అవినీతి, అనైతికం, అక్రమార్జన వైసీపీ సంస్కృతి. దొంగలు, క్రిమినల్స్, తీవ్ర నేరాలు చేసినవారంతా వైసీపీలోనే ఉన్నారు. దొంగలు రాజ్యమేలితే ఎన్ని అనర్ధాలు చోటుచేసుకొంటాయో, ప్రజాధనం ఏవిధంగా దోపిడీకి గురవుతుందో జగన్ హయాంలో జరిగిన మద్యం కుంభకోణమే పెద్ద ఉదాహరణ. సిట్ వెల్లడిరచిన వాస్తావాలు చూస్తుంటే కళ్లు బైర్లు కమ్ముతున్నాయి. మద్యం మాఫియా వేలకోట్ల ప్రజాధనాన్ని ఏవిధంగా కొల్లగొట్టిందో చెప్పడానికి మద్యం కుంభకోణమే దుష్టాంతం. ఐదేళ్ల అడ్డగోలు పాలనలో ముఖ్యమంత్రి, ఆయన అనుచరులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, వైసీపీ నాయకులు అడ్డూ అదుపూ లేకుండా అనేక మార్గాలలో ఎన్ని వేలకోట్లు కొల్లగొట్టారో ఏ ఆర్ధిక నిపుణుడు నిగ్గుతేల్చగలడు? రాజ్యాంగ ప్రమాణాలకు పాతరేసి మద్యం, మైన్, శాండ్, గనులు, భూమాఫియా, మట్టి మాఫియా, అటవీ మాఫియా, వాగులు, వంకలు, కొండలు, చివరకు శ్మశానాలను సైతం వదలకుండా తిన్నవాడికి తిన్నంతగా తినిపించిన ఘనుడు జగన్‌రెడ్డి. అధికారాన్ని అవినీతి గనిగా మార్చారు. జగన్ పాలన అవినీతిపరులకు స్వర్గధామమైంది. లక్షల కోట్ల ప్రజాధనాన్ని బొక్కిన జగన్‌రెడ్డి ముఠాని చట్టబద్దంగా శిక్షించాలి.
అక్రమమార్గంలో జగన్ ముఠా దోచుకొన్న వేలకోట్లను కూటమి ప్రభుత్వం రెవెన్యూ రికవరీ చట్టాన్ని అమలుచేసి మొత్తాన్ని ఖజానాకు చేర్చాలి. జగన్‌రెడ్డి ముఠా చేసిన దోపిడీ సొమ్మును కక్కిస్తే.. ఆంధ్రప్రదేశ్ మిగులు బడ్జెట్‌వున్న రాష్ట్రంగా మారుతుంది. పాలకులం కాదు, సేవకులమంటూ నంగనాచి తనాన్ని అభినయించి.. జగన్ చేసిందంతా అవినీతే! లక్షల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని, అమూల్యమైన జాతిసంపదను పెద్దఎత్తున లూటీ చేశారు. పంచభూతాలను దిగమింగిన ఘనులు వైసీపీ నాయకులు. రాష్ట్రంలో జగన్ జమానాలో జరిగిన మద్యం కుంభకోణం దేశ చరిత్రలోనే అతి పెద్దది. అత్యధిక మద్యం సరఫరా ఆర్డర్లు దక్కించుకున్న కంపెనీలు, డిస్టిలరీలనుంచి నాటి ప్రభుత్వ పెద్దలు రూ.3,500 కోట్ల ముడుపులు దండుకున్నారని సిట్ ప్రాథమికంగా తేల్చింది. జగన్ హయాములో నాసిరకం మద్యం ధరలు ఏకంగా 43.7శాతం పెరిగాయి.
