- ఆత్మగౌరవంతో కూడిన ప్రగతి ప్రయాణం
- మహిళను మహారాణిగా మార్చే దిశగా అద్భుతమైన అడుగు
- చిరుద్యోగులు, చిరువ్యాపారులు, కూలి పనులకు వెళ్లేవారికి ఎంతో వెసులుబాటు
- టీడీపీ ప్రభుత్వాల్లో తొలినుంచీ ఆడబిడ్డలకే అగ్రతాంబూలం
అమరావతి (చైతన్యరథం): కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల్లో కీలకమైన ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణాన్ని మహిళలకు అందుబాటులోకి తీసుకువచ్చింది. స్త్రీ శక్తి పేరుతో ఆర్టీసీ బస్సులను మహిళలకు చేరువ చేసింది. రాష్ట్రంలో ఇలాంటి కార్యక్రమం అమలు చేయడం ఇదే తొలిసారి. ఉచిత బస్సు పథకాన్ని ప్రారంభించగానే వైసీపీ వ్యతిరేక ప్రచారం ప్రారంభించింది. కొంత మంది పెయిన్ ఆర్టిస్టుల్ని పెట్టుకుని వ్యతిరేక వ్యాఖ్యలు చేయిస్తోంది. అయితే ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా ఇలాంటి ప్రచారం చేయడం వైసీపీ మూర్ఖత్వం. స్త్రీ శక్తి పథకంపై ప్రజల నుంచి సానుకూల స్పందన వస్తోంది. పాజిటివ్ ఫీడ్ బ్యాక్ వస్తోంది. బస్సుల్లో ప్రయాణించేది అత్యధికంగా మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి వాళ్లే. చార్జీల సొమ్ము మిగిలితే.. ఎంత ఆదా అవుతుందో వాళ్లకు స్పష్టమైన అవగాహన ఉంది.
అందుకే ఈ పథకంపై మహిళల్లో పూర్తి సానుకూలత వ్యక్తమవుతోంది. ఈ పథకం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏటా సుమారు రూ.2 వేల కోట్ల వరకు ఖర్చు చేయనుంది. దీనిపై సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్త మవుతున్నాయి. ముఖ్యంగా మహిళలు అయితే.. సీఎం చంద్రబాబుకు రుణపడి ఉంటామని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు.. కొన్ని ప్రాంతాల్లో అయితే..చంద్రబాబు చిత్రపటాలకు పాలాభిషేకాలు కూడా నిర్వహించి తమ సంతోషం వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని బస్టాండుల్లోనూ మహిళల సందడి పెరిగింది. కుటుంబాలకు కుటుంబాలు ఉచిత బస్సుల్లో ప్రయాణిస్తూ.. ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
కోడిగుడ్డుపై ఈకలు..
రాష్ట్ర వ్యాప్తంగా ఈ పథకంపై ఆనందం వ్యక్తం చేస్తుంటే.. వైసీపీ మాత్రం కోడిగుడ్డుపై ఈకలు పీకుతున్నట్టుగా.. ఈ పథకంపై పసలేని విమర్శలు చేస్తోందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి మాట్లాడుతూ.. మహిళలకు కూటమి సర్కారు అన్యాయం చేసిందని, ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం అంటూ మోసం చేసిందని అన్నారు. ఆర్టీసీలో మొత్తం 16 రకాల బస్సులు ఉన్నాయని, వాటిలో కేవలం 5 రకాల బస్సుల్లో మాత్రమే మహిళలకు ఉచిత ప్రయాణం అమలు చేస్తున్నారని వ్యాఖ్యానించారు. అంతేకాదు.. దూరప్రాంతాలకు వెళ్లేవారు.. నాలుగు బస్సులు మారి వెళ్లే పరిస్థితి ఏర్పడుతోందని కూడా విమర్శలు గుప్పించారు.
