` ముగిసిన జెడ్పీటీసీ ఉప ఎన్నికల పోలింగ్
` పులివెందుల, ఒంటిమిట్టలో వైసీపీ అరాచకాలు
` బూత్‌ల్లోకి చొరబడి టీడీపీ ఏజెంట్లపై దాడి
` ఓటమి భయంతో సాకులు వెతుక్కుంటున్న జగన్
కడప (చైతన్యరథం): ఉమ్మడి వైఎస్‌ఆర్ కడప జిల్లాలోని పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికల పోలింగ్ మంగళవారం ముగిసింది. కొన్ని చోట్ల చెదురుమదురు సంఘటనలు మినహా మిగిలిన చోట్ల ప్రశాంతంగా పోలింగ్ ముగిసింది. వైసీపీ నేతల దౌర్జన్యాలు, బెదిరింపులను ఎదిరించి మరీ జనం భారీగా తరలివచ్చి ఓటేశారు. మూడు దశాబ్దాల తరువాత స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకుంటున్నామన్న ఆనందం ఓటర్ల ముఖాల్లో స్పష్టంగా కనిపించింది. వైసీపీ నేతలు ఎన్ని అడ్డంకులు సృష్టించినా ప్రజలు ఏ మాత్రం భయపడకుండా పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చారు. అల్లర్లు రేకేత్తించేందుకు వైసీపీ నేతలు, మూకలు చేసిన యత్నాలను పోలీసులు ఎక్కడికక్కడ సమర్థంగా అడ్డుకున్నారు. సాయంత్రం ఐదు గంటలకు పులివెందులలో 77.33 శాతం పోలింగ్ నమోదవగా.. ఒంటిమిట్టలో 76.44 శాతం పోలింగ్ నమోదయ్యింది. సాయంత్రం 5.00 గంటల వరకు క్యూలైన్‌లో ఉన్న వారికి ఓటు హక్కు వినియోగించుకునే అవకాశాన్ని ఎన్నికల అధికారులు కల్పించారు.
ఈ ఎన్నికల్లో ప్రధాన పోరు.. టీడీపీ, వైసీపీ మధ్యే నెలకొంది. పులివెందులలో టీడీపీ అభ్యర్థి మారెడ్డి లతా రెడ్డి, వైసీపీ అభ్యర్థి హేమంత్ రెడ్డి.. అలాగే ఒంటిమిట్టలో టీడీపీ నుంచి ముద్దు కృష్ణారెడ్డి, వైసీపీ నుంచి ఇరగం రెడ్డి బరిలో నిలిచారు. ఇక ఈ ఉప ఎన్నికల పోలింగ్ కోసం పులివెందుల్లో 15, ఒంటిమిట్టలో 30 కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ ఎన్నికల ఫలితాలు 14వ తేదీ గురువారం వెలువడనున్నాయి. పోలింగ్ అనంతరం బ్యాలెట్ బాక్సులను కడపకు తరలించారు.
సాకులు వెతుక్కుంటూ..
పోలింగ్‌పై వైసీపీ పడుతున్న కంగారు, రిగ్గింగ్ ఆరోపణలు, ఎన్నికను రద్దు చేయాలని న్యాయస్థానాలను ఆశ్రయిస్తామని చేసిన ప్రకటనలతో.. ఆ పార్టీ నేతలకు ఫలితంపై స్పష్టత వచ్చేసిందని విశ్లేషకులు భావిస్తున్నారు. పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికలను రద్దు చేసి కేంద్ర బలగాల రక్షణతో మరోసారి నిర్వహించాలని జగన్ రెడ్డి డిమాండ్ చేశారు. జెడ్పీటీసీ ఎన్నికల్లో ఓడిపోతే పరువు పోతుందని పది రోజులుగా బెంగళూరు నుంచి రచించిన వ్యూహాలు ఫలించలేదని తెలిసిన తర్వాత కంగారుగా ఆయన సోషల్ మీడియాలో ట్వీట్ చేశారు. అంతా రిగ్గింగ్ జరిగిందని, బయట నుంచి వచ్చిన వారు ఊళ్ల మీద పడి స్లిప్పులు లాక్కుని వారే ఓట్లేసుకున్నారని జగన్ రెడ్డి ఆర్తనాదాలు చేశారు. ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించిన డీఐజీ కోయ ప్రవీణ్‌కు.. మాజీ ఎంపీ కంభంపాటి రామమోహన్ రావుతో బంధుత్వం కలిపేశారు. జగన్ రెడ్డి స్పందన చూసి వైసీపీ శ్రేణులు షాక్‌కు గురవుతున్నాయి. సార్వత్రిక ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోతామని సర్వేలు చెబితే.. గెలుస్తామని నమ్మించి, అందర్నీ బెట్టింగులు కాసేలా చేసి నిండా ముంచేశారు. ఇప్పుడు సొంత గడ్డ.. కంచుకోట అయిన పులివెందులలో ప్రజలు తనకు ఓట్లేయలేదని.. ఓడిపోతామని ఇంత నమ్మకంగా చెప్పడం వారిని దిగ్భ్రాంతికి గురి చేస్తోంది. మళ్లీ ఎన్నికలు నిర్వహించాలని అనడం అంటే.. జగన్ రెడ్డి ఓటమి ఒప్పుకోవడమే. నిజానికి ఆయన పోలింగ్ జరగక ముందే ఈ ఆరోపణలు చేశారు. అప్పుడే వైసీపీ కార్యకర్తలకు విషయం అర్థమయింది.
