- కాల భైరవ ఆలయ సందర్శన
- విశాలాక్షి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పణ
వారణాసి (యుపి): పవిత్ర గంగానది ఒడ్డున కొలువై ఉన్న కాశీ విశ్వేశ్వరస్వామి ఆలయాన్ని రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ సోమవారం సతీసమేతంగా సందర్శించారు. జ్యోతిర్లింగాల్లో ప్రసిద్ధిగాంచిన కాశీ విశ్వేశ్వరుని ఆలయంలో లోకేష్ దంపతులు భక్తిప్రపత్తులతో పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అర్చకులు విశ్వనాధుని ఆలయ ప్రాశస్త్యాన్ని వివరించి, లోకేష్ దంపతులకు ఆశీర్వచనాలు చేశారు. అనంతరం శేషవస్త్రంతో సత్కరించి ప్రసాదాలను అందజేశారు. అంతకుముందుకు వారణాసిలోని పురాతన ఆలయాల్లో ఒకటైన కాలభైరవ స్వామి ఆలయాన్ని నారా లోకేష్, బ్రహ్మణి దంపతులు సందర్శించారు. విశ్వేశ్వరుని ఆలయ సందర్శన అనంతరం అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటైన కాశీ విశాలాక్షి ఆలయాన్ని లోకేష్ దంపతులు సందర్శించి పూజలు చేశారు. ఆది పరాశక్తి అవతారాల్లో 4వ అవతారంగా విశాలాక్షి దేవి కాశీలో అవతరించింది. ఈ సందర్భంగా విశాలాక్షి అమ్మవారికి లోకేష్ దంపతులు పట్టువస్త్రాలు సమర్పించారు.