అయితే ఈ పథకం ముఖ్య ఉద్దేశం ఉద్యోగాలు, చిన్నాచితకా పనులు, చిరువ్యాపారాలు చేసుకునే మహిళలకు ఆర్థికభారం తగ్గించడమే. ఆ విషయంలో ఆయా వర్గాలకు చెందిన మహిళలు పూర్తి సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. విహారయాత్రలు, విలాసయాత్రలు చేసేవారి కోసం ఈ పథకం ప్రవేశపెట్టలేదు. ఈ విషయం మరిచి వైసీపీ నేతలు అడ్డగోలు విమర్శలు చేస్తున్నారు.
పేద మహిళలకు వరం
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉచిత బస్సు ప్రయాణం కేవలం ఆర్థిక భారాన్ని తగ్గించే పథకం మాత్రమే కాదు, ఇది మహిళల జీవితాల్లో ఆత్మగౌరవాన్ని నింపి, వారిని స్వతంత్రంగా ఎదిగేలా ప్రోత్సహించే ఒక సామాజిక విప్లవం. పూట గడవక పస్తులుండే పేద మహిళలకు ఈ పథకం ఒక వరంలా మారింది. వేలాది మంది మహిళలు పల్లెల నుంచి పట్టణాలకు వెళ్ళి పూలు, కూరగాయలు, తినుబండారాలు అమ్ముకొని సంపాదించుకోవచ్చు. ఇంతకుముందు బస్సు చార్జీలకే వారి సంపాదనలో సింహభాగం ఖర్చయ్యేది. సరిగ్గా వ్యాపారం జరగని రోజు పస్తులుండాల్సిన పరిస్థితి. ఇప్పుడు బస్సు చార్జీలు ఆదా అవుతుండడంతో, ఆ డబ్బు వారి కుటుంబ పోషణకు, పిల్లల చదువులకు ఉపయోగపడుతుంది. వారికి కడుపునిండా తిండి దొరుకుతుంది. ఇది కేవలం డబ్బు ఆదా చేయడం మాత్రమే కాదు, పస్తులు లేకుండా ఆత్మగౌరవంతో జీవించే హక్కును అందిస్తుంది. ఈ పథకం మహిళల ఆలోచనలకు, ఆకాంక్షలకు కొత్త రెక్కలు తొడుగుతుంది. ఇంటి పనులకు, వంట పనులకు మాత్రమే పరిమితమైన మహిళలు, ఇప్పుడు చిన్న చిన్న ఉద్యోగాలు చేయడానికి, స్వయం ఉపాధి పొందడానికి ధైర్యంగా ముందుకు వస్తారు.
టైలరింగ్, చేతి పనులు, కుటీర పరిశ్రమలు వంటి ఆలోచనలు వారిలో పెరిగి, అవి వాస్తవరూపం దాల్చే అవకాశం కలుగుతుంది. ఇది కేవలం వారి కుటుంబ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడమే కాకుండా, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు కూడా ఒక కొత్త ఊపునిస్తుంది. షాపింగ్‌కు, శుభకార్యాలకు, దేవాలయాలకు వెళ్ళేందుకు మహిళలు ఉచిత బస్సు సేవలను ఉపయోగించుకుంటారు. ఇది పట్టణ ప్రాంతాల్లో వ్యాపారాలను ప్రోత్సహించి, ఆర్థిక లావాదేవీలను పెంచుతుంది. మహిళలు వ్యక్తిగతంగా సాధికారత సాధించడం ద్వారా సమాజంలో వారి పాత్ర మరింత బలోపేతం అవుతుంది. ఆగిపోయిన చదువులను మళ్ళీ కొనసాగించడం, కొత్త నైపుణ్యాలను నేర్చుకోవడం వంటి మార్పులు మహిళా సాధికారత దిశగా ఒక కొత్త ఉద్యమానికి నాంది పలుకుతాయి.ఈ ఉచిత బస్సు పథకం కేవలం ఒక రవాణా సేవ కాదు. ఇది మహిళల జీవితాల్లో కొత్త ఆశలను, అవకాశాలను నింపే ఒక సామాజిక, ఆర్థిక పునరుజ్జీవనం. ఇది ప్రతి మహిళను ‘మహారాణి’గా మార్చే దిశగా ఒక అద్భుతమైన అడుగు.
