- యువతే.. భారత భవిష్యత్!
- ద్రావిడ విశ్వవిద్యాలయం ఎన్టీఆర్ దూరదృష్టి
- భాషా, సంస్కృతి ఐక్యతకు ప్రతీక ఈ వర్శిటీ
- పరిస్థితులు కఠినంగా ఉన్నా.. రాష్ట్రాన్ని నిలబెడుతున్న చంద్రబాబు
- సీఐఐ భాగస్వామ్య సదస్సు సూపర్ సక్సెస్
- మూడు రోజుల్లో రూ.13 లక్షల కోట్ల పెట్టుబడులు
- సమాజాభివృద్ధికి యువత ముందుకు రావాలి
- ద్రావిడ వర్శిటీ విద్యార్ధులతో భేటీలో నారా భువనేశ్వరి
కుప్పం (చైతన్య రథం): యువత సమాజ హితానికే సోషల్ మీడియా వినియోగించాలని, దేశ రక్షణకు ముందుకు రావాలని నారా భువనేశ్వరి పిలుపునిచ్చారు. బుధవారం నుంచి కుప్పం పర్యటనలో భాగంగా తొలిరోజు ద్రావిడ యూనివర్సిటీలో విద్యార్ధులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తన కళాశాల రోజులను గుర్తుచేసుకున్నారు.
దేశ రక్షణకై ముందుకు కదలండి
‘‘మిమ్మల్ని చూస్తుంటే మా కాలేజీ రోజులు గుర్తుకు వస్తున్నాయి. ఆ రోజులు మళ్లీ రావు. చదువుకునేవాళ్లం, అప్పుడప్పుడు బంక్ కొట్టేవాళ్లం, సినిమాలు చూడడానికి వెళ్లేవాళ్లం. నా జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేని మధుర క్షణాలవి. భారతదేశపు భవిష్యత్ నాయకులు మీరంతా. మన దేశాన్ని ముందుకు తీసుకెళ్లేది మీరే. మనం ఏ పార్టీకి చెందినవాళ్ళమనేది, ఏ కులం, మతం, రంగు, భాషకు చెందినవాళ్లమనేది ముఖ్యం కాదు. దేశాన్ని కాపాడి, అభివృద్ధి చేయాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. నేడు దేశంలో నెలకొంటున్న పరిస్థితులను చూస్తూనే ఉన్నాం. ఇది మన పని కాదు, పోలీసులు చూసుకుంటారు, ఇంటెలిజెన్స్ వర్గాలున్నాయి కదా! అని అనకోకూడదు. ఒక పౌరుడిగా దేశం కోసం, రాష్ట్రం కోసం, ప్రజల కోసం మనం ఏం చేయాలనేది యువత ఆలోచించాలి. మా కుటుంబం కూడా ఎన్నో త్యాగాలు చేస్తోంది. మాకు మన రాష్ట్ర అభివృద్ధి, ప్రజలు శ్రేయస్సే ముఖ్యం. యువత.. ముఖ్యంగా విద్యార్థులైన మీరు, ఈ క్షణంనుంచే దేశానికి మేలు చేసే దారిలో నడవాలి. చెడుదారిలో వెళ్ళడం కాదు, ఇతరులకు మంచి చేయాలని తపనపడండి’’ అని పిలుపునిచ్చారు.
