- 4రోజుల దావోస్ సదస్సులో 45 సమావేశాల్లో పాల్గొన్న మంత్రి నారా లోకేష్
- ఆంధ్రప్రదేశ్ అనుకూలతలను ప్రపంచానికి వినిపించిన యువగళం
- పుట్టినరోజు నాడూ దావోస్లో పెట్టుబడుల వేట ఆపని యువనేత
- దావోస్ నుంచి బయలుదేరిన మంత్రి లోకేష్
దావోస్/స్విట్జర్లాండ్ (చైతన్యరథం): పుట్టినరోజు వేడుకలకు దూరంగా దేశం కాని దేశంలో పెట్టుబడుల వేట కొనసాగిస్తూనే ఉన్నారు విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్, రాష్ట్రానికి పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా వరల్డ్ ఎకనమిక్ ఫోరం (డబ్ల్యూఈఎఫ్) సదస్సు చివరిరోజున గురువారం రాత్రి పొద్దుపోయే వరకు దావోస్లో పారిశ్రామికవేత్తలతో చర్చలు జరుపుతూ మంత్రి లోకేష్ పలు సమావేశాల్లో పాల్గొన్నారు ఈ అంకితభావం, పట్టుదలే ఆయనను దేశంలోనే అత్యంత ప్రభావవంతమైన, ప్రతిభావంతమైన యువనేతగా నిలిపాయి.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెట్టుబడుల సాధన కోసం విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్, ఆర్టీజీ శాఖల మంత్రిగా లోకేష్ పడుతున్న తపన ఇతర రాష్ట్రాలు, దేశాల ప్రతినిధులను సంభ్రమాశ్చర్యాలకు గురిచేసింది. నాలుగు రోజులపాటు దావోస్లో జరిగిన వరల్డ్ ఎకనమిక్ ఫోరం సమావేశాలు ముగిశాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో రాష్ట్ర ప్రతినిధి బృందానికి నాయకత్వం వహిస్తున్న యువమంత్రి లోకేష్ అవిశ్రాంతంగా పెట్టుబడి చర్చలు కొనసాగించారు. ఈ 4 రోజుల్లో మంత్రి నారా లోకేష్ మొత్తం 45 కార్యక్రమాల్లో పాల్గొన్నారు. పారిశ్రామికవేత్తలతో 25 ముఖాముఖి చర్చలు, 2 గవర్నమెంటు టు గవర్నమెంట్ సమావేశాలు, 4 కాంగ్రెస్ సెషన్లు, 8 రౌండ్ టేబుల్ సమావేశాలు, 5 ఇంటర్నేషనల్ మీడియా ఇంటరాక్షన్స్లో ఆంధ్రప్రదేశ్ వనరులు, శక్తిసామర్థ్యాలు, రాయితీలు, అనుకూలతలను అద్భుతంగా విన్పించారు.
మంత్రి లోకేష్ చొరవతో ఆర్ఎంజడ్ సంస్థ రాష్ట్రంలో 10 బిలియన్ డాలర్ల భారీ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చింది. ఇది కేవలం ఆరంభం మాత్రమే. గత వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సులో చర్చలు జరిపిన జాతీయ, అంతర్జాతీయ స్థాయి సంస్థలు రూ.2.5 లక్షల కోట్ల పెట్టుబడులను గ్రౌండ్ చేశాయి. ఈసారి జరిగిన సమావేశాల్లో పెట్టుబడిదారుల ఆసక్తిని గమనిస్తే అంతకు రెట్టింపుస్థాయిలో ఈసారి రాష్ట్రానికి పెట్టుబడులు వచ్చే అవకాశాలు కన్పిస్తున్నాయి. ముఖ్యంగా ఏపీలో అనుసరిస్తున్న స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, సింగిల్ విండో అనుమతులు, సీఎం చంద్రబాబు నాయుడు సమర్థ నాయకత్వం పారిశ్రామికవేత్తలను ఆకర్షిస్తున్నాయి. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆమోదించిన 25 పారిశ్రామిక పాలసీలను, వాటివల్ల కలిగే ప్రయోజనాలను వివరించడంలో ఏపీ బృంద నాయకుడిగా నారా లోకేష్ సక్సెస్ అయ్యారు. వరల్డ్ ఎకనమిక్ ఫోరం వేదికగా ఏపీకి పెట్టుబడుల వేడుక తీసుకురానున్న మంత్రి లోకేష్. దావోస్ పర్యటనను విజయవంతంగా ముగించుకుని బయలుదేరారు. శనివారం ఉదయానికి హైదరాబాద్ చేరుకుంటారు.