మహిళలకు తొలినుంచీ పెద్దపీట
రాష్ట్రం, దేశంలో మొట్టమొదటిసారిగా మహిళల అభివృద్ధి, సంక్షేమం గురించి మాట్లాడిన ఏకైక పార్టీ టీడీపీ. మొదటి సారిగా ఎన్టీఆర్ మహిళల గురించి ఆలోచించి ఆస్తిలో సమానహక్కు కల్పించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో మహిళలకు రిజర్వేషన్లు తీసుకొచ్చారు. మహిళలు సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలుగా ఎన్నికై తరువాత ఎమ్మెల్యేలు అయ్యారంటే దానికి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎన్టీఆర్ ఇచ్చిన 8శాతం రిజర్వేషన్లే కారణం. తరువాత చంద్రబాబు హయాంలో మహిళలకు ఆర్థిక స్వాతంత్య్రం తీసుకొచ్చారు. చదువుకోని మహిళలతో ఇంటికొకరి చొప్పున డ్వాక్రా సంఘాలు ఏర్పాటుచేశారు. మహిళలను చిన్నచూపు చూసే స్థితి నుండి ఇంటిని నడిపే పరిస్థితికి తీసుకు వచ్చింది టీడీపీనే. మహిళల కోసం వినూత్నమైన కార్య క్రమాలు చేపట్టింది టీడీపీనే. లక్షల మంది మహిళల జీవితాలు
బాగున్నాయంటే అది చంద్రబాబు వల్లే
డ్వాక్రా సంఘాలను తీసుకువచ్చింది టీడీపీనే. మహిళలను ఆర్థికంగా పైకి తీసుకురావడానికి వేసిన మొదటి అడుగు పాడి పరిశ్రమ. కట్టెల పొయ్యితో ఇబ్బంది పడుతున్న మహిళలలను చూసి సీఎం చంద్రబాబు.. దీపం పథకం ద్వారా వంటగ్యాస్ అందించారు. ఇప్పుడు దీపం పథకం -2 ద్వారా ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నారు. మరుగుదొడ్లు లేక ఇబ్బందులు పడుతుంటే ఆత్మగౌరవం పేరిట మరుగుదొడ్లు కట్టించింది టీడీపీనే. మధ్యాహ్న భోజన పథకం పెట్టి అందులోనూ మహిళలకు అవకాశం కల్పించారు. ఒంటరి మహిళలకు పెన్షన్ విధానానికి శ్రీకారం చుట్టింది టీడీపీనే. స్కూలుకు వెళ్లడానికి ఆడపిల్లలు ఇబ్బందులు పడుతుంటే ఆడపిల్లలందరికీ సైకిళ్లు అందించారు. ఉద్యోగాల్లో మహిళలకు 33శాతం రిజర్వేషన్లు పెట్టారు. ఆర్టీసీ కండక్టర్లుగా కూడా మహిళలను నియమించారు. గతంలో పసుపుకుంకుమ ద్వారా రూ.8,800 కోట్లు అందించి, రూ.10 వేల కోట్లు డ్వాక్రా రుణాలు మాఫీ చేశారు. ఉచితంగా 11 రకాల వైద్య సదుపాయాలు అందించారు. అన్న అమృతహస్తం కింద గర్భిణులకు ఉచితంగా అవసరమైన పరీక్షలు చేస్తున్నారు. బేబీ కిట్లు కూడా అందిస్తున్నారు. తల్లీబిడ్డ ఎక్స్ ప్రెస్, బాలామృతంతో పాటు ప్రసవం సమయంలో ఆర్థికసాయం అందిస్తున్నారు. ఇంట్లో ఎంత మంది పిల్లలున్నా తల్లికి వందనం ద్వారా ఒక్కొక్కరికి రూ.13 వేలు చొప్పున తల్లుల ఖాతాల్లో జమచేశారు.