జనం ఓట్లేస్తుంటే భయమెందుకు..
పులివెందులలో ఇంత కాలం జరిగిన రాజకీయానికి ఇప్పుడు జరుగుతున్నదానికి పొంతన లేదు. అక్కడ ప్రజలు తమ వెంటే ఉన్నారని వైసీపీ నేతలు చెప్పుకుంటారు. అలాంటప్పుడు ప్రశాంతంగా పోలింగ్ జరుగుతుంటే ఎందుకు భయపడ్డారన్నది అర్థం కాని విషయం. ఓటర్లను ఎలా నియంత్రించాలో.. ఎలా బెదిరించాలో ముందుగానే ప్లాన్ చేసుకున్నారు. పోలీసులు ఈ వ్యూహాలన్నింటినీ కనిపెట్టి .. గట్టి బందోబస్తు ఏర్పాటు చేయటంతో రిగ్గింగ్ ఆటలు సాగలేదు.
దీంతో పులివెందులలో ఎప్పుడూ ఇలాంటి ఎన్నికలను చూడలేదని వైసీపీ నేతలు గగ్గోలు పెడుతున్నారు. పోలింగ్ ప్రారంభం కాక ముందే ఏదో జరిగిపోయిందంటూ ఈసీ ఆఫీసు ఎదుట ధర్నాలు చేయడానికి వెళ్లారు. పులివెందుల, ఒంటిమిట్టల్లో పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు పెద్ద ఎత్తున బారులు తీరితే తట్టుకోలేకపోయారు. కొన్ని చోట్ల పోలింగ్‌కు అంతరాయం కల్పించేందుకు ప్రయత్నించారు. పులివెందులపై పోలీసులు ఫుల్ ఫోకస్ పెట్టడంతో ఒంటిమిట్టలో ఘర్షణలు సృష్టించి డైవర్ట్ చేయాలనుకున్నారు. ఒంటిమిట్ట జెడ్పీటీసీ పరిధిలోని మంటపంపల్లిలో వైసీపీ కార్యకర్తలు దౌర్జన్యానికి దిగి టీడీపీ కార్యకర్తలపై దాడి చేశారు. పోలింగ్ బూత్‌లోకి చొరబడి టీడీపీ ఏజెంట్లను బలవంతంగా బయటకు లాక్కొచ్చారు. జగన్ మేనమామ, మాజీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి, వైసీపీ మాజీ మంత్రి అంజాద్ బాషా, మాజీ ఎమ్మెల్యే కొరుముట్ల శ్రీనివాసులు ఓవరాక్షన్ చేశారు. రిగ్గింగ్ చేస్తున్న వైసీపీ కార్యకర్తలను అడ్డుకోవటంతో ఎన్నికల అధికారిపై దుర్భాషలకు దిగారు. పోలింగ్ బూత్‌లోకి చొచ్చుకెళ్లి రిగ్గింగ్‌కు పాల్పడటంతో అంజాద్ బాషా సహా మొత్తం 20 మంది వైసీపీ కార్యకర్తలను
పోలీసులు అరెస్ట్ చేశారు.
