తిరుపతి (చైతన్యరథం): మహిళలు అర్థిక స్వావలంబన సాధిస్తేనే అభివృద్ధి సాధ్యమని, మహిళల భాగస్వామ్యం లేకుండా వికసిత్ భారత్ సాధించలేమని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా అన్నారు. తిరుపతిలో నిర్వహిస్తున్న జాతీయ మహిళా సాధికారత సదస్సులో రెండో రోజు సోమవారం ఆయన మాట్లాడారు. కొన్నిచోట్ల పాఠశాలలు దూరంగా ఉండటం వల్ల కొందరు బాలికలు చదువుకు దూరమవుతున్నారని చెప్పారు. అలాంటి చోట సాంకేతికత సహాయంతో బాలికలు విద్యావంతులు అయ్యేలా చూడాలన్నారు. మహిళలను సామాజిక, ఆర్థిక, రాజకీయ, క్రీడా రంగాల్లో మరింత ముందుకి తీసుకువచ్చేలా రెండు రోజుల పాటు చర్చలు జరిగాయన్నారు. ప్రతి మహిళకు భద్రత, ఆత్మ నిర్భరత అందించాలి. పంచాయతీ స్థాయిలో కంప్యూటర్ సెంటర్ ఉండేలా చూడాలి. ప్రపంచ వ్యాప్తంగా ఐటీ, ఎకనామిక్ రంగాల్లో మహిళలు రాణిస్తున్నారు. మహిళలు ఆర్థిక స్వాతంత్య్రం సాధిస్తే.. భారత్ ఆర్థికంగా వృద్ధి చెందుతుంది. గ్రామంలోని ప్రతి మహిళకు పని కల్పించి, ఆర్థికంగా స్వతంత్రులను చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు, కమిటీలు ప్రణాళికలు రూపొందించాలి. దేశంలోని ఆఖరి మహిళకు కూడా ఫలితాలు అందేలా ప్రణాళికలు ఉండాలి. పంచాయతీ, మున్సిపాలిటీ నుంచి పార్లమెంట్ వరకు ప్రతి ఒక్కరూ మహిళల వృద్ధి కోసం కృషి చేయాలి. గ్రామీణ స్థాయి నుంచే మహిళల నాయకత్వాన్ని ప్రోత్సహించాలి. అన్ని రాష్ట్రాల్లో విమెన్ కమిటీలు ఏర్పాటు చేయాలి. గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలు ఆర్థిక, సామాజిక స్వావలంబన సాధించకపోతే మనం వికసిత్ భారత్ కల సాకారం చేసుకోలేమని ఓం బిర్లా అన్నారు.