అమరావతి (చైతన్యరథం): వినూత్న పద్ధతులతో పిల్లలకు విద్యా,బుద్ధులు నేర్పుతున్న ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడిపై విద్య, ఐటీశాఖల మంత్రి నారా లోకేష్ ప్రశంసలు కురిపించారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, ఆలమూరు మండలం, చింతలూరు గ్రామం, మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో సెకండరీ గ్రేడ్ టీచర్‌గా విధులు నిర్వర్తిస్తున్న వుడతా వెంకటేశ్వరరావు మాస్టారు.. బోధిస్తున్న Activity Based Learning పద్ధతులు చాలా బాగున్నాయని అభినందించారు. పిల్లలకు TaRL Teaching at Right Level) కిట్, క్షేత్ర పర్యటనలు, ప్రయోగాల ద్వారా బోధిస్తున్న తీరు ఆకట్టుకునేలా ఉంది. మీ పాప వుడతా వైష్ణవిని ప్రభుత్వ పాఠశాలలోనే చదివిస్తూ, ప్రజలకు ప్రభుత్వ పాఠశాలలపై నమ్మకం పెంచిన మీకు అభినందనలు. బడి ఆవరణలో కిచెన్ గార్డెన్ ద్వారా కూరగాయలు, న్యూట్రీ గార్డెన్ ద్వారా పండ్లు పండిస్తూ.. పిల్లలకు సేంద్రియ వ్యవసాయం, పోషక విలువల గల ఆహారం, పర్యావరణ పరిరక్షణ గురించి బోధిస్తున్న తీరు స్ఫూర్తిగా నిలుస్తోంది. గుడ్ టచ్, బ్యాడ్ టచ్, సామాజిక అంశాలు, వినూత్న బోధనా పద్ధతుల గురించి విద్యార్థుల్లో చైతన్యం నింపే వీడియోలు చాలా బాగున్నాయని మంత్రి లోకేష్ ప్రశంసించారు.














