- ఐదేళ్లలో కాలువలు, డ్రైన్లలో తట్ట మట్టి కూడా తీయలేదు.
- ఆర్థిక ఇబ్బందులున్నా రూ.380 కోట్లు విడుదల చేసిన సీఎం చంద్రబాబు
- మే లో కాలువల మరమ్మతులు
- అసెంబ్లీలో జలవనరుల మంత్రి నిమ్మల రామానాయుడు
అమరావతి (చైతన్యరథం): గత ఐదేళ్ళ వైసీపీ పాలనలో కాలువల నిర్వహణ గాలికొదిలేశారని, పరిపాలన విధ్వంసానికి గురైందని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ధ్వజమెత్తారు. సోమవారం అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో గోదావరి డెల్టా కాలువల మరమ్మత్తుల పనుల గురించి సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి నిమ్మల సమాధానమిచ్చారు. గత ప్రభుత్వంలో కాలువలకు నీరిచ్చినా చివరి భూములకు నీరందే పరిస్థితి ఉండేది కాదన్నారు. దీంతో దాతలు, రైతుల సహాకారంతో అత్యవసర పనులు చేసుకోవాల్సిన దుస్దితి ఉండేది. నీటి ప్రవాహానికి అడ్డుగా ఉన్న గుర్రపుడెక్క, తూటికాడ తొలగించేందుకు గత పాలకులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. పూడిక తీతకు సంబందించి డ్రైన్లు, కాలువలు, రిజర్వాయర్లు, చెరువుల్లో ఎక్కడా ఒక్క తట్ట మట్టి కూడా తీయలేదు. ఇంక లాకులు, గేట్లు, షట్టర్లు నిర్వహణ పనులను పూర్తిగా గాలికొదిలేశారు. కనీసం గ్రీజు పెట్టే పరిస్థితి కూడా లేదు.
గుండ్లకమ్మ, పులిచింతల గేట్లు, అన్నమయ్య డ్యాం కొట్టుకుపోయినా నాటి ముఖ్యమంత్రి జగన్మోహాన్ రెడ్డి కనీసం కన్నెత్తి కూడా చూడలేదని మంత్రి ఎద్దేవా చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత భారీ వరదలకు తుంగభద్ర డ్యాం గేట్లు కొట్టుకుపోతే, అప్పటికప్పుడు సీనియర్ ఇంజనీర్ కన్నయ్య నాయుడును తీసుకెళ్ళి, వరద ప్రవాహం ఉండగానే, దేశ చరిత్రలోనే మొదటిసారిగా స్టాప్‌లాగ్ గేట్లు ఏర్పాటు చేసి, రిజర్వాయర్‌లో నీటిని కాపాడామన్నారు. గత ప్రభుత్వానికి, ఈ ప్రభుత్వానికి ఇదే తేడా అని స్పష్టం చేశారు. అదేవిధంగా రాష్ట్ర ఆర్థిక పరిస్దితి బాగోలేకపోయినా అత్యవసర పనులు, మరమ్మత్తుల నిమిత్తం ముఖ్యమంత్రి చంద్రబాబు 380 కోట్ల రూపాయల నిధులు ఇచ్చారని తెలిపారు. గత ఐదేళ్లు గోదావరి డెల్టా కాలువల నిర్వహణ సరిగా లేక రైతులు ఇబ్బందులు ఎదుర్కొన్నారన్నారు. కూటమి ప్రభుత్వంలో ప్రస్తుత రబీ పంట పూర్తైన వెంటనే, మే నెలలో కాలువల మరమ్మత్తుల ప్రతిపాదనలు తీసుకున్నామన్నారు.
ఇలా రాష్ట్ర వ్యాప్తంగా 4971 పనులకు ప్రతి పాదనలు వచ్చాయని, ఈ పనులు చేయడానికి 336.43 కోట్ల రూపాయలు నిధులు అవసరం అని అంచనా వేసినట్లు తెలిపారు. వీటిలో గోదావరి డెల్టాకు సంబంధించి 1868 పనులకు రూ.129.38 కోట్లకు ప్రతిపాదనలు వచ్చాయన్నారు. ఈ పనులకు సంబంధించి అనుమతులు కోసం ఆర్థిక శాఖకు పంపించామన్నారు. గతంలో రైతులు చెల్లించే నీటి తీరువా పన్నుల నుండి వచ్చిన ఆదాయంతో ఈ పనులు చేసేవారమని, కానీ గత రెండు, మూడేళ్ళ నుండి నీటి తీరువా ఫండ్ కూడా ఏమీ లేకపోవడంతో, ఆర్థిక శాఖ సహాకారంతో ఈ పనులు చేయాల్సిన పరిస్దితి వచ్చిందని సభకు తెలిపారు. ఈ ప్రతిపాదనలను మార్చి నెలలోనే ఆర్థిక శాఖకు పంపి, ఈ పనుల అవసరాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళి, ఆయన సహకారంతో పనులు చేపడతామని తెలిపారు.
ఈ పనుల్లో కాంట్రాక్టర్లు నిర్లక్ష్యం చేస్తే, సంబంధిత ఏజెన్సీతో పాటు, అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. గోదావరి డెల్టాకు గుండెకాయ వంటి కాటన్ బ్యారేజి గేట్ల రిపేర్లను గత ప్రభుత్వం గాలికొదిలేయడంతో, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక, గేట్ల మరమ్మత్తుల కోసం, డ్రిప్-2 కింద రూ.164 కోట్ల రూపాయలతో ఆర్థిక శాఖకు ప్రతిపాదనలు పంపించిందని వివరించారు. డెల్టాలోని ఆఖరి ఎకరం వరకు సాగు నీరు అందించేందుకు రైతుల భాగస్వామ్యంతో సాగునీటి సంఘాలను తీసుకొచ్చామని తెలిపారు.