళ్లిపోతున్నారు. కానీ చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక వలసలు నిలిచిపోతాయి. పక్కనున్న రాష్ట్రాల్లో ఉన్న మన యువత మొత్తం ఏపీకే వస్తారని భువనేశ్వరి ధీమా వ్యక్తం చేశారు.
టీడీపీని నడిపేది కార్యకర్తలే….
తెలుగుదేశంపార్టీని ముందుకు నడిపేది పార్టీ కార్యకర్తలే…చంద్రబాబుతో చేయిచేయి కలిపి కార్యకర్తలంతా ఏకతాటిపై ముందుకు సాగాలి. చంద్రబాబును ముఖ్యమంత్రిని చేసుకోవాలి. 13న ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి. ఎవరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా మన ఓటును మనగుర్తుపై వేసి, పసుపు జెండాను ఎగరేయడానికి ప్రతి ఒక్కరూ సై అంటే సై అనే విధంగా ముందుకు వెళ్లాలి. రామకుప్పం మండలంలో ప్రజలు ఎదుర్కొంటున్న ప్రతి సమస్యను చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక పరిష్కరిస్తారు. చదువుకున్న యవతకు ఉద్యోగాలు కల్పించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటారు. ఉపాధ్యాయులు లేని పాఠశాలల్లో ఉపాధ్యాయుల నియామకానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటారు. వైసీపీ పాలనలో ఫీజు రీయింబర్స్‌మెంట్ రాని విద్యార్థులను చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక ఆదుకుంటారు. విదేశీవిద్య పథకాన్ని సైతం పునఃప్రారంభిస్తారని భువనేశ్వరి చెప్పారు.
లక్ష ఓట్ల మెజార్టీ తథ్యం: నందమూరి రామకృష్ణ
కార్యక్రమంలో ఎన్టీఆర్ తనయుడు నందమూరి రామకృష్ణ మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో గెలుపు టీడీపీదే అన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రి కావడం ఖాయం. నాకు ఆ నమ్మకం ఉంది. కుప్పం నియోజకవర్గ ప్రజలు చంద్రబాబు పట్ల చూపిస్తున్న ప్రేమ, అభిమానాన్ని చూసిన తర్వాత లక్ష ఓట్ల మెజార్టీ తథ్యమనిపిస్తోంది. ఐదేళ్లుగా రాక్షస పాలనలో రాష్ట్ర ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మనల్ని ఇబ్బందులు పెట్టిన దుర్మార్గపు ప్రభుత్వంపై కక్ష తీర్చుకునే తరుణం ఆసన్నమైంది. ప్రతి ఒక్కరూ తమ ఓటును కూటమి అభ్యర్థులకు వేసి ప్రజా ప్రభుత్వానికి స్వాగతం పలకాలని రామకృష్ణ పిలుపు ఇచ్చారు.
భువనమ్మ అలుపెరగని ప్రచారం: పీఎస్ మునిరత్నం
కార్యక్రమంలో కుప్పం నియోజకవర్గ సమన్వయకర్త పీఎస్ మునిరత్నం మాట్లాడుతూ భువనమ్మకు కుప్పం ప్రజలు ఘన స్వాగతం పలికారన్నారు. అడుగడుగునా మంగళహారతులు పట్టి మహిళలు భువనమ్మను స్వాగతించారు. భువనమ్మ అలుపెరుగకుండా ప్రచారం చేస్తూ మీ ముందుకు వచ్చారన్నారు.
రోడ్లన్నీ చంద్రబాబు వేసినవే: మనోహర్
కార్యక్రమంలో కుప్పం నియోజకవర్గ సమన్వయకర్త మనోహర్ మాట్లాడుతూ కుప్పం ప్రాంతంలో నేడు కనిపించే రోడ్లన్నీ చంద్రబాబు పాలనలో వేసినవే అన్నారు. ఈ ప్రాంతంలో ముసలిమడుగు చెరువు వచ్చిందంటే అది చంద్రబాబు చూపిన చొరవే. ఈ ప్రాంతంలో ఎస్సీ, ఎస్టీ, బీసీలు అటవీ ప్రాంతంలో బిక్కు బిక్కుమంటూ బతుకుతున్నారు. ఇలాంటి ప్రజల కోసం వీర్నమల ప్రాంతంలో పరిశ్రమలు ఏర్పాటు చేసి ఉపాధి అవకాశాలు కల్పించాలి. రానున్న కాలంలో ఆ దిశగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
సమస్యలన్నీ పరిష్కరిస్తారు: ఆనంద్ రెడ్డి
కార్యక్రమంలో రామకుప్పం మండల పార్టీ అధ్యక్షుడు ఆనంద్ రెడ్డి మాట్లాడుతూ గత ఐదేళ్లుగా ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నామన్నారు. అవన్నీ పోవాలంటే చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలి. కుప్పం నియోజకవర్గంలో లక్ష ఓట్ల మెజారిటీ రావాలి. మండలంలో ఎదుర్కొంటున్న సమస్యలను చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక పరిష్కరిస్తారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక కనీసం వీధిలైట్లు కూడా వెలిగే పరిస్థితి లేదు. తండాల్లో ఉండే ప్రజలు తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారన్నారు.