ద్రావిడ భాష ప్రతిష్టతను పెంచిన ఎన్టీఆర్
‘‘ఈరోజు నేను రాజకీయవేత్తగా రాలేదు. నా సమాజం, నా రాష్ట్రం, నా దేశాభివృద్ధి గురించి ఆలోచించే ఒక బాధ్యతగల కార్పొరేట్ పౌరురాలిగా వచ్చాను. ఒక విధేయ భార్యగా, బాధ్యతగల తల్లిగానూ నా పాత్ర ఉంది. కానీ ఈరోజు మీ ముందుకు నేను ముఖ్యంగా ‘ఒక తల్లి’గా వచ్చాను. ఈ మహా సంస్థ స్థాపన నందమూరి తారకరామారావు దూరదృష్టి. ఆయన తెలుగు, ద్రావిడ భాషలకు ప్రతిష్ట తీసుకొచ్చిన వ్యక్తి. తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాలు సహకరించి ఆయన కలను సాకారం చేశాయి. ద్రావిడుల మధ్య ఉన్న భాషా సాంస్కృతిక ఐక్యతకు ఇది ప్రతీక. జాతి, మతం, రంగు, భాష `ఇలాంటి భేదాలు మనల్ని విడదీయకూడదు. మనమందరం భారతీయులమే. దీన్ని ఎప్పటికీ మర్చిపోవద్దు. తెలుగు భాషపై, ద్రావిడ సంస్కృతిపై ఎన్టీఆర్‌కు ఎంత ప్రేమ ఉందో అందరికీ తెలిసిందే. కుప్పం మన ముఖ్యమంత్రి చంద్రబాబు నియోజకవర్గం. నలభై ఏళ్లకు పైగా ఎన్టీఆర్, చంద్రబాబు తెలుగు ప్రజల ఆశలు, అంచనాలు, అభివృద్ధి ఈ మూడూ అందించడానికి కృషి చేశారు. వారి వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మీ భుజాల మీదా ఉంది. ఈ ద్రావిడ విశ్వవిద్యాలయం ద్రావిడ భాషలు, భాష విజ్ఞానం, చరిత్ర, సాహిత్యం, తత్వశాస్త్రం, గిరిజన అధ్యయనాలు, సమాజ శాస్త్రం, మానవశాస్త్రం, కంప్యూటర్ సైన్స్‌వంటి అనేక రంగాల్లో విద్యను అందిస్తూ ఒక జ్ఞాన స్తంభంలా నిలుస్తోంది. రెగ్యులర్ క్లాసులకు రావడానికి సాధ్యంకాని వారికి డిస్టంట్ విద్యా అవకాశాలు కూడా ఇస్తోంది’’ అని భువనేశ్వరి పేర్కొన్నారు.
కష్ట సమయాల్లో మీరిచ్చిన ధైర్యం వెలకట్టలేనిది
‘‘నాడు రాష్ట్రాభివృద్ధికై ఎన్టీఆర్ వెలిగించిన ఆ దీపాన్ని ఈరోజు ఇక్కడి వరకు తీసుకువచ్చింది చంద్రబాబు నాయుడు. పరిస్థితులు ఎంత విపరీతంగా ఉన్నా ఆయన మనోధైర్యం ఎప్పుడూ తగ్గలేదు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఆయన పడిన శ్రమ, అది ఆయన దేశభక్తి, నిబద్ధత, కష్టపడి పనిచేసే నైజం, విలువలు అన్ని రాష్ట్ర పునర్మిణానికి నాంది పలికాయి. అధికారంలో ఉన్నా, లేకున్నా ఎన్నడూ మనోధైర్యాన్ని కోల్పోలేదు. విమర్శలు వచ్చినా, విపత్తులు ఎదురైనా ఆయన సహనంతో ముందుకు సాగారు. విజయం మాత్రమే నాయకుడిని కొలిచే ప్రమాణం కాదు, కష్టకాలంలో చూపిన వ్యక్తిత్వమే అసలైన కొలమానమని తెలుగు ప్రజలు నిరూపించారు. మా జీవితంలో ఎన్నడూ మర్చిపోలేని ఘటన ఒకటి జరిగింది. రాజమండ్రి జైలులో చంద్రబాబును నిర్భంధించినప్పుడు, యావత్ దేశ ప్రజలు వచ్చి నిలబడ్డారు. ఆ ప్రేమ, ఆదరణ మా కుటుంబానికి అపారమైన ధైర్యమిచ్చింది. నాయకుడిగా ఆయన చేసిన కష్టం ప్రజలు మరిచిపోలేదు. ఆ రోజున ప్రజలు చూపిన ప్రేమ జీవితాంతం మాకు మరపురాని ఋణం’’ అని భువనేశ్వరి భావోద్వేగానికి గురయ్యారు. ఈ సందర్భంగా తెలుగు ప్రజలకు మాత్రమే కాదు, ఈ దేశ ప్రజలందరికీ మా కుటుంబం తరఫున పాదాభివందనాలు అన్నారు.