విషతుల్యమైన బ్రాండ్లను జనంమీదకు వదలడంతో.. ఆరోగ్యం దెబ్బతిని వైద్య ఖర్చుల రూపేణా అభాగ్యులు నష్టపోయింది రూ.40వేల కోట్లని సమాచారం. ప్రభుత్వ మద్యం మాయల కారణంగా రూ.18 వేల కోట్లకుపైగా రాష్ట్రాదాయం కోల్పోయింది. మాజీ సీఎం జగన్‌రెడ్డికి అత్యంత సన్నిహితులైన వైకాపా ఎంపీ మిథున్‌రెడ్డి, జగన్ కార్యదర్శి కె.ధనుంజయరెడ్డి, జగన్ ఓఎస్టీ పి కృష్ణమోహన్ రెడ్డి, వైకాపా నేత చెవిరెడ్డి భాస్కరరెడ్డి, జగన్ సతీమణి భారతి తరపున ఆర్థిక వ్యవహారాలు చూసే భారతి సిమెంట్స్ డైరెక్టర్ గోవిందప్ప బాలాజీ, నాటి ప్రభుత్వ పెద్దల తరపున ముడుపుల వసూళ్ల నెట్‌వర్క్ ద్వారా ఎప్పటికప్పుడు ఆ సొమ్మును జగన్‌కి చేర్చిన ప్రధాన నిందితుడు రాజ్ కెసిరెడ్డి, ఆయన అనుచరగణం సహా మొత్తం 12మంది కలిసి అతి పెద్ద భారీ కుంభకోణానికి పాల్పడ్డారు. 2019లో వైకాపా అధికారంలోకి రాగానే ముడుపులు కొల్లగొట్టేందుకు, దోపిడీకి వీలుగా నూతన మద్యం విధానాన్ని రూపొందించి ప్రభుత్వ మద్యం దుకాణాలు ద్వారా మద్యం తయారీ, కొనుగోలు, సరఫరా, విక్రయాలన్నింటినీ వైకాపా ముఠా గుత్తాధిపత్యంలో పెట్టుకుంది. జే బ్రాండ్ల మూలధర ఆధారంగా ఒక్కో మద్యం కేసుకు రూ.150-600 చొప్పున ముడుపులుగా నిర్ణయించి, అవి చెప్పిన కంపెనీలకే అత్యధికంగా సరఫరా ఆర్డర్లు ఇచ్చింది. అందుకు నిరాకరించిన కంపెనీల బ్రాండ్లను మార్కెట్‌నుంచి తరిమేసారు. ఇలా ముడుపుల రూపంలోనే రూ.3,500 కోట్లకు పైగా కొల్లగొట్టింది. రూ.లక్ష కోట్లకు పైగా మద్యం విక్రయాలను నగదు రూపంలోనే చేపట్టింది. రికార్డుల్లో చూపించకుండా సుంకం చెల్లించని మద్యాన్ని అమ్మి ఆ సొమ్ము దోపిడీ చేసినట్టు సిట్ వెల్లడిరచింది.
జగన్‌రెడ్డిలో స్వార్ధం, అత్యాశ పెరిగిపోయి నైతికత, విలువలు, మానవీయత కనుమరుగయ్యాయి. ఎలాగైనా సరే సంపాదించడమే జగన్‌రెడ్డికి ముఖ్యం. అత్యాశతో మంచిని, నైతికతను మరచి ఎలా దోపిడీకి పాల్పడ్డారో మద్యం కేసు విచారణలో సిట్ వెలుగులోకి తెచ్చిన సంఘటనలే సాక్ష్యాలు. సిట్ విచారణలో బయటపడిన భాగోతాలు చూసి జనానికి కళ్లు బైర్లు కమ్ముతున్నాయి. జె`ముఠా కొల్లగొట్టిన ప్రజాధనాన్ని స్వాధీనం చేసుకొని ప్రజా ప్రయోజనార్ధం వినియోగించేందుకు వీలుగా రెవెన్యూ రికవరీ చట్టాన్ని కూటమి ప్రభుత్వం అమల్లోకి తేవాలి. దోపిడీ సొమ్మును ఖజానాకు చేర్చి.. ప్రజా సంక్షేమానికి వినియోగించాలి. శిక్షలు పడతాయన్న భయం లేకపోవడం వల్లే జగన్ ముఠా విశ్వరూపం చూపింది. మద్యం మాఫియాపట్ల కూటమి ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలి. పేద ప్రజల ఆరోగ్యాన్ని, ఆర్ధిక వ్యవస్థను కకావికలం చేసిన వారిని ఉపేక్షించడం ఎంతమాత్రం మంచిది కాదు. తన దుష్పరిపాలనను మరిపించేందుకు పరామర్శల పేరిట శవరాజకీయాలు చేస్తున్నాడు జగన్. పొగాకు, మామిడి రైతులతో రాజకీయం చేసి లబ్ది పొందాలని చూశాడు. మద్యం కేసు సిట్ కట్టుకథేనని, ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని జగన్ ముఠా చెప్పడం.. నేరం నుంచి తప్పించుకునే ప్రయత్నమే. ఈ కుటిల యత్నాన్ని కూటమి ప్రభుత్వం తిప్పికొట్టక తప్పదు!
నీరుకొండ ప్రసాద్