- స్కూల్ డేస్‌లో నేను లాస్ట్ బెంచ్, అల్లరి బ్యాచ్
- చంద్రబాబు స్ఫూర్తితోనే రాజకీయాల్లోకి
- ఇష్టమైన కొటేషన్.. డేర్ టు డ్రీమ్… స్ట్రైవ్ టు అచీవ్
- విద్యార్థుల సరదా ప్రశ్నలకు మంత్రి లోకేష్ సమాధానాలు
అమరావతి: (చైతన్యరథం): షైనింగ్ స్టార్స్ కార్యక్రమంలో ప్రభుత్వ పాఠశాలల్లో పదోతరగతి ఉత్తమ విద్యార్థులకు సత్కార కార్యక్రమం సందర్భంగా విద్యార్థులు అడిగిన పలు సరదా ప్రశ్నలకు మంత్రి లోకేష్ ఉత్సాహంగా సమాధానాలిచ్చారు. మీకు స్కూలులో పరీక్షలు కష్టంగా ఉండేవా, అసెంబ్లీలో సభ్యులు అడిగే ప్రశ్నలు కష్టమా అని చీరాలకు చెందిన సంతోష్ ప్రశ్నించగా, పరీక్షలు రాయడం, అసెంబ్లీలో సమాధానాలు చెప్పడం రెండూ కష్టమైనవే. అయితే అసెంబ్లీ ప్రశ్నలను ఎదుర్కోవడం పూర్తిగా భిన్నమైనది. ప్రతిపక్షం సభలో లేకపోయినప్పటికీ అధికారపక్షం సభ్యులు ప్రతిపక్షం కంటే కష్టమైన ప్రశ్నలు అడుగుతున్నారని మంత్రి లోకేష్ చమత్కరించారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ప్రతిరోజూ తనకు మూడు ప్రశ్నలు వచ్చాయని, వాటికి సమాధానం చెప్పేందుకు ఎంతో ప్రిపేర్ కావాల్సి ఉంటుందని తెలిపారు. స్కూల్ డేస్‌లో నేను లాస్ట్ బెంచి అని, తమది అల్లరి బ్యాచ్ అని సరదాగా సమాధానమిచ్చారు. మీకు ఇష్టమైన కొటేషన్ ఏమిటని ఒక విద్యార్థి ప్రశ్నించగా సీఎం చంద్రబాబు చెప్పే ‘‘డేర్ టు డ్రీమ్… స్ట్రైవ్ టు ఎచీవ్’’ అనే కోట్ తమకు ఇష్టమైనదని చెప్పారు.
రాజకీయాల్లో ఎవరి నుంచి స్ఫూర్తి పొందారని మరో విద్యార్థి అడిగిన ప్రశ్నకు లోకేష్ సమాధానమిస్తూ…ఓటమి తర్వాత 2005లో చంద్రబాబుతో హైదరాబాద్‌లో ఓ ఫంక్షన్‌కి వెళ్లాను…ఆయనను చూడగానే గౌరవసూచకంగా అక్కడ ఉన్న 5వేలమంది లేచినిలబడ్డారు. రాజకీయాల్లో మంచిచేస్తే ప్రజల్లో గౌరవం ఎల్లప్పుడూ ఉంటుందని తెలుసుకున్నా. ఆనాడే రాజకీయాల్లోకి రావాలని నిర్ణయించుకున్నానని చెప్పారు. మీరు అదృష్టాన్ని నమ్ముతారా, హార్డ్ వర్క్ ను నమ్ముతారా అన్న ఓ విద్యార్థి ప్రశ్నకు లోకేష్ సమాధానమిస్తూ… జీవితంలో ఉన్నతస్థానాలకు చేరాలంటే కష్టపడి పనిచేయడం ఒక్కటే మార్గం, కష్టానికి ప్రత్యామ్నాయం లేదు, ఈ విషయంలో నేను చంద్రబాబునాయుడు, నరేంద్రమోదీ ద్వారా ప్రేరణ పొందాను. 226 రోజుల యువగళం పాదయాత్రలో ఎంతో నేర్చుకున్నానని చెప్పారు.
ప్యాసివ్ నుంచి యాక్టివ్ లెర్నింగ్‌కు
ఈ సందర్భంగా ప్రభుత్వ స్కూళ్లలో నెలకొన్న సమస్యలపై విద్యార్థుల నుంచి మంత్రి లోకేష్ ఫీడ్ బ్యాక్ తీసుకున్నారు. శ్రీకాకుళానికి చెందిన రౌతు హారిక మాట్లాడుతూ… వందరోజుల యాక్షన్ ప్లాన్ తమలో ఆత్మవిశ్వాసాన్ని పెంచిందని తెలిపింది. కేవలం విద్యాభ్యాసం మాత్రమే కాకుండా లైబ్రరీకి, ప్రాక్టికల్ లెర్నింగ్‌కు సమయం కేటాయించాలని కోరింది. దీనికి లోకేష్ సమాధానమిస్తూ… దీనిపై ఇప్పటికే కసరత్తు ప్రారంభించాం, ప్యాసివ్ లెర్నింగ్ నుంచి యాక్టివ్ లెర్నింగ్‌కు తేవాలన్నదే తమ లక్ష్యమని అన్నారు. పల్నాడు జిల్లా ఒప్పిచర్లకు చెందిన పావని మాట్లాడతూ… తమ గ్రామంలో రోడ్డు సరిగా లేదని.. టీచర్లు, విద్యార్థులు స్కూలుకు వెళ్లడానికి ఇబ్బందిగా ఉందని చెప్పగా, వెంటనే రోడ్డు వేయించే బాధ్యత తీసుకుంటానని మంత్రి లోకేష్ హామీ ఇచ్చారు. తమ స్కూలులో లైబ్రరీ, ల్యాబ్, ప్లేగ్రౌండ్ సౌకర్యం కల్పించాలని కూడా ఆమె కోరింది. సాత్విక అనే విద్యార్థిని మాట్లాడుతూ… తాము మంచి మార్కులు సాధించడానికి డిజిటల్ క్లాస్ రూమ్స్ బాగా ఉపయోగపడ్డాయని తెలిపింది. ఒకేషనల్ విద్యార్థులకు ల్యాబ్ ఫెసిలిటీస్ పెంచాలని కోరింది. అనంతపురం జిల్లా అమరాపురానికి చెందిన అక్షిత మాట్లాడుతూ… కెజిబివి స్కూళ్లలో అమలుచేస్తున్న పంచతంత్ర విధానం బాగుందని తెలిపింది. సౌకర్యాలు మెరుగుపర్చి గ్రామీణ ప్రాంత విద్యార్థులను ప్రోత్సహించాలని విజ్ఞప్తిచేసింది. విద్యార్థులకు మధ్యాహ్న భోజనంతోపాటు అందించే వెజిటబుల్ బిర్యానీతో పాటు రాగిజావ సరిగా ఉండటం లేదని పలువురు విద్యార్థులు మంత్రి దృష్టికి తెచ్చారు.