- ఏపీకి మంచిపేరు తెచ్చేలా కృషి చేయండి
- కాగ్నిజెంట్ సిబ్బందికి మంత్రి లోకేష్ పిలుపు
- విశాఖలో కాగ్నిజెంట్ తాత్కాలిక క్యాంపస్‌ను ప్రారంభించిన లోకేష్
విశాఖపట్నం (చైతన్య రథం): విశాఖపట్నంలో ప్రముఖ అంతర్జాతీయ ఐటీ సంస్థ కాగ్నిజెంట్ తాత్కాలిక క్యాంపస్‌ను విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ మంత్రి నారా లోకేష్ శుక్రవారం లాంఛనంగా ప్రారంభించారు. ముందుగా ఫిన్‌టెక్ ప్రాంగణానికి చేరుకున్న మంత్రి లోకేష్‌కు వేదమంత్రోచ్ఛారణల మధ్య ఘనస్వాగతం పలికారు. అనంతరం కాగ్నిజెంట్ తాత్కాలిక క్యాంపస్‌ను మంత్రి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించి.. కార్యక్రమానికి జ్యోతి ప్రజ్వలన చేశారు. శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. మధురవాడ హిల్ నెం-2లోని మహతి ఫిన్‌టెక్ భవనంలో వెయ్యిమంది సీటింగ్ కేపాసిటీతో ఈ తాత్కాలిక క్యాంపస్‌ను ఏర్పాటు చేశారు. కాగ్నిజెంట్ శాశ్వత క్యాంపస్ మొదటి దశ పూర్తయ్యే వరకు తాత్కాలికంగా ఫిన్ టెక్ భవనంలో కార్యకలాపాలను కొనసాగించనున్నారు. ఈ కేంద్రం కృత్రిమ మేధస్సు, మెషీన్ లెర్నింగ్, డిజిటల్ ఇంజినీరింగ్, క్లౌడ్ సొల్యూషన్స్‌వంటి ఆధునిక సాంకేతిక రంగాలపై దృష్టి సారించనుంది.
ఏడాదిలోనే విశాఖకు కాగ్నిజెంట్
అనంతరం మంత్రి లోకేష్ కాగ్నిజెంట్ ఉద్యోగులతో సంభాషించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. మీరంతా ఆంధ్రప్రదేశ్‌ను గర్వపడే విధంగా చేయాలి. యువతే టార్చ్ బేరర్స్. కష్టపడి జీవితంలో విజయం సాధించాలి. ఇవి ఎంతో ఉద్వేగభరిత క్షణాలు. గతేడాది జనవరి 23న రవిని కలిశాను. ఏడాదిలోనే కాగ్నిజెంట్ సంస్థను రాష్ట్రానికి తీసుకువచ్చాం. ఇప్పుడు యువత చరిత్రకు సాక్షులుగా నిలిచారు. భవిష్యత్‌లో విశాఖను మరింతగా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో కాగ్నిజెంట్ సీఈవో ఎస్ రవికుమార్, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ గుమ్మడి సూర్య, సీనియర్ వైస్ ప్రెసిడెంట్ తిరుమల నారాయణన్, వైస్ ప్రెసిడెంట్ గౌరవ్ హజ్రా, ఎంపీ భరత్, మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి, ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, ఏపీఐఐసీ ఛైర్మన్ మంతెన రామరాజు, ఐటీ సెక్రటరీ కాటంనేని భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.














