తన అసంబద్ధ నిర్ణయాలతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి భవిష్యత్ లేకుండా చేసిన.. ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి మరో ప్రచార ఆర్భాట కార్యక్రమానికి తెర తీశారు. ‘జగనన్నే మా భవిష్యత్తు’. ‘మా నమ్మకం నువ్వే జగన్’… అంటూ ఆయన వైసీపీ తరపున పెద్ద ఎత్తున పొలిటికల్ క్యాంపైన్ నిర్వహిస్తున్నారు. ఏప్రిల్ 7 నుంచి 20 వరకు 14 రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ, వార్డు వాలంటీర్లందరినీ వినియోగిస్తున్నారు. వైసీపీ కి చెందిన గృహ సారథులు, సచివాలయ కన్వీనర్లతో కలిసి వాలంటీర్లు ఇంటింటికీ వెళ్ళి వైసీపీ ప్రచారం నిర్వహించాలని నిర్ధేశించారు. అయితే.. ఇప్పటికే జగన్ సర్కార్ తీరుపై ఆగ్రహంగా ఉన్న ఏపీ ప్రజలు.. ఇంటింటికీ వచ్చే వాలంటీర్లు, వైసీపీ గృహ సారధులను నిలదీసేందుకు రెడీ అంటున్నారు.
ప్రపంచంలోని ఏ రాజకీయ పార్టీ అయినా.. నాయకుడైనా జనమే తమ భవిష్యత్ అని భావిస్తారు. ప్రజల మద్దతుతోనే తమ రాజకీయ భవిష్యత్‌ను నిర్దేశించుకుంటారు. కానీ ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మాత్రం.. 5 కోట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తాను లేకపోతే భవిష్యత్ లేదనే విధంగా భ్రమల్లో బతుకుతున్నారు. అంతే కాదు.. తాము లేకపోతే ఏపీ ప్రజలకు భవిష్యత్ లేదని నమ్మించాలని చూస్తున్నారు. జగన్, వైసీపీ వచ్చే ఎన్నికల్లో గెలవక పోతే.. ఆంధ్రప్రదేశ్ ప్రజలు అడుక్కుతింటారు.. అన్న చందంగా జగన్ ఆలోచన సాగుతోంది. ఈ క్రమంలోనే సీఎం జగన్ రెడ్డి.. “జగనన్నే మా భవిష్యత్తు’. ‘మా నమ్మకం నువ్వే జగన్” అనే భారీ పొలిటికల్ క్యాంపైన్‌కు తెర తీశారు. ప్రజాధనంతో పని చేస్తున్న లక్షలాది వాలంటీర్లను, వైసీపీ గృహ సారధులు, సచివాలయ కన్వీనర్లను ఈ వైసీపీ పొలిటికల్ క్యాంపైన్లో భాగస్వాములు అవుతున్నారు. సుమారు 7 లక్షల మందికి పైగా వాలంటీర్లు, గృహ సారధులు, సచివాలయ కన్వీనర్లు, వైసీపీ కార్యకర్తలు.. ఈ కార్యక్రమంలో పాల్గొనేలా జగన్ డిజైన్ చేశారు. వారంతా ఇంటింటికీ తిరిగి.. వైసీపీ పథకాలు ప్రచారం చేయటం.. కొన్ని ప్రశ్నలపై ప్రజల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకోవటం.. వారి మొబైల్ నుంచి వైసీపీ టోల్ ఫ్రీ నంబర్‌కు మిస్డ్ కాల్ ఇవ్వటం వంటి పనులు చేయాలని నిర్దేశించారు. చివరగా “మా నమ్మకం నువ్వే” అని జగన్ బొమ్మతో ఉన్న స్టిక్కర్లను లబ్దిదారుల ఇంటి గోడలపైనా.. మొబైల్ ఫోన్ వెనుక వీరు అంటించాల్సి ఉంది.
2019 ఎన్నికలకు ముందు.. ఆంధ్రప్రదేశ్ ప్రజలే తన భవిష్యత్ అంటూ జగన్ రెడ్డి ఓట్లు అడిగారు. ఒక్క ఛాన్స్ ఇవ్వాలంటూ వేడుకున్నారు. అధికారంలోకి రావటానికి ఎన్ని అబద్దాలు చెప్పాలో.. అన్నీ చెప్పారు. “తొండ ముదిరి.. ఊసరెవల్లి” అయిన చందాన అధికారంలోకి వచ్చాక తన నిజస్వరూపాన్ని చూపించటం మొదలు పెట్టారు. తనను నమ్మి ఓట్లేసిన ప్రజల నమ్మకాన్ని వమ్ము చేసేలా జగన్ రెడ్డి పాలన కొనసాగింది. అంగ బలం, అర్ధబలంతో జనం గొంతును నొక్కుతున్న జగన్ సర్కార్‌కు.. ఇటీవల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రజలు కర్రు కాల్చి వాత పెట్టారు. 109 నియోజకవర్గాల పరిధిలో జరిగిన ఈ ఎన్నికల్లో లక్షలాది మంది విద్యావంతులైన ఓటర్లు.. తమ భవిష్యత్ తో ఆటలాడుతున్న జగన్ రెడ్డికి వ్యతిరేకంగా తీర్పు చెప్పారు. వాస్తవాలు ఇలా ఉండగా.. సీఎం జగన్ రెడ్డి మాత్రం..”జగనన్నే మా భవిష్యత్తు’. ‘మా నమ్మకం నువ్వే జగన్” అని ప్రజలతో అనిపించాలని చూస్తున్నారు. దీంట్లో భాగంగానే.. ఈ పొలిటికల్ క్యాంపైన్‌కు తెర తీశారు.
