- కూటమి ప్రభుత్వ పాలన తొలి ఏడాదిలోనే రాష్ట్రం ఈ ఘనత సాధించడం సంతోషం
- తయారీ రంగంలో రూ.30లక్షల కోట్ల పెట్టుబడులు లక్ష్యం
- ఐటీ హబ్ గా విశాఖ, ఈ రంగంలో 5లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం
- ఆర్థిక వృద్ధికి చోదక కేంద్రంగా అమరావతి
- పీ-4 అమలుకు సీఐఐ తమవంతు సహకారం అందించాలి
- సీఐఐ కన్సల్టేటివ్ కమిటీ సమావేశంలో మంత్రి నారా లోకేష్
అమరావతి (చైతన్యరథం): రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తొలి ఏడాదిలోనే రాష్ట్ర ప్రజలు, పరిశ్రమదారులు, అధికార యంత్రాంగం అందరి సహకారంతో ఆర్థిక వృద్ధి రేటులో దేశంలో 2వ స్థానాన్ని సాధించగలిగామని రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ సంతోషం వ్యక్తంచేశారు. ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో మంగళవారం జరిగిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం` కాన్ఫడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్ ఆంధ్రప్రదేశ్ శాఖ (సీఐఐ-ఏపీ) తొలి జాయింట్ కన్సల్టేటివ్ ఫోరం సమావేశానికి మంత్రి లోకేష్ ముఖ్యఅతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ… దేశంలోనే ఏపీలో అతితక్కువ కాస్ట్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఉండేలా చర్యలు తీసుకుంటామని, రాష్ట్రంలో పెద్దఎత్తున పరిశ్రమల స్థాపనకు పారిశ్రామికవేత్తలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. పరిశ్రమదారులు కోరిన విధంగా ఇన్‌ఫ్రాస్ట్చక్చర్ పై దృష్టిసారిస్తామని చెప్పారు. విశాఖపట్నాన్ని ఐటి హబ్‌గా తయారుచేసేందుకు తాము కృతనిశ్చయంతో ఉన్నామని, ఐటి రంగంలో రాబోయే అయిదేళ్లలో 5లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పారు. విశాఖపట్నానికి పెద్దఎత్తున గ్లోబల్ కెపాసిటీ సెంటర్లు, డేటా సెంటర్లు రాబోతున్నందున, వీటికి అవసరమైన గ్రీన్ పవర్ సరఫరాకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పారు. విశాఖ నగరం ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా అవతరిస్తుందని, ఇందులో ఐటి కీలకపాత్ర వహించనుందని మంత్రి లోకేష్ తెలిపారు.
రూ.83వేల కోట్ల ఎఫ్‌డిఐల లక్ష్యం
తయారీ రంగంలో రూ.30 లక్షల కోట్ల పెట్టుబడులు, 5లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా నూతన పారిశ్రామిక విధానాన్ని రూపొందించాం, రాష్ట్రాన్ని 2 ట్రిలియన్ డాలర్ల ఆర్థికవ్యవస్థగా మార్చడం ద్వారా స్వర్ణాంధ్ర ప్రదేశ్, వికసిత్ భారత్ లక్ష్యాలను సాధించేందుకు దార్శనిక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేస్తున్న కృషికి సీఐఐ తమవంతు సహకారం అందించాలి., రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్‌గా మార్చే దిశగా ఏపీ ప్రభుత్వం ఇప్పటికే ప్రయాణాన్ని ప్రారంభించింది. ఇందులో భాగంగా 15 కీలక విధానాలను ప్రకటించింది. తయారీ రంగంలో ఈ ఏడాది రూ.83వేల కోట్ల ఎఫ్‌డిఐలను రాబట్టడంతోపాటు ఎగుమతులను రెట్టింపు చేయాలన్నది మా లక్ష్యం. రాష్ట్రంలో పేదరిక నిర్మూలన భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఉగాది రోజున ప్రారంభించిన పీ-4 కార్యక్రమానికి సీఐఐ తమవంతు సహకారం అందించాలని మంత్రి లోకేష్ కోరారు.
