- పాలనలో డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ అత్యంత ముఖ్యం
- వాట్సప్ గవర్నెన్సు ద్వారా ఏపీలో 751 పౌరసేవలు
- క్వాంటం టెక్నాలజీపై ప్రత్యేక దృష్టి
- ప్రధాని స్వదేశీ ఉత్పత్తుల నినాదాన్ని స్వాగతిస్తున్నాం
- విశాఖలో జరిగిన 28వ జాతీయ ఈ-గవర్నెన్స్ సదస్సులో సీఎం చంద్రబాబు
విశాఖపట్నం (చైతన్యరథం): పాలనలో డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ అత్యంత ముఖ్యమైన అంశమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. సాంకేతికతతోనే ప్రజలకు పాలను మరింత చేరువ చేసే అవకాశం ఉంటుందన్నారు. కేంద్ర ఐటీ, సమాచార మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో విశాఖలో రెండు రోజుల పాటు నిర్వహించనున్న జాతీయ ఈ-గవర్నెన్స్ సదస్సు తొలిరోజు సోమవారం సీఎం చంద్రబాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సివిల్ సర్సీసెస్ -డిజిటల్ ట్రాన్సఫర్మేషన్ థీమ్తో జరుగుతున్న 28వ జాతీయ ఈ-గవర్నెన్స్ సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ ప్రభుత్వ శాఖల ద్వారా అందే పౌర సేవలను మరింత సమర్థంగా నిర్వహించేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ లాంటి సాంకేతికత కీలకమని స్పష్టం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ఐటీ, ఈ – గవర్నెన్స్ అంశాలతో పాలనలో అనేక మార్పులు వచ్చాయన్నారు. కమ్యూనికేషన్ సంస్కరణల ద్వారా ప్రజా జీవనంలోనూ విప్లవాత్మక మార్పులు చోటు చేసుకున్నాయన్నారు. సాంకేతికతను అందిపుచ్చుకుని గతంలోనే ఉమ్మడి ఏపీలో ఈ-సేవ, మీ-సేవ ద్వారా ప్రభుత్వ శాఖలు అందించే పౌర సేవలను ప్రజల దగ్గరకు తీసుకెళ్లామని సీఎం గుర్తుచేశారు. ఈ-ఫైల్స్, ఈ-కేబినెట్ లాంటి అంశాలతో వేగంగా నిర్ణయాలు తీసుకునేందుకు ఆస్కారం ఏర్పడిందన్నారు. అలాగే ఈ వ్యవస్థలను అమలు చేసే సమయంలో సైబర్ సెక్యూరిటీ కూడా అత్యంత కీలకమని స్పష్టం చేశారు. ఐటీతో వచ్చిన విస్తృత ప్రయోజనాలను అందిపుచ్చుకోగలుగుతున్నామన్నారు. ఈ ప్రక్రియను మరింతగా ముందుకు తీసుకెళ్లేందుకు మనమిత్ర వాట్సప్ గవర్నెన్సును అమలు చేస్తున్నామని సీఎం వివరించారు. మొత్తం 751 పౌరసేవల్ని వాట్సప్ ద్వారా పౌరులకు అందిస్తూ పాలనను వారి మొబైల్ ఫోన్ల వరకూ తీసుకెళ్లామని స్పష్టం చేశారు. మరోవైపు సాంకేతికత కారణంగా పొరుగు రాష్ట్రాలతోనూ పోటీ పెరిగిందని సీఎం చంద్రబాబు అన్నారు.
సంజీవని ప్రాజెక్టు దేశవ్యాప్తంగా అమలుకు అవకాశం
ఆంధ్రప్రదేశ్లో ఐబీఎం, టీసీఎస్, ఎల్ అండ్ సంస్థలతో కలిసి క్వాంటం వ్యాలీని ఏర్పాటు చేస్తున్నామని సీఎం వెల్లడించారు. క్వాంటం కంప్యూటర్ సేవలను ప్రభుత్వాలు, విద్య, వైద్య సంస్థలు వినియోగించుకునే అవకాశం ఉందని సీఎం సూచించారు. క్వాంటం వ్యాలీతో ఇక్కడ ఒక ఎకో సిస్టం ఏర్పాటు అవుతోందని సీఎం తెలిపారు. క్వాంటం కంప్యూటర్లు, పరికరాల తయారీ సంస్థలు కూడా పెట్టుబడులతో ముందుకు వచ్చాయని వివరించారు. టెక్నాలజీ పరంగా సేవలు, ఉద్యోగాలు,ఉత్పాదన, తదితర రంగాలు కూడా వేగంగా మారుతున్నాయని ఈ పరిస్థితుల మధ్య వచ్చే 10 ఏళ్ల కాలం మన దేశానికి అత్యంత కీలకమని ముఖ్యమంత్రి చెప్పారు. ప్రధాని మోదీ ఇచ్చిన స్వదేశీ ఉత్పత్తుల నినాదాన్ని స్వాగతిస్తున్నట్టు తెలిపిన ముఖ్యమంత్రి.. దానికి అనుగుణంగా దేశంలో తయారయ్యే ఉత్పత్తులు గ్లోబల్ బ్రాండ్స్ మారాలన్నారు. ఏపీలో వైద్య సేవలను టెక్నాలజీతో అనుసంధానం చేసే సంజీవని ప్రాజెక్టు చేపట్టామని ముఖ్యమంత్రి వెల్లడించారు. బిల్ గేట్స్ ఫౌండేషన్తో కలిసి డిజిటల్ హెల్త్ రికార్డులను రూపొందిస్తున్నామని.. త్వరలో ఈ వ్యవస్థను మొత్తం దేశవ్యాప్తంగా అమలు చేసేందుకు అస్కారం ఉందన్నారు. సాంకేతికతను అందిపుచ్చుకుని ప్రజలకు ఏ మేరకు ఈజ్ ఆఫ్ లివింగ్ను చేరువ చేశామన్న అంశాన్ని దృష్టిలో ఉంచుకోవాలని సీఎం చంద్రబాబు సూచించారు. గతంలో బీపీఓ విధానాన్ని అందిపుచ్చుకోవటం ద్వారా పెద్ద ఎత్తున యువతకు ఉద్యోగ అవకాశాలు లభించాయని ఇప్పుడు కొన్ని యాప్ ద్వారా వచ్చే ఆర్థిక ప్రయోజనాలు విదేశాలకు వెళు _న్నాయని ముఖ్యమంత్రి తెలిపారు. దీనిపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందన్నారు. టెక్నాలజీలో మరో కీలకమైన అంశంగా సెమీకండక్టర్ల పరిశ్రమ పైనా దృష్టి పెట్టాలని సూచించారు. ఓ సెమీ కండక్టర్ పరిశ్రమను ఏపీకి కేటాయించటంపై ప్రధానికి సీఎం ధన్యవాదాలు తెలిపారు. సమీప భవిష్యత్తులో స్పేస్, డ్రోన్, ఎలక్ట్రానిక్ సిటీ, మెడ్ టెక్ పార్కుల ద్వారా జాతీయ అభివృద్ధిలో ఏపీ కూడా ప్రధాన భాగస్వామి అవుతుందని సీఎం ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా డిజిటల్ ఏపీ సంచికను ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి సీఎస్ కె. విజయానంద్ తో పాటు కేంద్ర ఐటీ మంత్రిత్వశాఖ, రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు హాజరయ్యారు.