వాస్తవానికి.. “జగనన్నే మా భవిష్యత్తు’. ‘మా నమ్మకం నువ్వే జగన్” అని జగన్ రెడ్డి చెబుతున్నారు. అనేక తీవ్రమైన ఆర్ధిక నేరాల్లో ఏ1 ముద్దాయిగా జగన్ రెడ్డి ప్రస్తుతం బెయిల్ పై ఉన్నారు. తన అధికారాన్ని అడ్డుపెట్టుకుని.. వ్యవస్థలను మేనేజ్ చేస్తూ కోర్టు వాయిదాలకు గైర్హాజరౌతూ ఉన్నారు. ఆయన బెయిల్ ఎప్పుడు రద్దు అవుతుందో.. ఆయనకే తెలియని పరిస్తితి. ఏదైనా కేసులో బెయిల్ రద్దైనా.. శిక్ష పడినా జగన్ రెడ్డి జైలుకు వెళ్ళాల్సిందే. అంటే ప్రస్తుతం ముఖ్యమంత్రి హోదాలో ఉన్న జగన్ రెడ్డి భవిష్యత్తే.. కోర్టుల చేతిలో ఉంది. అటు వంటి జగన్ రెడ్డి.. 5 కోట్ల మంది ప్రజలకు తానే భవిష్యత్ అని చెప్పుకోవటం ఏంటనే ప్రశ్న ఉత్పన్నం అవుతోంది. తన రాజకీయ భవిష్యత్ ను కాపాడుకోవటానికే జగన్ రెడ్డి ఇలా డ్రామాలు ఆడుతున్నారనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తం అవుతోంది.
అయితే.. 2019 నాటి పరిస్తితులు ఇప్పుడు ఏపీలో లేవు. దీంతో జగన్ నాటకాలు జనం నమ్మే పరిస్థితి లేదని విపక్షాలు అంటున్నాయి. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యేలకు.. స్థానిక ప్రజలు చుక్కలు చూపించిన విషయాన్ని గుర్తు చేస్తున్నాయి. ఈ క్రమంలోనే వైసీపీ వాలంటీర్లకు , గృహ సారధులను నిలదీసేందుకు జనం ఎదురు చూస్తున్నారు. ఈ నాలుగేళ్ల పాలనలో రాజధాని లేని రాష్ట్రంగా చేసి.. అమరావతిని నాశనం చేసినందుకు జగన్ రెడ్డిని నమ్మాలా..? జాబ్ క్యాలెండర్ ఇవ్వకుండా యువత భవిష్యత్ నాశనం చేసినందుకు నమ్మాలా..? మద్యపాన నిషేదానికి తూట్లు పొడిచి మహిళల నమ్మకాన్ని వమ్ము చేసినందుకు నమ్మాలా..? పోలవరం ప్రాజెక్టును ఆపేసి.. రైతుల నోట్లో మట్టి కొట్టినందుకు నమ్మాలా..? ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేనందుకు నమ్మాలా..? సీపీఎస్ రద్దుపై యూ టర్న్ తీసుకున్నందుకు నమ్మాలా..? అనే ప్రశ్నలు ప్రజల నుంచి వస్తున్నాయి.
అలాగే ఎస్సీ, ఎస్టీ , బీసీల సంక్షేమ పథకాలను రద్దు చేసినందుకు నమ్మాలా..? ఆ నిధులను తన బటన్ నొక్కడు పథకాలకు మళ్ళించి నందుకు నమ్మాలా అని జనం ప్రశ్నిస్తున్నారు. పంచాయతీలను నిర్వీర్యం చేసిన సర్కార్ .. రోడ్లను నాశనం చేసి.. సామాన్యులపై పెట్రోల్, డీజిల్, నిత్యావసరాల ధరల భారం మోపినందుకు నమ్మాలా..? అని ఏపీ ప్రజలు ముక్తకంఠంతో నినదిస్తున్నారు. ఇసుక పాలసీతో భవన నిర్మాణ కార్మికుల్ని రోడ్డున పడేసింది. విద్యుత్ ఛార్జీలను పెంచింది.. చెత్తపై పన్ను వేసింది.. ప్రజల్ని ఎన్ని రకాలుగా దోచుకోవాలో అన్ని రకాలుగానూ దోచుకుంటోంది. బటన్లు నొక్కుతూ ప్రజలకు సంక్షేమ పథకాలు ఇస్తున్నామంటూ.. అడ్డగోలు పన్నులతో.. జేబులు గుల్ల చేస్తోంది. రోడ్లు, డ్రైనేజీలు వంటి కనీస మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయకుండా.. మాయమాటలతో ప్రజల్ని మభ్యపెట్టాలని చూస్తోంది.అన్ని రంగాల్లో రాష్ట్ర ప్రజల భవిష్యత్‌ను అంధకారం చేసిన జగన్ రెడ్డి.. తానే రాష్ట్ర ప్రజల భవిష్యత్ అని చెప్పుకోవటం.. దెయ్యాలు వేదాలు వల్లించిన చందంగా ఉందని దుమ్మెత్తి పోస్తున్నారు.
ఇప్పటికే గడప గడపలో ఎమ్మెల్యేలకు జనం చుక్కలు చూపిస్తున్నారు. మా జీవితాలను భవిష్యత్ ఎందుకు నాశనం చేస్తున్నారంటూ ప్రవ్నిస్తున్నారు. తాజాగా “జగనన్నే మా భవిష్యత్తు’. ‘మా నమ్మకం నువ్వే జగన్” అంటూ కొత్త పల్లవి అందుకుంటున్న వైసీపీ నేతల్లి నిలదీసేందుకు సమాయత్తం అవుతున్నారు. తమ ఇంటికి వచ్చి..కల్లబొల్లి కబుర్లు చెబితే సహించేది లేదని హెచ్చరిస్తున్నారు.