- దేశ ఆరోగ్యాభివృద్దిలో పాలు పంచుకోవాలని సూచన
- ఘనంగా ఎయిమ్స్ తొలి స్నాతకోత్సవం
- ఎయిమ్స్ అభివృద్ధికి మరింత సహకరిస్తా: చంద్రబాబు
మంగళగిరి (చైతన్య రథం): యువ వైద్యులు గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లో వైద్య సేవలందించాలని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము సూచించారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఎయిమ్స్ తొలి స్నాతకోత్సవానికి ఆమె ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ప్రత్యేక విమానంలో గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న ముర్ముకు గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సహా పలువురు స్వాగతం పలికారు. అనంతరం ఎయిమ్స్‌కు చేరుకున్న రాష్ట్రపతి.. మొదటి బ్యాచ్‌గా వైద్య విద్య పూర్తి చేసుకున్న 49మంది ఎంబీబీఎస్ విద్యార్థులకు పట్టాలు ప్రదానం చేశారు.
‘‘వైద్య వృత్తిని ఎంచుకోవడం ద్వారా విద్యార్థులు మానవత్వంతో సేవ చేసే దారిని ఎంచుకున్నారు. ప్రజల ప్రాణాలు కాపాడి.. వారి ఆరోగ్యం మెరుగుపరిచే అమూల్యమైన అవకాశం మీకు వస్తుంది. మీలాంటి యువ వైద్యులు.. గ్రామీణ, గిరిజన, మారుమూల ప్రాంత ప్రజలకు సేవ చేసేందుకు ప్రాధాన్యమివ్వాలి. జాతి సమ్మిళిత ఆరోగ్య సంరక్షణలో ప్రత్యేకించి మీలాంటి యువ వైద్యులు కీలక పాత్ర పోషించాలి. ఈ దశలో మీరు చిత్తశుద్ధితో పనిచేసి.. దేశ ఆరోగ్యాభివృద్ధిలో పాలుపంచుకుంటారని ఆశిస్తున్నా’’ అని రాష్ట్రపతి పిలుపునిచ్చారు. ఆనందోత్సాహాల మధ్య సాగిన స్నాతకోత్సవంలో గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్, కేంద్ర ఆరోగ్య సహాయమంత్రి ప్రతాపరావు జాదవ్, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, రాష్ట్ర ఆరోగ్యమంత్రి సత్యకుమార్ యాదవ్, మానవ వనరుల అభివృద్ధి, ఐటీ మంత్రి నారా లోకేశ్ గౌరవ అతిథులుగా హాజరయ్యారు.
తొలుత భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. అధ్యాపకులు మరియు బంగారు పతక విజేతలతో గ్రూప్ ఫోటో సెషన్‌లో పాల్గొన్నారు. అనంతరం ఆడిటోరియం వద్ద అధ్యాపకులు మరియు స్నాతకోత్సవ విద్యార్థులతో జరిగిన అకాడమిక్ కార్యక్రమానికి హాజరయ్యారు. కేంద్ర ఆయుష్ సహాయ మంత్రి ప్రతాపరావు జాదవ్ స్నాతకోత్సవానికి అధ్యక్షత వహిస్తూ స్వాగతోపన్యాసం చేశారు. ఎయిమ్స్ డైరెక్టర్ డా. ప్రొఫెసర్ మధబానంద కర్.. మంగళగిరి ఎయిమ్స్ పురోగతి నివేదికను సమర్పించారు. ఈ సందర్భంలో అవార్డు గ్రహీత విద్యార్థులకు రాష్ట్రపతి ముర్ము బంగారు పతకాలు బహూకరించారు. కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ.. వైద్య సేవలలో శ్రేష్ఠత సాధించడానికి సాంకేతికత అవసరాన్ని నొక్కి చెప్పారు. ఎయిమ్స్ మంగళగిరి అభివృద్ధికి తనవంతు సహకారం ఎల్లప్పుడూ అందిస్తానని హామీ ఇచ్చారు. ముఖ్య అతిధిగా ద్రౌపతి ముర్ము స్నాతకోపన్యాసం చేస్తూ.. డిగ్రీలు అందుకున్న యువ వైద్యులందరికీ హృదయపూర్వక అభినందనలు తెలిపారు.
గ్రాడ్యుయేట్‌లలో మూడిరట రెండొంతులమంది మహిళా వైద్యులే ఉన్నారని, వైద్య వృత్తిలో పెరుగుతున్న మహిళల భాగస్వామ్యం., వారి గణనీయమైన సహకారంతో అభివృద్ధి చెందిన సమాజాన్ని నిరూపిస్తోందని నొక్కి చెప్పారు. అనంతరం ముఖ్య అతిథి ద్రౌపది ముర్ము, గౌరవ అతిథులను ఎయిమ్స్ విభాగం ఘనంగా సత్కరించింది. కేంద్ర ఆరోగ్య సహాయ మంత్రి ప్రతాప్రావు జాదవ్, ఏపీ వైద్య మంత్రి సత్యకుమార్ యాదవ్ 49మంది విద్యార్థులకు మరియు పోస్ట్ డాక్టోరల్ సర్టిఫికేట్ కోర్సు విద్యార్థులకు పట్టాలను ప్రదానం చేశారు. ఎయిమ్స్ మంగళగిరి- సెంటర్ ఫర్ మెడికల్ ఎడ్యుకేషన్ టెక్నాలజీ బ్రోచర్‌ను ఆవిష్కరించారు. అకడమిక్స్ డీన్ కుమార్ దాష్ స్నాతకోత్సవ ఆహూతులకు కృతజ్ఞతలు తెలిపారు. పోలీస్ బ్యాండ్ జాతీయ గీతంతో స్నాతకోత్సవం ముగిసింది. కార్యక్రమంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, ఎయిమ్స్ కార్యవర్గ సభ్యులు, అధ్యాపకులు, విద్యార్థులు, సిబ్బంది గ్రాడ్యుయేషన్ విద్యార్థుల తల్లిదండ్రులు ఉత్సాహంగా పాల్గొన్నారు.