- సుస్థిరాభివృద్ధిలో టెక్నాలజీ పాత్ర కీలకం
- అదే సమయంలో సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి
- లేడీ ఎంటర్‌ప్రెన్యూర్స్‌ను ప్రోత్సహించడంలో అలీప్ పాత్ర ప్రశంసనీయం
- అలీప్ అంతర్జాతీయ సదస్సులో నారా భువనేశ్వరి
విజయవాడ (చైతన్యరథం): సుస్థిరాభివృద్ధిలో టెక్నాలజీ అత్యంత కీలకపాత్ర పోషిస్తుందని సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి అన్నారు. సహజవనరులను దుర్వినియోగం చేయరాదని, భవిష్యత్తు తరాలకు సహజవనరులను అందించాలని ఆమె ఉద్బోధించారు. డిజిటల్ నేరాలపై అందరూ అవగాహన కలిగి ఉండాలన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా అసోసియేషన్ ఆఫ్ లేడీ ఎంటర్‌ప్రెన్యూర్స్ ఆఫ్ ఇండియా విజయవాడలోని నోవాటెల్ హోటల్‌లో మూడు రోజుల పాటు నిర్వహించే అలీప్ అంతర్జాతీయ సదస్సు తొలిరోజు శనివారం ముఖ్య అతిథిగా భువనేశ్వరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడంలో చేస్తున్న కృషిని భువనేశ్వరి ప్రశంసించారు.
విజయవంతమైన, పర్యావరణహిత వ్యాపార, పారిశ్రామిక సంస్థల నిర్వహణలో మహిళా పారిశ్రామిక వేత్తలకు కృత్రిమ మేధస్సు, బ్లాక్‌చెయిన్, పునరుత్పాదక ఇంధన రంగాల్లో నూతన ఆవిష్కరణలు ఎంతగానో ఉపకరిస్తాయన్నారు. ప్రస్తుతం వస్తున్న నూతన అవిష్కరణలు, స్మార్ట్ ఆటోమేషన్లతో పర్యావరణంపై పెద్దగా ప్రభావం లేకుండానే వ్యాపారాల వృద్ధి సాధ్యపడుతుందన్నారు. సామర్థ్యాల పెంపునకు, ఉద్యోగాల సృష్టికి, దీర్ఘకాలిక విజయాల సాధనకు నూతన ఆవిష్కరణలను స్వీకరించాలని మహిళా పారిశ్రామికవేత్తలకు ఉద్బోధించారు. మహిళల నూతన ఆవిష్కరణలతో ప్రపంచం ఉన్నత స్థితికి చేరుకుంటుందన్నారు. ఆయా రంగాలను ముందుండి నడిపించేలా, అందరికీ స్ఫూర్తిదాయకంగా మహిళా
పారిశ్రామికవేత్తలు ఎదగాలని భువనేశ్వరి ఆకాంక్షించారు.
అదే సమయంలో సాంకేతిక విజ్ఞానానికి మరోవైపు ఉన్న చీకటికోణం సైబర్ క్రైమ్ పట్ల అందరూ అప్రమత్తంగా ఉండాలన్నారు. పెరుగుతున్న సైబర్ నేరాల ప్రమాదంపై ఆందోళన వ్యక్తం చేశారు. సైబర్ నేరాలపై మహిళలు అప్రమత్తంగా ఉండాలన్నారు. వీటిపై అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉందన్నారు. సాంకేతిక నిపుణులు, చట్టాలను అమలు చేసే అధికారులు సహా ఎవరూ కూడా ఆన్‌లైన్ మోసాలకు అతీతులు కాదన్నారు. సైబర్ నేరస్థులను హృదయం లేని క్రూరమైన వ్యక్తులుగా అభివర్ణించారు. వీటిపై ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని, డిజిటల్ లావాదేవీలు, సైబర్ సెక్యూరిటీపై మరింత అవగాహన పెంచుకోవాలన్నారు. నేటి ఈ డిజిటల్ ప్రపంచంలో ఆన్‌లైన్ బెదిరింపులు, మోసాల గురించి ప్రతి ఒక్కరూ తమ కుటుంబ సభ్యులకు తెలియజెప్పి నివారణ చర్యలపై పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాలన్నారు.