- ఆ పార్టీ నాటకాలు చూసి ప్రజలు నవ్వుతున్నారు
- విజన్ డాక్యుమెంట్‌పై విస్తృతమైన చర్చ జరగాలి
- రేపటి భవిష్యత్ కోసం సిద్ధం చేసిన డాక్యుమెంట్ అది
- విజన్ `2020 సాకారాన్నీ నేటితరం తెలుసుకోవాలి
- ‘జమిలి’ అమల్లోకి వచ్చినా.. ఎన్నికలు ‘29లోనే
- వచ్చే కలెక్టర్ల సదస్సులో మార్పులు తెస్తున్నాం…
- మీడియాతో ఇష్టాగోష్ఠిలో సీఎం చంద్రబాబు
అమరావతి (చైతన్య రథం): జమిలి అమల్లోకి వచ్చినా.. ఎన్నికలు జరిగేది 2029లోనే అని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. మీడియాతో ఆయన ఇష్టాగోష్టిగా మాట్లాడారు. ‘‘ఒకే దేశం, ఒకే ఎన్నిక’’ విధానానికి ఇప్పటికే మా మద్దతు ప్రకటించాం. వైకాపా పబ్బం గడుపుకోవడానికి ఏదిపడితే అది మాట్లాడుతోంది. ఆ పార్టీ నేతలు ప్రజల్లో ఎప్పుడో విశ్వసనీయత కోల్పోయారు. వైకాపా చేసే నాటకాలు చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు. రాష్ట్రంలో సుస్థిర ప్రభుత్వం కొనసాగుతోంది. స్వర్ణాంధ్ర విజన్ `2047 డాక్యుమెంటును ప్రజల్లోకి మరింత తీసుకెళ్లాలి. వర్సిటీలు, కళాశాలలు, పాఠశాలలతో పాటు ప్రతి చోటా చర్చ జరగాలి. విజన్ 2020 సాకారమైన తీరు నేటితరం తెలుసుకోవాలి. గత పరిస్థితులను బేరీజు వేస్తే విప్లవాత్మక మార్పులు అందరికీ కనిపిస్తున్నాయి. 2047లోనూ ఇదే పునరావృతం అవుతుంది. స్వర్ణాంధ్ర విజన్ 2047 డాక్యుమెంట్ ఒకరోజు పెట్టి వదిలేసేది కాదు. భవిష్యత్తు తరాల బాగుకోసం చేసే ప్రయత్నంలో అందరి భాగస్వామ్యం కావాలి. రేపటి తరం భవిష్యత్తు కోసమే విజన్ 2047. సాగునీటి సంఘాలు, సహకార, ఇతరత్రా ఎన్నికలు షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయి అన్నారు.
ఈసారి కలెక్టర్ల సదస్సులో ఎన్నో మార్పులు తీసుకొస్తాం. సుదీర్ఘ సమీక్షలకు తావివ్వకుండా ప్రశ్నలు-సమాధానాల రూపంలో నిర్వహిస్తాం. ముందుగానే కలెక్టర్లు, ఎస్పీలకు చర్చ అంశాలు పంపి సమాధానాలు కోరతాం. దీంతో సమయం సద్వినియోగం కావడంతో పాటు మంత్రులు- అధికారుల మధ్య సమన్వయం పెరుగుతుంది. ఆసుపత్రిలో చేరిన భాజపా అగ్రనేత ఎల్‌కె అద్వానీ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నా. అద్వానీతో నాకు దశాబ్దాలుగా అనుబంధముంది. ఆనాడు ఏపీ అభివృద్ధిలో ఆయన సహకారం మరువలేనిది’’ అని చంద్రబాబు తెలిపారు.