ఆర్థిక వృద్ధి కేంద్రంగా అమరావతి
రాజధాని అమరావతి ఆర్థికవృద్ధి కేంద్రంగా అవతరించి స్వర్ణాంధ్ర సాధనలో టెక్నాలజీ, విద్య, ఆర్థిక, క్రీడలు, ఆరోగ్యం, ఎలక్ట్రానిక్స్, పర్యాటకం, న్యాయసేవలు వంటివి కీలకపాత్ర పోషించబోతున్నాయి. భవిష్యత్తులో అమరావతిని ఆర్థికవృద్ధి, మానవవనరుల అభివృద్ధి, ఇన్నోవేషన్స్‌కు అనుకూల పర్యావరణ వ్యవస్థగా తీర్చిదిద్దబోతున్నాం. అమరావతిని శక్తివంతమైన నగరంగా నిలిపేందుకు టెక్నాలజీ, హెల్త్ కేర్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, టూరిజం రంగాల్లో ఏఐ సిటీ, మెడిసిటీ, క్వాంటమ్ వ్యాలీ, రింగ్ రోడ్డు, బౌద్ధ సర్క్యూట్ వంటి భారీ ప్రాజెక్టులు రాబోతున్నాయి. ఇందులో భాగస్వాములయ్యే పరిశ్రమదారులకు అవసరమైన సహాయ, సహకారాలు అందించి వ్యాపార నిర్వహణ వేగాన్ని పెంచడమే కన్సల్టేటివ్ ఫోరం ప్రధాన లక్ష్యం. ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్, ఆటోమొబైల్స్ అండ్ ఆటో కాంపోనెంట్స్, రసాయనాలు, పెట్రోకెమికల్స్, ఫార్మా అండ్ లైఫ్ సైన్సెస్, పునరుత్పాదక శక్తి , వ్యవసాయం, ఆహార శుద్ధి, లాజిస్టిక్స్, మౌలిక సదుపాయాలు, ఐటీ అండ్ ఎలక్ట్రానిక్స్, దుస్తులు, భవన నిర్మాణ సామగ్రి, ఖనిజ ఆధారిత పరిశ్రమలు వంటి వాటికి సంబంధించి రంగాల వారీగా కోఆర్డినేటర్లను నియమించామని మంత్రి లోకేష్ చెప్పారు. పరిశ్రమదారులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ఇకపై ప్రతి రెండునెలలకు ఒకసారి జాయింట్ కన్సల్టేటివ్ కమిటీ సమావేశం నిర్వహిస్తామని చెప్పారు.
యువత ఉపాధికి చేయూతనిస్తాం
సీఐఐ ఆంధ్రప్రదేశ్ శాఖ చైర్మన్ గన్నమని మురళీకృష్ణ మాట్లాడుతూ… ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సహకారంతో భారతీయ పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) విజయవాడలో మోడల్ కెరీర్ సెంటర్‌ను (ఎంసీసీ) ఏర్పాటు చేసింది. ఇది యువత వృత్తిపరమైన కౌన్సెలింగ్, సాఫ్ట్ స్కిల్ డెవలప్‌మెంట్, ఉద్యోగ నియామక కార్యక్రమాలకు కేంద్రంగా పనిచేస్తుంది. ఇందులో 5వేల మందికి శిక్షణ ఇస్తున్నాం. సీఐఐ నిరంతర పర్యవేక్షణతో ప్రభుత్వ లక్ష్యాల సాధనకు ఎంసీసీ తమవంతు సహకారం అందిస్తుంది. ఎంసీసీ తన కార్యక్రమాలను పొరుగు జిల్లాలకు కూడా విస్తరించాలని భావిస్తోంది, అక్కడ వృత్తి మార్గదర్శకత్వం, నిరుద్యోగం, పరిమిత వనరులకు సంబంధించిన సవాళ్లు కొనసాగుతున్నాయి. స్థానిక యువత కోసం అన్ని పరిశ్రమలలో ఉపాధి అవకాశాలను కల్పించేందుకు మావంతు సహకారం అందిస్తామని తెలిపారు.
సమావేశంలో రాష్ట్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్, చిన్న, మధ్యతరహా పరిశ్రమల మంత్రి కొండపల్లి శ్రీనివాస్, పరిశ్రమలశాఖ కార్యదర్శి ఎన్. యువరాజ్, పరిశ్రమలు, మౌలిక సదుపాయాలశాఖ సీనియర్ అధికారులు ముఖేష్ కుమార్ మీనా, సురేష్ కుమార్, జయలక్ష్మి, సీఐఐ ఏపీ వైస్ చైర్మన్ ఎస్.నరేంద్రకుమార్, మాజీ చైర్మన్లు గుంటూరు శివశంకర్, డి.రామకృష్ణ, జెఎస్‌ఆర్ కె ప్రసాద్, నీరజ్ శారద, దాట్ల తిరుపతిరాజు, ఆర్‌విఎస్ రుద్రరాజు, సురేష్ చిట్టూరి, విజయ్ నాయుడు గల్లా, పుష్పిత్ గార్గ్, సీఐఐ తిరుపతి రీజియన్ చైర్మన్ ఓబులాపల్లి జగన్నాథ్, వైస్ చైర్మన్ ఎస్‌పి రాజేంద్రన్, విజయవాడ రీజియన్ చైర్ పర్సన్ వి.నాగలక్ష్మి, వైస్ చైర్మన్ అభినవ్ కోటగిరి, విశాఖపట్నం రీజియన్ చైర్మన్ డివిఎస్ నారాయణరాజు, వైస్ చైర్మన్ జి.కృష్ణమోహన్, సీఐఐ ఐడబ్ల్యుఎన్ పాస్ట్ చైర్ పర్సన్ రమాదేవి గౌరినేని, మెంబర్ అవినాష్ చిలుకూరి, కన్వీనర్ (ఇన్ ఫ్రా అండ్ లాజిస్టిక్స్) జి.సాంబశివరావు, ఆహ్వానితులు రాచూరి కనకారావు, సీఐఐ సదరన్ రీజనల్ డైరక్టర్ ఎన్‌ఎంపి జయేష్, సీఐఐ ఏపీ హెడ్ బి.శ్రీనివాస్ సతీష్, విజయవాడ రీజియన్ హెడ్ చందన్ పట్నాయక్, డిప్యూటీ డైరెక్టర్ జెస్సి ఎ ఇనపర్తి, ఎగ్జిక్యూటివ్‌లు సివి రమేష్, యు.ఆకాష్, తదితరులు పాల్గొన్నారు.