రెచ్చిపోయిన వైసీపీ నేతలు
శాసనసభ ఎన్నికలను ఈవీఎంలతో నిర్వహించడం వల్లనే తాము ఓడిపోయాము తప్ప ప్రజలు తమని ఓడిరచలేదని జగన్ తన ఓటమికి చక్కటి ముసుగు వేశారు. పులివెందులలో జెడ్పీటీసీ ఎన్నికలు బ్యాలెట్ పేపర్లతోనే జరిగాయి కనుక జగన్, వైసీపీ నేతలు ఇంట్లో హాయిగా పడుకున్నా వైసీపీ గెలిచి ఉండాలి. కానీ అవినాష్ రెడ్డి, రవీంద్రనాద్ రెడ్డి తదితరులు, వారి అనుచరులు పోలింగ్ రోజు రెచ్చిపోయారు. ఇద్దరినీ గృహ నిర్బంధం చేసినా తప్పించుకొని అవినాష్ రెడ్డి వైసీపీ కార్యాలయంలో, రవీంద్రనాద్ రెడ్డి ఏకంగా పోలింగ్ కేంద్రంలోకి వచ్చేసి హడావుడి చేశారు. ఇదంతా ఓటమి భయంతోనే అనేది స్పష్టమవుతోంది. తమ అడ్డా అయిన పులివెందులలో టీడీపీ గెలిస్తే అది జగన్ ఓటమిగానే పరిగణిస్తారు. అందుకే వైసీపీ నేతలు ఇంతగా రెచ్చిపోయారు. ప్రజలు స్వచ్ఛందంగా ఓటు వినియోగించుకుంటే తాము గెలిచేది లేదని అర్థమయిన వైసీపీ నేతలు మొదటి నుంచి ఓటమికి కారణాలు వెదుక్కుంటూనే ఉన్నారు. ప్రశాంతంగా జరుగుతున్న పోలింగ్‌ను చెడగొట్టేందుకు ప్రయత్నించారు. అవన్నీ వైఎస్ జగన్‌కు పట్టున్న గ్రామాలు.. వైఎస్ కుటుంబంపై అభిమానం చూపే గ్రామాలే అయితే.. వైసీపీ ఇంత టెన్షన్ పడాల్సిన అవసరం ఉండదు. కానీ భయంతో వారిని ఇంత కాలం అణిచివేశారు. ఇప్పుడు వారు స్వేచ్ఛగా ఓటు వేసుకుంటుంటే వైసీపీ నేతలకు భవిష్యత్ ముఖచిత్రం స్పష్టంగా కనబడుతూ ఓటమికి కారణాలు వెతుక్కుంటున్నారు.
అవినాష్ రెడ్డి డ్రామా
మరోవైపు అన్ని పార్టీలకు చెందిన ప్రధాన నేతల్ని ముఖ్యంగా పులివెందుల జెడ్పీటీసీ పరిధిలో ఓటు హక్కు లేని నేతల్ని పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. ఇటు టీడీపీ, అటు వైసీపీ ఇరు పార్టీల నేతలను పోలీసులు ముందుగానే అదుపులోకి తీసుకున్నారు. వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డిని కూడా అలాగే చేశారు. అయితే ఒక్క అవినాష్ రెడ్డి మాత్రమే డ్రామా క్రియేట్ చేయగా మిగతా అందరూ పోలీసుల నిబంధనలు పాటించారు. మంగళవారం తెల్లవారుజామునే అలెర్టయిన పులివెందుల పోలీసులు డీఎస్పీ ఆధ్వర్యంలో ఎంపీ అవినాష్ ఇంటికి చేరుకుని ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంలో ఎంపీ అవినాష్ రెడ్డి, పోలీసుల మధ్య వాగ్వాదం, పెనుగులాట కూడా చోటుచేసుకుంది. అనంతరం ఎంపీ అవినాష్ రెడ్డిని బలవంతంగా పోలీసులు జీపులో ఎక్కించారు. ఆయన తప్పించుకుని పోలీసుల కళ్లు గప్పి పులివెందుల వైసీపీ కార్యాలయానికి చేరుకున్నారు. అవినాష్ రెడ్డి వ్యవహర శైలిని డీఐజీ కోయ ప్రవీణ్, ఎస్పీ అశోక్ కుమార్ తీవ్రంగా పరిగణించారు. సాయంత్రం 5 గంటల వరకు ఆయనను అక్కడ నుంచి బయటకు రానీయకుండా బందోబస్తు చేశారు. వేంపల్లిలో వైసీపీ రాష్ట్ర కార్యదర్శి సతీష్ రెడ్డిని, పులివెందులలో టీడీపీ ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డిని పోలీసులు గృహనిర్బంధం చేశారు. ఇదే సమయంలో మరికొందరిని బైండోవర్ చేశారు. అయినా వైసీపీ నేతలు మాత్రం తమని మాత్రమే హౌస్ అరెస్టు చేసినట్లుగా పెడబొబ్బలు పెట్టారు.
