అమరావతి (చైతన్య రథం): ఆత్మ విశ్వాసంతో ముందుకు అడుగులేస్తున్న దివ్యాంగులకు ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. ‘ఆత్మ విశ్వాసాన్ని అణువణువునా నింపుకుని అందరితో సమానంగా ముందడుగేస్తోన్న దివ్యాంగులకు ప్రపంచ దివ్యాంగుల దినోత్సవ శుభాకాంక్షలు. ప్రోత్సహిస్తే దివ్యాంగులు ఏదైనా సాధించగలరని మేం బలంగా నమ్ముతాం. అందుకే దివ్యాంగులకు మొదటి నుంచీ తెలుగుదేశం పార్టీ అండగా ఉంటోంది. దివ్యాంగుల కోసం మూడు చక్రాల మోటారు వాహనాలు, స్వయం ఉపాధి పొందేందుకు రూ.1 లక్ష సబ్సిడీతో రుణాలు అందించి అండగా నిలిచాం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే దివ్యాంగుల పింఛన్‌ను రూ.3 వేల నుంచి రూ.6 వేలకు పెంచి ఇస్తున్నాం. దేశంలో దివ్యాంగులకు రూ.6 వేలు పింఛను ఇస్తున్న ఏకైక రాష్ట్రం మనదేనని చెప్పడానికి చాలా సంతోషపడుతున్నాను. అవరోధాలను, సవాళ్లను అధిగమించి… మీరు జీవితంలో విజయం సాధించాలని కోరుకుంటున్నాను’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు ‘ఎక్స్’ వేదికపై పోస్టు చేశారు.