- విద్యుత్ శాఖపై రూ.1.3 లక్షల కోట్ల భారంమోపారు
- భవిష్యత్తులో విద్యుత్ చార్జీలు పెంచే ప్రసక్తే లేదు
- వైసీపీ ఒక్క మెగావాట్ విద్యుదుత్పత్తి చేయలేదు
- ఇంధన మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఉద్ఘాటన
బద్వేల్ (చైతన్య రథం): భవిష్యత్తులో విద్యుత్ ఛార్జీలను పెంచే ప్రసక్తి లేదని రాష్ట్ర ఇంధన మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్పష్టం చేశారు. విద్యుత్ వ్యవస్థను వైసీపీ ప్రభుత్వం సర్వనాశనం చేసిందన్నారు. గత ఐదేళ్ల పాలనలో విద్యుత్ శాఖపై వైసీపీ ప్రభుత్వం రూ.1.3 లక్షల కోట్లకుపైగా భారాన్ని మోపిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. 2014లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత సోలార్ ఎనర్జీ 7 వేల మెగావాట్లు ఉత్పత్తి చేసినట్లు పేర్కొన్నారు. అయితే ఐదేళ్లు అధికారంలో ఉన్న జగన్‌రెడ్డి ప్రభుత్వం ఒక్క మెగావాట్ విద్యుత్తు కూడా ఉత్పత్తి చేయలేదని దుయ్యబట్టారు. రాష్ట్ర ప్రభుత్వం పెద్దఎత్తున గ్రీన్ ఎనర్జీని ప్రోత్సహిస్తుందని, రాయలసీమ ప్రాంతం గ్రీన్‌ఎనర్జీకి అనువైన ప్రదేశమని తెలిపారు. రాయలసీమలో గ్రీన్ ఎనర్జీ పెట్టుబడులను తీసుకువచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని ఈమేరకు స్పష్టం చేశారు. సీమలో పెట్టుబడులు రావడం కారణంగా యువతకు పెద్దఎత్తున ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పన జరుగుతుందన్నారు. రాష్ట్ర ప్రజలందరూ పీఎం సూర్యఘర్, పీఎం కుసుమ్ పథకాలను వినియోగించుకోవాలని మంత్రి గొట్టిపాటి కోరారు.
విద్యుత్ శాఖ అధికారులతో మంత్రి గొట్టిపాటి సమీక్ష…
బద్వేల్ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ రితేష్‌రెడ్డి క్యాంపు కార్యాలయంలో విద్యుత్ శాఖ అధికారులతో మంత్రి గొట్టిపాటి రవికుమార్ సమీక్షా సమావేశం నిర్వహించారు. కడప జిల్లాలో జరుగుతున్న ఆర్డీఎస్‌ఎస్ పనుల్లో పురోగతిపై అధికారులతో చర్చించారు. అలాగే జిల్లాలో సబ్‌స్టేషన్ల నిర్మాణం, వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు, రైతులకు ట్రాన్స్‌ఫార్మర్ల పంపిణీ, గ్రామీణ ప్రాంతాల్లో లో-ఓల్టేజీ సమస్యలు లేకుండా తీసుకోవాల్సిన చర్యలపై అధికారుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. రైతులకు పగటిపూటనే 9 గంటలపాటు నాణ్యమైన విద్యుత్ అందించాలని స్పష్టం చేశారు. గృహాలకు, పరిశ్రమలకు 24 గంటల విద్యుత్ సరఫరా చేయాలని విద్యుత్ శాఖ అధికారులకు మంత్రి గొట్టిపాటి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
‘సుపరిపాలనలో తొలిఅడుగు’లో మంత్రి గొట్టిపాటి
బద్వేల్ నియోజకవర్గంలోని బాలాయపల్లిలో సుపరిపాలనలో తొలిఅడుగు కార్యక్రమంలో మంత్రి గొట్టిపాటి రవికుమార్ పాల్గొని ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ప్రతీ ఇంటికీ వెళ్లి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రజలకు వివరించారు. మేనిఫెస్టోలో ప్రకటించిన ప్రతీ హామీని అమలు చేస్తున్నామని, ఇప్పటికే దీపం పథకం కింద ఉచితంగా మూడు సిలిండర్లను అర్హులైన లబ్ధిదారులకు అందిస్తున్నట్టు మంత్రి గొట్టిపాటి రవికుమార్ గుర్తు చేశారు. దేశ చరిత్రలో ఎప్పుడూ లేనివిధంగా తల్లికి వందనం పథకం కోసం ఒక్కరోజే ప్రజల ఖాతాల్లో సుమారు రూ.10 వేల కోట్లు జమ చేశామన్నారు. ఆగస్టు 15నుంచి ఉచిత బస్సు పథకం అమలుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోందన్నారు. త్వరలోనే అన్నదాత సుఖీభవ పథకం కింద రైతులకు రూ.20 వేలు అందిస్తామని మంత్రి గొట్టిపాటి హామీ ఇచ్చారు.