- అప్పుడే సమాజంలో మార్పు వస్తుంది
- విద్యాశాఖ మంత్రి లోకేష్ పిలుపు
- విద్యార్థులు, తల్లిదండ్రులతో కలిసి సీఎం చంద్రబాబు, లోకేష్ మధ్యాహ్న భోజనం
- చంద్రబాబు తిన్న ప్లేట్‌ను స్వయంగా తీసిన లోకేష్
కొత్తచెరువు (చైతన్యరథం): మహిళలను కించపరిచే పదాలు మానేయాలని, అప్పుడే సమాజంలో మార్పు వస్తుందని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఉద్బోధించారు. శ్రీ సత్యసాయి జిల్లా కొత్తచెరువు జడ్పీ హైస్కూల్‌లో గురువారం తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో ఆత్మీయ సమావేశం మెగా పీటీఎం 2.0 కార్యక్రమం అనంతరం బాలికల ఉన్నత పాఠశాలలో విద్యార్థులు, తల్లిదండ్రులతో కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్ మధ్యాహ్న భోజనం చేశారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యా ప్రమాణాలు, విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను మంత్రి లోకేష్ అడిగి తెలుసుకున్నారు. విద్యార్థిని సీ అంజలి, ఆమె తల్లి రాధమ్మను పలకరించిన మంత్రి లోకేష్.. మధ్యాహ్న భోజనంపై ఆరా తీశారు. రాధమ్మ యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. తనకు ఇద్దరు పిల్లలని, ఆర్థిక పరిస్థితులు బాగాలేక కుమారుడు భవన నిర్మాణ కార్మికుడిగా పనిచేస్తున్నాడని, కుమార్తె అంజలి 9వ తరగతి చదువుతోందని వివరించారు. తాను టైలరింగ్ చేస్తానని, నెలకు రూ.10వేల వరకు ఆదాయం వస్తుందని చెప్పారు.
మంత్రి స్పందిస్తూ.. కుమారుడిని పనికి పంపడం తనకు బాధగా ఉందని, కుమార్తెను బాగా చదివించాలని సూచించారు. తాను అన్ని విధాల అండగా నిలుస్తానని భరోసా ఇచ్చారు. ఏం కావాలనుకుంటున్నావని అంజలిని ప్రశ్నించగా.. తాను డాక్టర్ అవుతానంటూ విద్యార్థిని సమాధానం ఇచ్చింది. బాగా చదుకోవాలని ఈ సందర్భంగా మంత్రి ఆల్ ది బెస్ట్ చెప్పారు. పదో తరగతి చదివే బిందుప్రియ అనే విద్యార్థిని పలకరించిన మంత్రి లోకేష్.. భవిష్యత్ లక్ష్యం ఏమిటని ప్రశ్నించారు. ఇస్రో శాస్త్రవేత్త కావాలనేది తన లక్ష్యమని, గతేడాది ఇస్రో టూర్‌లో పాల్గొన్నానని, అప్పుడే ఇస్రో శాస్త్రవేత్త కావాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నానని బదులిచ్చింది. మంత్రి లోకేష్ స్పందిస్తూ.. నిన్నటి కేబినెట్‌లో ఏపీ స్పేస్ పాలసీని ఆమోదించామని ఈ సందర్భంగా తెలిపారు. బిందుప్రియకు ఆల్ ది బెస్ట్ చెప్పారు.
చంద్రబాబు తిన్న ప్లేట్‌ను స్వయంగా తీసిన లోకేష్
విద్యార్థులు, తల్లిదండ్రులతో సహపంక్తి భోజనం అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తిన్న ప్లేట్‌ను మంత్రి నారా లోకేష్ స్వయంగా తీశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రజాప్రతినిధులు, అధికారులు, పాఠశాల సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.