సోషల్ మీడియాను మంచికి వినియోగించండి
‘‘టెక్నాలజీ మనల్ని కలిపేందుకు వచ్చిందనుకున్నాం. కానీ అది మనల్ని నిశ్శబ్దంగా దూరం చేస్తోంది. 4నుండి 6 ఇంచ్‌ల స్క్రీన్‌లలో మనిషి జీవించడం మొదలైంది. తల్లిదండ్రులతో మాట్లాడటం తగ్గింది. స్నేహితులు, కుటుంబ సభ్యులతో హృదయానికి హృదయం కలిసే సంభాషణలు ఏమైపోయాయి. నేను సోషల్ మీడియా చెడు అని అనడం లేదు. ప్రపంచంలో ఏమి జరుగుతోందో తెలుసుకోవడం మంచిదే. కానీ మనం దానిలో మునిగిపోతూ, మన పక్కనేవున్న వారితో మాట్లాడటమే మర్చిపోతున్నాం. ఒకే ఇంట్లో నివసించే కుటుంబం సభ్యులు కూడా, ముఖం చూసి మాట్లాడకుండా మెసేజులు పంపుకుంటున్నారు. ఇదే మన మధ్య ఉన్న అనుబంధాన్ని డిస్టర్బ్ చేస్తున్నది. నేను మీ అందరికీ ఒక విజ్ఞప్తి చేస్తున్నాను, టెక్నాలజీని దుర్వినియోగం చేయొద్దు. మంచివాటికి వినియోగించండి, సమాజ అభివృద్ధికి ఉపయోగించండి. మనిషిని దగ్గర చేసేది సందేశాలు కాదు.. మనసుతో మాట్లాడే మాటే. ఈ రోజుల్లో ఒంటరితనం ఒక మహమ్మారి లాంటిదైపోయింది. ఒకరినొకరు చూడకుండా, వినకుండా, తోడుగా ఉండకుండా మనుషులు రోజులు గడిపేస్తున్నారు. మనమందరం ఎదుర్కొంటున్న, ఇంకా ఎదుర్కోబోతున్న సవాళ్లు ఎంతో పెద్దవి.
ప్రపంచం మన కాళ్లకింద నిశ్శబ్దంగా మారిపోతుంది. ఎప్పుడూ విడదీయలేదు అనుకునే బంధాలను కూడా టెక్నాలజీ దుర్వినియోగం దెబ్బతీస్తోంది. మన సమాజ బట్టలోని నూలు దారాలు క్రమంగా సడలిపోతున్నాయి. మన జీవితంలో అనిశ్చితి పెరిగింది. అందుకే నేను మనందరికీ, ముఖ్యంగా విశ్వవిద్యాలయాల్లో చదువుతున్న యువతకు విజ్ఞప్తి చేస్తున్నాను. ఇటువంటి సమయంలో దేశ, సమాజ క్షేమం కోసం మీరు ముందుకు రావాలి. భయం, విభజన ఇవి మన మనసులను అస్థిరం చేస్తున్నాయి. కలపాల్సింది బదులు విడదీయడానికి ప్రయత్నించే శక్తులు మన మధ్య పెరుగుతున్నాయి. ఈరోజు మన దేశం ఒక కీలక మలుపు వద్ద నిలిచింది. ప్రజలు, సమాజంలో విశ్వాసాన్ని మళ్లీ నిర్మించాలి. ఒత్తిడిలో ఉన్న ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించాలి. విభజన చెందిన సమాజాన్ని మరోసారి ఒకటిగా నిలబెట్టాలి. ఈ మార్గం కష్టం అనిపించినా, మన జాతీయ స్వభావం మనకు చూపిన విలువలను గుర్తు చేసుకుంటే దారి స్పష్టమవుతుంది. దేశభక్తి, నిజాయితీ, కష్టపడి పనిచేయడం. ఇవి దూరంలో ఉన్న ఆదర్శాలు కావు. సమాజం పునర్నిర్మాణానికి అవే బలమైన పునాది’’ అని భువనేశ్వరి విద్యార్థులకు పిలుపునిచ్చారు.