పులివెందులలో టీడీపీ టెలిస్తే జగన్ రెడ్డి కంచుకోట కుప్పకూలిపోయినట్లు అవుతుంది. అంతకంటే ముఖ్యంగా జగన్ రెడ్డి పరువు పోతుంది. ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని, రిగ్గింగ్ చేశారని ఎన్ని ఆరోపణలు చేసినా నమ్మే పరిస్థితుల్లో జనం లేరు. దశాబ్దాలుగా వైఎస్ కుటుంబం ఏకగ్రీవం చేసుకుంటున్న జెడ్పీటీసీ స్థానం అది. స్థానిక సంస్థల ఎన్నికల్లో అసలు ఎవర్నీ పోటీ చేయనివ్వరు. వైఎస్ కుటుంబం ఎవర్ని కావాలనుకుంటే వారిని ఏకపక్షంగా .. ఏకగ్రీవం చేసుకుంటూ వస్తోంది. అక్కడి గ్రామస్తులు ఓట్లేయకుండా.. పూర్తిగా రిగ్గింగ్ చేసి గెలవడం అనేది సాధ్యం కాదు. రిగ్గింగ్ చేస్తే గీస్తే వైసీపీ వాళ్లే చేయాలి. వారికి ఆ గ్రామాల్లో ఉన్న పట్టు అలాంటిది. కానీ వైసీపీ నేతలు మాత్రం టీడీపీ రిగ్గింగ్‌కు పాల్పడిరదని తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. పోలింగ్‌పై వైౖసీపీ స్పందనను బట్టి చూస్తే వారు ఓటమికి మానసికంగా సిద్ధమైపోయారని సులువుగా అర్థం చేసుకోవచ్చు. మొత్తంగా వైసీపీ పరువు బ్యాలెట్ బాక్సుల్లో ఉంది. గురువారం ఫలితం తేలిపోతుంది.
పోలీసులపై రాచమల్లు దుర్భాషలు
ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా అన్న చందంగా వైసీపీ అధినేత జగన్ పోలీసులను తరచుగా హెచ్చరిస్తున్న నేపథ్యంలో ఆ పార్టీ నాయకులు కూడా అదే బాటలో నడుస్తున్నారు. తాజాగా పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో తమను పోలీసులు ఇబ్బందులకు గురి చేశారని, ఎంపీ అయిన అవినాష్ రెడ్డిని అదుపులోకి తీసుకుని రోడ్ల వెంబడి తిప్పారని పేర్కొంటూ ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే, వైసీపీ సీనియర్ నేత రాచమల్లు శివప్రసాద్ రెడ్డి తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.
పోలీసులను ఉద్దేశించి రాచమల్లు మాట్లాడుతూ.. ‘‘మేం అధికారంలోకి వస్తాం. వచ్చిన తర్వాత మీ ఉద్యోగాలు ఉండవు. ఊడ పెరుకుతాం’’ అని బెదిరింపు వ్యాఖ్యలు చేశారు. అధికార పార్టీకి పోలీసులు గుమస్తాలుగా పనిచేస్తున్నారన్నారు. ఇప్పుడు తప్పులు చేస్తున్న పోలీసుల పేర్లను తాము నమోదు చేసుకుంటున్నామని, నాలుగేళ్లలో తాము అధికారంలోకి వచ్చిన తర్వాత వారి అంతు చూస్తామని వ్యాఖ్యానించారు. పులివెందుల ఏమైనా టీడీపీ అడ్డానా? వారికి ఎందుకు సహకరించారు? ఎందుకు చెంచాగిరీ చేశారు? అని ప్రశ్నించారు. ఇలాంటివారిని వదిలిపెట్టేది లేదన్నారు.
గెలిచేది మేమే: మంత్రి మండిపల్లి
వైసీపీ ఏజెంట్లు కావాలనే వృద్ధులు, మహిళలను ఓటేయకుండా వేధించారని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. పులివెందుల, ఒంటిమిట్టలో గెలిచేది తామే అన్నారు. అవినాష్ రెడ్డి కావాలనే గొడవలు సృష్టించాలని చూశారు.. అందుకే అరెస్టు చేశారని స్పష్టం చేశారు. రాంప్రసాద్ రెడ్డి
ఓటమి భయంతోనే: ఎమ్మెల్సీ రాంగోపాల్‌రెడ్డి
పులివెందులలో ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలు జరిగాయని టీడీపీ ఎమ్మెల్సీ రాంగోపాల్‌రెడ్డి అన్నారు. వైసీపీ ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. అక్రమాలు జరిగినట్టు ఒక్క ఓటరు కూడా ఫిర్యాదు చేయలేదన్నారు. పులివెందులలో టీడీపీ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఓటమి భయంతోనే వైసీపీ తప్పుడు ఆరోపణలు చేస్తోందని విమర్శించారు.
టీడీపీ గెలుపు ఖాయం: బీటెక్ రవి
పులివెందులలో టీడీపీ గెలుపు ఖాయమని టీడీపీ నేత బీటెక్ రవి ధీమా వ్యక్తం చేశారు. 35 ఏళ్ల తర్వాత ఓటర్లు నిర్భయంగా ఓటుహక్కు వినియోగించుకున్నారన్నారు. కూటమి ప్రభుత్వంపై ప్రజలకు నమ్మకం పెరిగింది.. పులివెందులలో టీడీపీ మరింత బలపడుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు.