- ఏపీని చూసి పొరుగు రాష్ట్రాలు అసూయపడే రోజు తీసుకువస్తాం
- వైసీపీ దుష్ప్రచారాలను టీడీపీ కార్యకర్తలు తిప్పికొట్టాలి
- టీడీపీ అంటే అనంతపురం.. అనంతపురం అంటే టీడీపీ
- ఈ జిల్లాకు ఎంత చేసినా తక్కువే
- జగన్ రెడ్డి ఏనాడు సొంత కార్యకర్తలను పట్టించుకోలేదు
- కల్యాణదుర్గం నియోజకవర్గ టీడీపీ కార్యకర్తలు, నేతలతో సమన్వయ సమావేశంలో మంత్రి లోకేష్
కల్యాణదుర్గం (చైతన్యరథం): సీఎం చంద్రబాబుకి ఉన్న అనుభవంతో రాష్ట్రాన్ని సమర్థంగా ముందుకు నడిపిస్తున్నారు.. ఏపీని చూసి పొరుగు రాష్ట్రాలు అసూయపడే రోజు తీసుకువస్తాం.. వైసీపీ దుష్ప్రచారాలను టీడీపీ కార్యకర్తలు తిప్పికొట్టాలని పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పిలుపు ఇచ్చారు. అనంతపురం జిల్లా కల్యాణదుర్గం నియోజకవర్గ టీడీపీ కార్యకర్తలు, నేతలతో శుక్రవారం మంత్రి లోకేష్ సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… మారుతున్న కాలానికి అనుగుణంగా టీడీపీ సిద్ధాంతాలను ముందుకు తీసుకెళ్లాలనే లక్ష్యంతో మొన్నటి కడప మహానాడులో కార్యకర్తలే మా అధినేత అని ప్రకటించామన్నారు. ఆ సిద్ధాంతానికి అనుగుణంగా కార్యకర్తలకు అందుబాటులో ఉంటున్న ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబుకి హృదయపూర్వక నమస్కారాలు.
కార్యకర్తలు నడిపించే పార్టీ ఒక్క తెలుగుదేశం పార్టీనే. నాకు అక్కా తమ్ముళ్లు, అన్నా చెల్లెళ్లు లేరు. స్వర్గీయ ఎన్టీఆర్ నాకు కోటి మంది టీడీపీ కుటుంబ సభ్యులను ఇచ్చారు. పసుపు జెండా, రంగును చూసినా మనకు ఎమోషనే. కార్యకర్తలను చూసి ఉత్సాహం తెచ్చుకున్న వ్యక్తి మీ లోకేష్. ఆనాడు పుంగనూరులో చూశాం. స్థానిక ఎన్నికలు జరుగుతుంటే అంజిరెడ్డి తాత పార్టీ కోసం వీరోచితంగా పోరాడారు. పార్టీ కోసం పోరాడిన మంజులారెడ్డి, చెన్నుపాటి గాంధీనే నాకు స్ఫూర్తి. జిల్లా పర్యటనలకు వచ్చినప్పుడు నేను కానీ, సీఎం చంద్రబాబు కానీ ముందుగా కార్యకర్తలను కలిసి వారి సమస్యలు తెలుసుకుంటున్నాం. కార్యకర్తల సంక్షేమం కోసం ఇప్పటికి రూ.135 కోట్లు ఖర్చు చేశాం. ఐదేళ్లు వైసీపీపై పోరాడారు. మీకు నేను ఎంత చేసినా తక్కువేనని మంత్రి లోకేష్ అన్నారు.
ఇబ్బందులున్నా ముందుకే..
వైసీపీ పాలనలో ఐదేళ్లు ఎన్నో ఇబ్బందులు పెట్టారు. నాపై అక్రమ కేసులు పెట్టారు. పాదయాత్రలో ఇబ్బందులకు గురిచేసినా కార్యకర్తలు అండగా నిలిచి నన్ను నడిపించారు. ఎక్కడికి వెళ్లినా ఘనంగా స్వాగతం పలికారు. ఇప్పుడు అందరూ వస్తారు. ఆ రోజుల్లో బయటకు రావాలంటే భయం. ఎక్కడ ఇబ్బంది పెడతారో, కేసులు పెడతారో అని. టీడీపీ అంటే అనంతపురం.. అనంతపురం అంటే టీడీపీ. మా కుటుంబాన్ని మీరు ఆశీర్వదించి దీవించారు. ఎన్టీఆర్‌ని, హరికృష్ణని, బాలకృష్ణని గెలిపించారు. జిల్లాకు ఎంత చేసిన తక్కువే. మొన్నటి ఎన్నికల్లో సూపర్ మెజార్టీ ఇచ్చారు. రాష్ట్రం ఇబ్బందుల్లో ఉంది. అయినా చంద్రబాబుకి ఉన్న అనుభవంతో సమర్థంగా రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తున్నారు. గత పాలకులు వెయ్యి రూపాయలు పెన్షన్ పెంచడానికి ఐదేళ్లు తీసుకుంటే.. కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే రూ.వెయ్యి పెంచింది. వృద్ధులకు రూ.4వేలు, వికలాంగులకు రూ.6వేలు, మంచానికే పరిమితమైన వారికి రూ.15వేలు పెన్షన్ అందిస్తున్నాం. దేశంలో ఏ రాష్ట్రం ఈ విధంగా పెన్షన్లు అందించడం లేదు. అన్నదాత సుఖీభవ, తల్లికి వందనం, ఉచిత గ్యాస్, బస్సు పథకం అందిస్తున్నామని మంత్రి లోకేష్ వివరించారు.
అభివృద్ధి, సంక్షేమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలి
ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి. నాకు సవాళ్లు అంటే ఇష్టం. అందుకే విద్యాశాఖను ఎంచుకున్నా. మంగళగిరిలో మొదటిసారి పోటీచేసినప్పుడు ఓడిపోయాను. అనేక రకాలుగా అవమానించారు. మొన్నటి ఎన్నికల్లో 91వేల మెజార్టీతో గెలిచా. అక్కడి నుంచి ప్రత్యర్థులకు సౌండ్ లేదు. మెగా డీఎస్సీపైనా అనేక విధాలుగా మాట్లాడారు. 150 రోజుల్లో నిర్వహించి నియామకాలు చేపట్టాం. అనేక పెట్టుబడులు తీసుకువస్తున్నాం. మన పిల్లల భవిష్యత్ కోసం సీఎం చంద్రబాబు అహర్నిశలు కష్టపడుతున్నారని మంత్రి లోకేష్ అన్నారు.
ఆ రోజు తీసుకువస్తాం
ఎన్నాళ్లు పక్కన ఉన్న తమిళనాడు, కర్ణాటక, తెలంగాణను చూసి అసూయపడతాం. ఏపీని చూసి పొరుగు రాష్ట్రాలు అసూయపడే రోజులు తీసుకువస్తాం. నియోజకవర్గ అభివృద్ధి కోసం సురేంద్రబాబు సొంత నిధులు ఖర్చు చేస్తున్నారు. ఉచిత డీఎస్సీ కోచింగ్ అందించడం ద్వారా 76 మంది ఉపాధ్యాయులుగా నియమితులు అయ్యారు. పనిచేసే వారిని నేను ప్రోత్సహిస్తా. మనం ఎదిగేకొద్దీ ఒదిగి ఉండాలి. మన డిక్షనరీ నుంచి అహంకారం అనే పదాన్ని తీసేయాలని మంత్రి లోకేష్ సూచించారు.
అబద్ధాలు చెప్పడంలో వైసీపీ దిట్ట
వైసీపీ హయాంలో చంద్రబాబుని అనేక రకాలుగా అవమానించారు. మా తల్లిని అవమానించారు. ఎవరినీ వదిలిపెట్టేది లేదు. శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ ఆలయంలో 9 మంది భక్తులు చనిపోయిన దుర్ఘటనలో ఆలయం నిర్వాహకులు పాండా మాట్లాడిన మాటలపై ఫేక్ వీడియో తయారుచేసి దుష్ప్రచారం చేశారు. గతంలో ఒకే సామాజికవర్గానికి చెందిన 34 మందికి డీఎస్పీ ప్రమోషన్లు ఇచ్చారని దుష్ప్రచారం చేశారు. ఇవన్నీ ఆ పార్టీ ఫేక్ ప్రచారానికి నిదర్శనం. పార్టీలో ఏమైనా సమస్యలు ఉండే మాట్లాడుకుని పరిష్కరించుకుందాం. పార్టీ నేతలు అలక వీడాలని మంత్రి లోకేష్ కోరారు.
ప్రభుత్వ కొనసాగింపు చాలా అవసరం
మహిళల జోలికి వెళితే ఉపేక్షించేది లేదు. మహిళలను అందరూ గౌరవించాలి. గాజులు తొడుక్కున్నావా, చీర కట్టుకున్నావా లాంటి పదాలను విడనాడాలి. టీడీపీ, జనసేన, బీజేపీ.. మూడు పార్టీలు కలిసికట్టుగా రాష్ట్రాన్ని, దేశాన్ని ముందుకు తీసుకెళ్తున్నాయి. పదిహేనేళ్ల పాటు మనం కలిసికట్టుగా కృషి చేసి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నిలుపుదామని పవనన్న చెబుతున్నారు. ప్రభుత్వ కొనసాగింపు చాలా అవసరం. గుజరాత్, ఒడిశాలో ప్రభుత్వ కొనసాగింపు వల్ల అభివృద్ధి జరిగింది. రాష్ట్రంలో మూడు పార్టీలు కలిసికట్టుగా ముందుకు వెళ్తాయని మంత్రి లోకేష్ స్పష్టం చేశారు.
కార్యకర్తలను పట్టించుకోని జగన్
శాంతిభద్రతలకు ఎవరు విఘాతం కలిగించినా వదిలిపెట్టం. జగన్ రెడ్డి ఏనాడూ సొంత కార్యకర్తలను పట్టించుకోలేదు. కార్యకర్తలకు కనీసం చేయి అందించరు.. కనీసం ఒక్క ఫోటో ఇవ్వరు. సొంత కార్యకర్త కారు కింద పడి చనిపోతే పక్కన పడేసి వెళ్లిపోయారు. దీనిని అందరూ గమనించాలని, కష్టపడి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందామని మంత్రి లోకేష్ పిలుపు ఇచ్చారు. సమావేశం అనంతరం టీడీపీ కార్యకర్తలను కలిసి అర్జీలు స్వీకరించారు. వారితో కలిసి ఫోటోలు దిగారు.
ఈ సమావేశంలో జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి టీజీ భరత్, కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు, అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, అనంతపురం జిల్లా టీడీపీ అధ్యక్షులు వెంకటశివుడు, జోనల్ కోఆర్డినేటర్, గుంటూరు మేయర్ కోవెలమూడి రవీంద్రబాబు, తదితరులు పాల్గొన్నారు.
““`












