అమరావతి (చైతన్యరథం): రోలర్ స్కేటింగ్‌లో ప్రతిభ చాటిన గ్రీష్మకు సీఎం చంద్రబాబు నాయుడు అభినందనలు తెలియజేశారు. ఈ మేరకు ఎక్స్‌లో పోస్ట్ చేశారు. తైవాన్‌లో జరిగిన ఆర్టిస్టిక్ రోలర్ స్కేటింగ్ ఛాంపియన్‌షిప్‌లో తెలుగమ్మాయి, విశాఖకు చెందిన యువ స్కేటర్ దొంతారా గ్రీష్మ మూడు విభాగాల్లో బంగారు పతకాలను సాధించడం రాష్ట్రానికి గర్వకారణమన్నారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలతో రాష్ట్రానికి, దేశానికి గ్రీష్మ మంచి పేరు తీసుకు వస్తుందని సీఎం చంద్రబాబు ఆకాంక్షించారు. ఈనెల 25 నుంచి 30 వరకు తైవాన్లో జరిగిన ఆర్టిస్టిక్ రోలర్ స్కేటింగ్ ఛాంపియన్ షిప్‌లో పాల్గొన్న గ్రీష్మ.. పెయిర్, పెయిర్ డ్యాన్స్, క్వార్టెట్లో పోటీ పడి మూడు బంగారు పతకాలను కైవసం చేసుకుంది. అంతేకాదు.. మరో రెండు ఈవెంట్లలోనూ నాలుగో స్థానంలో నిలిచింది. ప్రస్తుతం 16 ఏళ్ల ఆర్టిస్టిక్ స్కేటర్.. విశాఖ వ్యాలీ స్కూల్లో ప్లస్ టు చదువుతోంది.