` జగన్‌లా మేమేమీ ప్రజల ఆస్తుల్ని లూటీ చేయలేదు
` తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకొని క్విడ్ ప్రోకో చేయలేదు
` మాపై మనీలాండరింగ్, సీబీఐ కేసులు లేవు
` నాడు వైసీపీ అరాచకాలు ఎదుర్కొని ప్రజల పక్షాన నిలబడినందుకే మాపై అక్రమ కేసులు
` మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి
అమరావతి (చైతన్యరథం): ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు క్యాబినెట్లో 96 శాతం మందిపై క్రిమినల్ కేసులు అంటూ జగన్ మీడియాలో వచ్చిన కథనాలు హాస్యాస్పదమని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి కొట్టేశారు. ఈ విషయంలో ఏడీఆర్ రిపోర్ట్‌ని వైసీపీ వక్రీకరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్‌లా మేమేమీ ప్రజల ఆస్తుల్ని లూటీ చేయలేదు, తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకొని క్విడ్ ప్రోకోకి పాల్పడలేదు. జగన్‌లా మాపై మనీలాండరింగ్, సీబీఐ కేసులు లేవు. మాపై కేసులన్నీ గత వైసీపీ ప్రభుత్వం కక్షపూరితంగా, అక్రమంగా నమోదు చేసినవే, నాడు వైసీపీ అరాచకాలు ఎదుర్కొని ప్రజల పక్షాన నిలబడినందుకే అక్రమ కేసులు మోపి టీడీపీ నాయకుల్ని జగన్ జైలుకి పంపారు. జగన్ సొంత నియోజకవర్గం పులివెందులలో అత్యాచార బాధితురాలి కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లిన టీడీపీ ఎస్సీ నాయకులపైనే ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టి జగన్ వేధించారు. ఇంతకంటే దుర్మార్గం మరొకటి ఉంటుందా? చంద్రబాబు నాయుడు ఏం తప్పు చేశారని అరెస్టు చేసి జైల్లో పెట్టారు? నాడు యువగళం పాదయాత్రలో లోకేష్‌పై అడుగడుగునా అక్రమ కేసులు నమోదు చేశారు. నాటి వైసీపీ క్యాబినెట్లో మంత్రులు అందరూ నేర చరిత్ర ఉన్నవారే, అందుకే ప్రజలు ఎన్నికల్లో వైసీపీకి పాడెకట్టారు. నేడు కూటమి పాలనలో మంత్రులందరూ ఉన్నత విద్యావంతులే. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పనిచేస్తోందని మంత్రి డా స్వామి స్పష్టం చేశారు.










