- మంత్రి చొరవతో గతంలో ఎన్‌ఐటీ కాలికట్‌లో సీటు పొందిన విద్యార్థి
- ఇంటర్ ధృవపత్రంలో తప్పును సరిదిద్ది గతంలో 25 మంది దివ్యాంగ విద్యార్థుల భవిష్యత్ కాపాడిన మంత్రి లోకేష్
అమరావతి (చైతన్యరథం): విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ చొరవతో గతంలో ఎన్‌ఐటీ కాలికట్‌లో సీటు పొందిన దివ్యాంగ విద్యార్థి సి.రఘునాథరెడ్డి ఏఐ స్టార్టప్ ను నెలకొల్పి పలువురికి స్ఫూర్తిగా నిలిచాడు. గతేడాది జులైలో దేశవ్యాప్తంగా వివిధ ప్రముఖ విద్యాసంస్థల్లో సీట్లు పొందిన దివ్యాంగ విద్యార్థులకు ఇంటర్మీడియట్ బోర్డు సర్టిఫికెట్ అప్ లోడ్ చేసే విషయంలో సమస్య ఎదురైంది. సదరు సమస్యను వాట్సాప్ ద్వారా మంత్రి లోకేష్ దృష్టికి తీసుకురావడంతో ఆయన మెరుపు వేగంతో స్పందించారు. దివ్యాంగ విద్యార్థుల సమస్య పరిష్కారానికి ప్రత్యేక జీవో విడుదల చేసి 25 మంది విద్యార్థుల భవిష్యత్‌ను కాపాడారు. దీంతో వారంతా పేరెన్నికగన్న ఐఐటీ, ఎన్‌ఐటీ వంటి జాతీయస్థాయి ఉన్నత విద్యాసంస్థల్లో ప్రవేశం పొందారు. తమకు అండగా నిలిచిన మంత్రి లోకేష్‌కు కృతజ్ఞతలు తెలిపారు. మంత్రి చొరవతో విజయవాడకు చెందిన సి.రఘునాథరెడ్డి ఎన్‌ఐటీ కాలికట్‌లో సీటు పొందాడు. తన ప్రతిభతో ఇటీవల విద్యార్థులో నైపుణ్యం, నెట్ వర్కింగ్ సామర్థ్యాల పెంపునకు ఎన్‌ఐటీ స్టార్టప్ ఇంక్యుబేటర్ ప్రోత్సాహంతో ఏఐ స్టార్టప్‌ను నెలకొల్పాడు. గతంలో మంత్రి లోకేష్ ఇచ్చిన సహకారం, మార్గదర్శకం వల్లే రాణించగలగుతున్నానని రఘునాథరెడ్డి ఎక్స్ ద్వారా కృతజ్ఞతలు తెలిపాడు. రఘునాథరెడ్డి ట్వీట్ పై స్పందించిన మంత్రి నారా లోకేష్.. మీ ప్రయాణం నిజంగా స్ఫూర్తిదాయకమన్నారు. మీ విజయంలో నేను చిన్న పాత్ర పోషించినందుకు సంతోషంగా ఉందన్నారు. ఏఐ స్టార్టప్‌ను నెలకొల్పిన రఘునాథరెడ్డిని, బృందాన్ని ఈ సందర్భంగా మంత్రి అభినందించారు. భవిష్యత్‌లో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.