పాతికేళ్ల క్రితం ఐటీ విప్లవంతో తెలుగువారు ప్రపంచమంతా విస్తరించారు
గత వైసీపీ విధ్వంసంతో రాష్ట్రం తీవ్రంగా నష్టపోయింది
కూటమి వచ్చాక ఒక్కోమెట్టు ఎక్కుతూ అభివృద్ధి సాధిస్తోంది
విజయవాడ ఏఐ ఫ్యూజన్ సమావేశంలో మంత్రి కొల్లు రవీంద్ర
విజయవాడ (చైతన్య రథం): నిన్నటి వరకు ప్రపంచాన్ని ఐటీ రంగం శాసిస్తే.. నేడు ఏఐ యుగం మొదలైంది. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుని ముందుకు వెళ్లాలని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. ఈమేరకు విజయవాడ ఏ కన్వెన్షన్‌లో నిర్వహించిన ఏఐ ఫ్యూజన్ (అమరావతి ప్రాంతంలో తొలి ఏఐ సమ్మిట్) ప్రారంభించారు. కార్యక్రమంలో మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ.. “పాతికేళ్ల క్రితం ఐటీ గురించి ముందుగానే గుర్తించి, వచ్చిన చిన్న అవకాశాలతో హైదరాబాద్‌కు అనేక ఐటీ కంపెనీలను తీసుకొచ్చారు ముఖ్యమంత్రి చంద్రబాబు. ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా ఐటీ రంగంలో లక్షలాది తెలుగువారు అత్యున్నత స్థానాలకు ఎదిగారు. ఇప్పుడు ఏఐలో అంతటి గొప్ప అవకాశాలు రాబోతున్నాయి. ఈ అవకాశాన్ని కూడా సద్వినియోగం చేసుకోవాలి. మన పిల్లలకు అవసరమైన సాంకేతిక జ్ఞానం అందించాలి. తద్వారా భవిష్యత్తును నిర్దేశించుకోవాలి” అని మంత్రి పిలుపునిచ్చారు. “వైసీపీ పాలనలో రాష్ట్రం అనేక విధాలుగా నష్టపోయింది. సుమారు 800 కంపెనీలు రాష్ట్రంనుండి వెళ్లిపోయాయి. పెట్టుబడిదారులు ఏపీకి రావాలంటేనే భయపడే పరిస్థితి వచ్చింది.
కూటమి అధికారంలోకి రాగానే పెట్టుబడిదారుల్లో మళ్లీ నమ్మకం కలిగించేలా 27 పాలసీలు తెచ్చాం. ఫలితంగా ఏపీకి పెట్టుబడులు భారీగా వస్తున్నాయి. గత రెండేళ్లలో దేశానికి వచ్చిన పెట్టుబడులలో 25శాతం ఏపీకే దక్కాయంటే.. అది నాయకుడు చంద్రబాబుపై ఉన్న నమ్మకం. మన విజన్‌పై ఉన్న గౌరవం” అన్నారు. “ప్రత్యేకంగా మన రాష్ట్రంలో రెన్యూవబుల్ ఎనర్జీ రంగంలో తీసుకున్న నిర్ణయాలు పెట్టుబడిదారులకు అపారమైన అవకాశాలు కల్పిస్తున్నాయి. దేశం మొత్తంలో ఒక గిగావాట్ డేటా ఉంటే.. ఏపీలో ఇప్పటికే మూడు గిగావాట్ల సామర్ధ్యం కలిగిన డేటా సెంటర్లు వచ్చాయి. మరో మూడు గిగావాట్ల డేటా సెంటర్లు రాబోతున్నాయి. ఇదంతా ముఖ్యమంత్రి ముందు చూపు కారణంగానే అని చెప్పడానికి గర్వంగా ఉంది” అన్నారు.
“ఏపీలో పుట్టిన కొంతమంది దుర్మార్గులు అమరావతి అక్కరలేదు అంటుంటే.. దేశం మొత్తం అమరావతే ఆంధ్రుల రాజధాని అని ఏకగ్రీవంగా తీర్మానించింది. ఏపీకి రాజధాని ఉండాల్సిన అవసరం లేదన్నట్లుగా జగన్‌రెడ్డి వ్యాఖ్యానించడం.. మావిగన్ అంటూ విచిత్ర ప్రతిపాదనలు తెరపైకి తేవడం సిగ్గుచేటు. గత ఐదేళ్ల పాలనలో రాష్ట్రంలో అమరావతి, పోలవరం సహా అనేక ప్రాజెక్టుల్ని నిర్వీర్యం చేశారు. కానీ నేడు కూటమి అధికారంలోకి రాగానే పోలవరం పనుల్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని పుష్కరాలనాటికి పూర్తి చేయబోతున్నాం. కేంద్ర సహకారంతో అమరావతి నిర్మాణాన్ని వేగవంతంగా చేస్తున్నాం. విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రయివేటీకరణ కాకుండా కాపాడుకున్నాం. కేంద్రం నుండి రూ.11 వేల కోట్ల ఆర్ధిక సాయంతో లాభాల బాటలోకి తెచ్చాం. అదే ప్రాంతంలో అర్సెలార్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ శంకుస్థాపన చేసుకున్నాం. తద్వారా లక్షమందికి పరోక్షంగా ఉద్యోగావకాశాలు రాబోతున్నాయి” అని కొల్లు పేర్కొన్నారు. “ఇక రాయలసీమలో ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్ రంగాలను అభివృద్ధి చేయబోతున్నాం. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 8 పోర్టుల్ని అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నాం. రాష్ట్రాన్ని సమగ్రంగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో అడుగులు వేస్తున్నాం. గతంలో ముఖ్యమంత్రి ఏఐ, బ్లాక్ చైన్ టెక్నాలజీ అంటే అర్ధం కాలేదు. కానీ.. నేడు వాటిని మన రాష్ట్రానికే తీసుకొచ్చారు. చంద్రబాబు ఆలోచనలకు తగ్గట్లుగా ముందుకు వెళ్తే మనదే విజయం” అని మంత్రి కొల్లు రవీంద్ర పిలుపునిచ్చారు.
















