- దానిని కాపాడుకునేందుకే జగన్ ఆరాటం
- పరామర్శల పేరుతో విధ్వంసానికి కుట్రలు
- వైసీపీ ఐదేళ్ల పాలనలో ఇరిగేషన్ నిర్వీర్యం
- గాడిన పెడుతున్న సీఎం చంద్రబాబు
- మీడియాతో మంత్రి నిమ్మల రామానాయుడు
- రెవిన్యూ, ఇరిగేషన్ అధికారులు సమన్వయంతో పని చేయాలని ఆదేశం
- చివరి ఎకరం వరకు సాగు నీరందేలా చూడాలని మార్గనిర్దేశం
గుడివాడ (చైతన్యరథం): వైసీపీ మునిగిపోతున్న నావ అని.. ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ ఆరాటమంతా దానిని కాపాడుకోవడానికేనని రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. రాష్ట్రంలో కక్షసాధింపు రాజకీయాలు నడుస్తున్నాయంటూ మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలకు మంత్రి రామానాయుడు కౌంటర్ ఇచ్చారు. మామిడికాయలకు… తలకాయలకు తేడా తెలియని వ్యక్తి జగన్ అని అభివర్ణించారు. వై నాట్ 175 లాంటిదే.. జగన్ 2.0 కూడా అని ఎద్దేవా చేశారు, అధికారంలోకి వస్తే ప్రజలకు చేసే మంచిని చెప్పాలని.. అంతేకానీ 2 కళ్లు పీకేస్తాం.. కాలు తీసేస్తాం… రప్పా రప్పా అంటూ నరికేస్తామంటే కుదురుతుందా అంటూ జగన్ ను ఆయన సూటిగా ప్రశ్నించారు. కృష్ణా జిల్లా పెడన, గుడివాడ నియోజకవర్గాల్లో మంత్రి నిమ్మల రామానాయుడు మంగళవారం పర్యటించారు. గుడివాడ నియోజకవర్గం గుడ్లవల్లేరులో మంత్రి నిమ్మల రామానాయుడు విలేకర్లతో మాట్లాడుతూ ఒక ఏడాది వరదలు వస్తే, రెండు, మూడు సంవత్సరాలకు సరిపడేలా వాటర్ మేనేజ్మెంట్ ద్వారా నీరు నిల్వ చేసుకోవాలని సీఎం చంద్రబాబు ఆదేశించారన్నారు. నాడు రూ.1350 కోట్లతో పట్టిసీమ నిర్మిస్తే, పట్టిసీమ కాదు ఒట్టి సీమ అని జగన్ విమర్శించాడు. ఆ విమర్శల్లో డొల్లతనాన్ని నిరూపిస్తూ కృష్ణా డెల్టాకు గోదావరి జలాలు తీసుకొచ్చి రూ.50 వేల కోట్ల ఆదాయం సృష్టించాం. వైసీపీ ప్రభుత్వంలో నిర్వీర్యమైన సాగునీటి సంఘాలకు చంద్రబాబు పునరుజ్జీవం పోయడంతో ఇరిగేషన్ వ్యవస్థ బాగు పడింది. వైసీపీ పాలనలో 5 ఏళ్ళు కాలువల్లో పూడిక తీత, డీ సిల్టింగ్ పనులు చేయలేదు. ఈ పనులకు వైసీపీ ప్రభుత్వంలో కనీసం రూ.100 కోట్లు కూడా కేటాయించకపొతే, కూటమి ప్రభుత్వం మొదటి ఏడాదే రూ.700 కోట్లతో కాలువలు పూడికతీత పనులు చేపట్టాం. శ్రీశైలం ప్లంజ్ పూల్ ప్రమాదం లో ఉంటే వైసీపీ 5ఏళ్ల పాలనలో ఒక్క రూపాయి కూడా మరమ్మతులకు ఇవ్వలేదు. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత శ్రీశైలం ప్లంజ్ పూల్ మారమ్మతులకు, ధవళేశ్వరం గేట్ల మరమ్మతులకు రూ. 350 కోట్లు కేటాయించామని మంత్రి నిమ్మల తెలిపారు.
విధ్వంసం సృష్టించేందుకే..
మద్యం కుంభకోణంలో జగన్ ముఠా దోపిడీ సొమ్ము దొరకడంతో.. ఆయనలో ఆందోళన మొదలైందన్నారు. అదీకాక వైఎస్ జగన్ మానసిక పరిస్థితి బాగోలేదని ధ్వజమెత్తారు. సంఘ విద్రోహ శక్తులు, ఉగ్రవాదుల మాదిరిగా వైఎస్ జగన్ ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. విధ్వంసం సృష్టించేందుకే.. పరామర్శల ముసుగులో వైఎస్ జగన్ పర్యటనలు చేస్తున్నారని విమర్శించారు.
2024లో జగన్ నుండి.. ఏపీ ప్రజలు విముక్తి పొందారని గుర్తు చేశారు. బ్రిటిష్ పాలన కంటే దారుణంగా ఉండే.. జగన్ ప్రభుత్వాన్ని ప్రజలు తిరిగి ఎందుకు కోరుకుంటారని వైసీపీ అధినేత వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. భవిష్యత్తులో ఇప్పుడున్న11 సీట్లు కూడా రావనే భావనతో.. రాష్ట్రంలో అశాంతి, అరాచకం సృష్టిస్తున్నారంటూ జగన్ వైఖరిపై మంత్రి నిమ్మల నిప్పులు చెరిగారు, అధికారంలో ఉన్నన్నాళ్లు తాడేపల్లి కొంవ దాటి బయటికి వచ్చిన దాఖలాలు ఉన్నాయా అంటూ జగన్ ను సందర్భంగా నిలదీశారు.
లాకులు, కాలువల పరిశీలన
అంతకుముందు మంత్రి నిమ్మల రామానాయుడు, ఎమ్మెల్యేలు కాగిత కృష్ణ ప్రసాద్, వెనిగండ్ల రాము, మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావుతో కలిసి గుడ్లవల్లేరు లాకులను పరిశీలించారు, కృష్ణా డెల్టా ఈస్టర్న్ కెనాల్ కింద ఉన్న గుడివాడ, పెడన కైకలూరు నియోజకవర్గల్లో సాగు నీటి సమస్యలను ప్రత్యక్షంగా పరిశీలించారు. ఈస్టర్న్ కెనాల్ కు 10,400 క్యూసెక్కులు విడుదల చేస్తున్నా, దిగువకు సాగు నీరు అందని పరిస్థితి ఉంది.. సీఈ దగ్గర నుండి కింద స్థాయి ఉద్యోగులు అందరూ కాలువలపై తిరుగుతూ సాగు నీటి సరఫరాను పర్యవేక్షించాలని మంత్రి నిమ్మల ఆదేశించారు. రెవెన్యూ, ఇరిగేషన్ అధికారుల సమన్వయంతో చివరి ఎకరం వరకు సాగు నీరు అందేలా చూడాలని కలెక్టర్ను ఆదేశించారు.