తోటివారికి సాయపడే తత్వం ఉండాలి
‘‘మనందరిలో సాయం చేసే గుణం, గౌరవం, మానవత్వంవంటి మంచి గుణాలున్నాయి. మనం సౌకర్యం కోసం కాకుండా నిజాయితీ కోసం నిలబడితే, మనకేం సంబంధం లేదని పక్కకు తప్పుకోకుండా మనుషులుగా స్పందిస్తే, మనకే లాభం వచ్చే పనులు కాకుండా మన చుట్టూ ఉన్నవారికి ఉపయపడే పనులు చేస్తే, అప్పుడు ప్రపంచానికి మనం ఎలాంటి మనుషులమో తెలుస్తుంది. మన సమాజంలో చాలామంది చిన్న చిన్న సేవలు చేస్తున్నారు. అది ఏదైనా సరే పెద్ద పని కావాల్సిన అవసరం లేదు. బాధలో ఉన్నవారికి అండగా నిలబడటం, అవసరమైనప్పుడు ముందుకు రావడం ఇవన్నీ హృదయంతో చేస్తున్నారు. ఎలాంటి ప్రతిఫలం వస్తుందో అన్న ఆశ లేకుండా చేస్తున్నారు. మనసుతో చేసిన మంచి పని ఎప్పటికైనా ఒకరోజు మనకి తిరిగొస్తుంది. అది ఒక కరుణగా రావచ్చు, దీవెనగా రావచ్చు, అవకాశం రూపంలో రావచ్చు. ఇదే మనల్ని ముందుకు నడిపిస్తుంటుంది. అందుకే మనకు పాడైపోయిన దాన్ని మళ్లీ సరిచేసే శక్తి ఉంది. మనలో కలిగిన విభజనను మళ్లీ ఐక్యతగా మార్చే శక్తి మనలోనే ఉంది. మన విలువలకు తగ్గ భవిష్యత్తును మనమే నిర్మించగలమనే ఆశ నాకు ఉంది. ముందున్న మార్గం సులభం కాదు. కానీ మన బలం, మన ఏకత్వం, మన నిబద్ధత, మన విలువలకు కట్టుబాటు, రేపు మంచి జరుగుతుందన్న నమ్మకం. ఇవి ఏ కష్టాన్నైనా జయించగలవు. ఇవి మనలో ఉన్నంతవరకు మనం భవిష్యత్తును ఎవరూ ఆపలేరు. పని చేయడం, కష్టపడడం ఇవి మాత్రమే మన మంత్రం. దానికి ఎలాంటి షార్ట్‌కట్ లేదు’’ అని భువనేశ్వరి పిలుపునిచ్చారు.
నమ్మకం, పట్టుదలతో పని చేయండి
‘‘మనందరికీ ఒక విజన్ ఉంటుంది. దాన్ని చేరుకోవాలంటే ఆలోచన, పట్టుదల, సహనం తప్పనిసరి. జీవితం ఎప్పుడూ సూటిగా ఉండదు. ప్రతి ఒక్కరు ఏదో ఒక అడ్డంకి తప్పనిసరిగా ఎదుర్కొవాలి. కానీ మనం పడిన కష్టాలే మనల్ని మరింత బలంగా మార్చుతాయి. మన కోసం ఒకరు నిజంగా నిలబడ్డా చాలు, ఆ ఒక్క నమ్మకమే మనల్ని ముందుకు నడిపిస్తుంది. మనసులో మంచి సంకల్పం ఉంటే, కాలం కూడా మనకు కలిసివస్తుంది’’ అని పేర్కొన్నారు.
రాష్ట్రాభివృద్ధే మన ధ్యేయం
‘‘ప్రజల కోసం అలుపెరగకుండా చంద్రబాబు గారు పనిచేస్తూ జీవితం గడిపారు. ‘‘ఇన్ని వాగ్దానాలు చేశారు. ఇవన్నీ ఎలా సాధ్యమవుతాయి?’’ అని నేను ఆయన్ని ఎన్నోసార్లు అడిగాను. అప్పుడు చెప్పిన సమాధానం ఒక్కటే..‘‘నేను రాష్ట్రం కోసం పనిచేస్తాను. డబ్బు తెస్తాను. నా ప్రజలను చూసుకుంటాను’’ అని ఆయన అన్నప్పుడు ఆయన నాకు భర్తగానే కాకుండా, ఒక బాధ్యతగల భారతీయుడిగానూ కనిపిస్తారు. ఆయనకు దేశంలోనే ఉన్నత పదవులను ఆఫర్ చేశారు. కానీ ఆయన దృష్టి మాత్రం ఎప్పటికి ఒకటే. అదే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి. మన రాష్ట్రం గత ఐదేళ్లు అనుభవించిన ఇబ్బందులు అందరికీ తెలుసు. ఆ కాలం ఇప్పుడు ముగిసింది. ఇప్పుడు మంచికాలం మొదలైంది. ప్రజల ప్రభుత్వం తిరిగి వచ్చిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పెట్టుబడిదారులకు నాయకత్వంపై నమ్మకం తిరిగి వచ్చింది.
అందుకే రాష్ట్రానికి పెద్దఎత్తున పెట్టుబడుల వరద వస్తుంది. సీఐఐ భాగస్వామ్య సదస్సులోనే రూ.13 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. దీంతో 16 లక్షల ఉద్యోగాలు సృష్టించబడతాయి. గూగుల్ విశాఖలో రూ.1.33 లక్షల కోట్లతో భారీ ఏఐ సిటీని నిర్మిస్తోంది. మిట్టల్ గ్రూప్స్ రూ.1.40 లక్షల కోట్లతో స్టీల్ ప్లాంట్ పెడుతోంది. బీపీసీఎల్ నెల్లూరులో రూ.94 వేల కోట్లతో రిఫైనరీ ఏర్పాటు చేస్తోంది. కుప్పంలో ఏకకాలంలో ఏడు పరిశ్రమలు, రూ.2,203 కోట్లు, 22,330 ఉద్యోగాలు వచ్చాయి. భోగాపురం విమానాశ్రయం 2026లో, పోలవరం 2027లో పూర్తవనున్నాయి. అమరావతి 2029లో సిద్ధమవుతుంది. లోకేష్‌ను కూడా ప్రత్యేకంగా అభినందించాలి. రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడం ఆయన బాధ్యత. ఆయన కూడా రేయింబవళ్లు కష్టపడి పనిచేస్తున్నారు’’ అని అన్నారు.
పోరాటాలను ఎదుర్కొని నిలబడాలి
‘‘పదవులు వస్తాయి.. పోతాయి. డబ్బు వస్తుంది.. పోతుంది. కానీ మనం పడిన కష్టం, పొందిన గౌరవమే మనల్ని నిలబెడతాయి. పట్టుదలతో ఎదగండి. కష్టాల్లోనే మన సంకల్పం పెరుగుతుంది. వ్యతిరేక పరిస్థితుల్లోనే మన గౌరవం వెలుగుతుంది. ప్రతి మనిషి జీవితంలో కనిపించే పోరాటాలు ఉంటాయి, కనిపించని పోరాటాలు ఉంటాయి. అవి మనల్ని తీర్చిదిద్దే గురువులు. పర్వతంలాంటి నమ్మకం, సముద్రంలాంటి ప్రేమ, సూర్యుడిలాంటి సేవ, ఈ మూడు ఉంటే మన జీవితం ముందుకు సాగుతుంది. జీవితాన్ని సింపుల్‌గా ఉంచండి. మంచితనంతో ఉంచండి. ఇతరులకు సేవ చేసే గుణాన్ని కలిగి ఉండండి. గౌరవంతో జీవించండి’’ అని విద్యార్ధులకు భువనేశ్వరి సందేశమిచ్చారు.













