- హామీలన్నీ అమలు చేస్తున్నాం
- వైసీపీ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే తప్పుడు విమర్శలు
అమరావతి (చైతన్యరథం): అభివృద్ధి, సంక్షేమం, విశ్వసనీయతకు కూటమి ప్రభుత్వం ప్రతిరూపమైతే ద్రోహం, అవినీతి, అహంకారం వైసీపీ అసలు నిజస్వరూపమని వ్యవసాయశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ధ్వజమెత్తారు. శాసనమండలిలో శుక్రవారం సూపర్ సిక్స్ పథకాలపై జరిగిన చర్చలో వైసీపీ సభ్యుల విమర్శలను మంత్రి అచ్చెన్నాయుడు తీవ్రస్థాయిలో తిప్పికొట్టారు. ప్రజలను అన్నివిధాలా మోసం చేసి వారి తిరస్కారానికి గురైన వైసీపీ.. కూటమి ప్రభుత్వ విజయాలపై నీతులు చెప్పడం హాస్యాస్పదం అన్నారు. వైసీపీ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు కూటమి విజయాలపై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారు. ఐదు సంవత్సరాల పాలనలో రాష్ట్రంలో ఆర్థిక విధ్వంసం సృష్టించి, 9.5 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేశారు, ఉద్యోగుల గురించి మాట్లాడే నైతిక హక్కు వైసీపీకి లేదు… ప్రతి శాఖలో అప్పులు చేశారు. పేదల కడుపు నింపుతున్న అన్న క్యాంటిన్లను తొలగించవద్దని ఆనాడు అసెంబ్లీలో జగన్ ను వేడుకున్నాం. కానీ జగన్ మనసు కరగలేదు. కక్షగట్టినట్లుగా పేదలకు రూ.5 భోజనాన్ని దూరం చేశారు. వైసీపీ హయాంలో రైతు భరోసా అంటూ రైతుల్ని మోసం చేశారు…12,500 పెట్టుబడి సాయంలో కేంద్రం సాయాన్ని కలిపి ఇచ్చి రైతుల్ని దగా చేశారు. ప్రతి ఏడాది జాబ్ క్యాలెండర్ ఇస్తామని నిరుద్యోగులను నిండా ముంచారు. నేడు శ్రీరంగ నీతులు మాట్లాడుతున్నారు..
సిగ్గుందా. ప్రజలు వైసీపీని తిరస్కరించారు. బుద్ధి తెచ్చుకుని ప్రభుత్వానికి మంచి సలహాలు ఇవ్వడం నేర్చుకోండి, వైసీపీ కార్యకర్తలకే వాలంటీర్ల ఉద్యోగాలు ఇచ్చారు, అధికారంలో ఉన్నప్పుడే వాటిని రెన్యూవల్ చేయలేక చేతులెత్తేశారు. గత ప్రభుత్వంలో స్థానిక ఎన్నికలలో ప్రత్యర్థి పార్టీలకు నామినేషన్లు వేసే అవకాశం లేకుండా చేశారు. నేడు కూటమి ప్రభుత్వంలో జరిగిన పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో ప్రజాస్వామ్యబద్ధంగా అన్ని పార్టీల అభ్యర్థులు నామినేషన్లు వేశారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఏ విధంగా నెరవేరుస్తామని కొంత ఆందోళన చెందాం. ముఖ్యమంత్రిగా చంద్రబాబు, కేంద్రంలో మోదీ నాయకత్వం వలనే హమీలు విజయవంతంగా అమలు చేసాం. ఇచ్చిన మాట ప్రకారం అన్నదాత సుఖీభవ పథకాన్ని 47 లక్షల మంది రైతులకు
అందచేశాం. 3 లక్షల కౌలు రైతులకు 10 వేలు చొప్పున రెండవ విడతలో అందచేయబోతున్నామని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు.