- మంత్రి లోకేష్‌ను కలిసిన స్టోన్ క్రాఫ్ట్ ప్రతినిధులు
- 15 రోజుల్లోనే అనుమతులు మంజూరుచేస్తామని మంత్రి హామీ
దావోస్/జ్యూరిచ్ (చైతన్యరథం): ఆంధ్రప్రదేశ్‌లో ప్రొఫెషనల్ గోల్ఫ్ అసోసియేషన్ ఆఫ్ అమెరికా (పీజీఏ) – ప్రామాణిక గోల్ఫ్ సిటీ ఏర్పాటుకు గల అవకాశాలను పరిశీలించాల్సిందిగా స్టోన్‌క్రాఫ్ట్ గ్రూప్ ప్రతినిధులను రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ కోరారు. వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సుకు హాజరయ్యేందుకు జ్యురిచ్ వెళ్లిన మంత్రి లోకేష్‌తో స్టోన్ క్రాఫ్ట్ గ్రూపు స్ట్రాటజిక్ గ్లోబల్ అడ్వయిజర్ ఫణి శ్రీపాద, సంస్థ ప్రతినిధులు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఫణి శ్రీపాద మాట్లాడుతూ… ప్రతిపాదిత ప్రపంచ స్థాయి గోల్ఫ్ సిటీ ఏపీలో ఏర్పాటైతే రాష్ట్రంలో పర్యాటకంతోపాటు ఆర్థికాభివృద్ధి చెందడమేగాక ప్రపంచ క్రీడా గమ్యస్థానంగా ఏపీ మారుతుందని అన్నారు. ప్రధాన నగరాల్లో ప్రణాళికాబద్ధమైన పీజీఏ-బ్రాండెడ్ గోల్ఫ్ కోర్సులను ప్రారంభించేందుకు భారతీయ కంపెనీలతో తాము భాగస్వామ్యం కలిగి ఉన్నట్లు చెప్పారు. 2007లో స్థాపితమైన స్టోన్ క్రాఫ్ట్ గ్రూప్ ఉడ్స్ శంషాబాద్ ప్రాజెక్టులో 153 వృక్షజాతులకు చెందిన 4.5లక్షల చెట్లతో అతిపెద్ద మియావాకీ ఫారెస్టును సృష్టించిందని తెలిపారు. పర్యావరణ సహిత లగ్జరీ రెసిడెన్షియల్ ప్రాజెక్ట్‌లలో తమ సంస్థ ప్రత్యేకత కలిగి ఉందని చెప్పారు.
శంషాబాద్ ప్రాజెక్ట్ విస్తరణ, గోవా వుడ్స్ ప్రాజెక్ట్, పీజీఏ-బ్రాండెడ్ గోల్ఫ్ సిటీ ఏర్పాటు తమ సంస్థ భవిష్యత్ లక్ష్యాలుగా వారు వివరించారు. తాము పీజీఏ కొలాబరేషన్‌తో గోల్ఫ్ సిటీ ఏర్పాటు చేస్తున్నందున ఆ సంస్థ గోల్ఫ్ నిపుణులను ధృవీకరించడమేగాక ప్రధాన టోర్నమెంట్లను నిర్వహిస్తుందని తెలిపారు. పీజీఏకు ప్రపంచవ్యాప్తంగా 14 దేశాలలో 17 బ్రాండెడ్ ప్రాపర్టీలు ఉన్నాయి. దాదాపు 29వేల మంది సభ్యులను కలిగి ఉండగా, వారు 60 దేశాలలో గోల్ఫ్ పరిశ్రమలో వివిధ హోదాల్లో పనిచేస్తున్నారని చెప్పారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ స్పందిస్తూ… ఏపీ రాజధాని అమరావతి శరవేగంగా అభివృద్ధి చెందుతూ ప్రపంచస్థాయి నగరంగా రూపుదిద్దుకుంటోందని తెలిపారు. చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ప్రజాప్రభుత్వం ఇన్వెస్టర్స్ ఫ్రెండ్లీ విధానాలను అమలుచేయడమేగాక దేశంలోని మరేరాష్ట్రంలో లేనివిధంగా ప్రోత్సహకాలను అందజేస్తోందని చెప్పారు. పూర్తిస్థాయి బ్లూప్రింట్ తో వస్తే 15రోజుల్లో ఏపీ ఎకనమిక్ డెవలప్‌మెంట్ బోర్డు అన్ని అనుమతులు మంజూరు చేస్తుందని తెలిపారు.