రేపల్లె (చైతన్య రథం): సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా అన్నదాతా సుఖీభవ పథకాన్ని శనివారం తొలి విడత అమలు చేస్తున్నట్టు మంత్రి పార్థసారథి ప్రకటించారు. రైతులకు పెట్టుబడి సాయం కింద ఏడాదికి రూ.20వేలు మూడు విడతల్లో అందించనున్నట్టు వెల్లడిరచారు. బాపట్ల జిల్లా రేపల్లె మార్కెట్ యార్డులో మరో మంత్రి అనగాని సత్యప్రసాద్, ఎంపీ కృష్ణప్రసాద్‌లతో కలిసి ఆయన ‘అన్నదాతా సుఖీభవ’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రేపల్లె నియోజకవర్గంలో 28 వేల మంది రైతులకు రూ.15 కోట్లు అందిస్తున్నామన్నారు. ‘‘గత ప్రభుత్వ హయాంలో ధాన్యం డబ్బుల కోసం రైతులు రోడ్డెక్కారు. కూటమి ప్రభుత్వం 48 గంటల్లోనే ధాన్యం డబ్బులు చెల్లిస్తోంది. గత వైకాపా ప్రభుత్వం బకాయి పెట్టిన రూ.1,674 కోట్లు కూడా కూటమి చెల్లించింది. ఎరువులు, విత్తనాల కొరత లేకుండా చర్యలు తీసుకుంటున్నాం’’ అని పార్థసారథి వివరించారు.
అప్పుల బాధ నుంచి ఉపశమనం పొందేందుకే: మంత్రి శుభాష్
మరోవైపు రైతులు అప్పుల బాధ నుంచి ఉపశమనం పొందేందుకే అన్నదాతా సుఖీభవ పథకాన్ని తీసుకొచ్చినట్టు మంత్రి శుభాష్ వివరించారు. కృష్ణా జిల్లా కంకిపాడు మార్కెట్ యార్డులో నిర్వహించిన అన్నదాతా సుఖీభవ మొదటి విడత కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. రైతే రాజు అనే నినాదాన్ని కూటమి ప్రభుత్వం ఈ పథకం ద్వారా బలపరుస్తుందని స్పష్టం చేశారు.