- 3వేల టీఎంసి వృధాజలాల్లో 200 టీఎంసీ వాడుకుంటే అభ్యంతరమా?
- మంత్రి లోకేష్ ఏం తప్పు మాట్లాడారని హరీష్‌రావుకు అక్కసు?
- ఏపీ ప్రజలను పాకిస్థాన్ తీవ్రవాదులుగా భావించొద్దు
- పరస్పరం సహకరించుకుందాం.. అన్నదమ్ముల్లా కొనసాగుదాం
- మంచి మనసుతో బనకచర్లకు సహకరించాలని కోరుతున్నాం
- నెల్లూరులో మీడియాతో ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి
నెల్లూరు (చైతన్య రథం): ఆంధ్ర రాష్ట్రానికి ప్రాణప్రదమైన, ప్రతిష్టాత్మకమైన బనకచర్ల ప్రాజెక్టుపై పొరుగు తెలుగు రాష్ట్రంలోని కొందరు రాజకీయ నేతలకు ద్వేషమెందుకని ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ప్రశ్నించారు. వృధాగా సముద్రంలోకి పోతున్న గోదావరి మిగులు జలాల్లో 200 టీఎంసీతో బనకచర్ల ప్రాజెక్టు నిర్మించుకుంటే తెలంగాణకు అభ్యంతరమెందుకన్న మంత్రి లోకేష్ మాటల్లో అభ్యంతరమేముందని ప్రశ్నించారు. ఏపీపై తెలంగాణ బీఆర్‌ఎస్ నేత హరీశ్ రావు ఎందుకు అక్కసు వెళ్లగక్కుతున్నారని నిలదీశారు. ఏపీ ప్రజలంటే తెలంగాణ సోదరులకు అంత ద్వేషమెందుకని ప్రశ్నిస్తూనే.. తెలుగు ప్రజలంతా బాగుండాలని మేం కోరుకుంటున్నాం. మీరేమో మమ్మల్ని పాకిస్థాన్ పౌరులుగా చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బనకచర్ల ప్రాజెక్టుపై తెలంగాణ లేవనెత్తుతున్న అభ్యంతరాలపై శుక్రవారం ఎమ్మెల్యే సోమిరెడ్డి మీడియాతో మాట్లాడారు. గోదావరిలో 1540 టీఎంసీ నికరజలాలుగా నిర్థారించి.. ఏపీకి 572 టీఎంసీ, తెలంగాణకు 968 టీఎంసీ కేటాయించారని గుర్తు చేశారు. అయితే, ఇప్పటివరకు అన్ని ప్రాజెక్టులనుంచి రెండు రాష్ట్రాలు కలిపి 800 టీఎంసీ కూడా వాడుకోలేకపోతున్నాయని గుర్తు చేశారు.
పోలవరం ప్రాజెక్టుకు 301 టీఎంసీ కేటాయింపు మాత్రమే జరిగిందని, ప్రాజెక్టు నిర్మాణం పూర్తికాక ఆ జలాలను ఇప్పటివరకు ఏపీ వాడుకోలేకపోయిందని సోమిరెడ్డి గుర్తు చేశారు. ‘పట్టిసీమ ద్వారా కొంత నీటిని పంపింగ్ చేసుకుంటున్నాం. అయినా ఏటా 2500 నుంచి 3 వేల టీఎంసీ గోదావరి జలాలు వరద రూపంలో సముద్రంలోకి పోతున్నాయి. వరదల కారణంగా గోదావరి పరీవాహక ప్రాంతంలోని ఏపీ రైతులు, ప్రజలు ఏటా రూ.2 వేల కోట్లు నష్టపోతున్నారు. ఎగువ భాగంలో తెలంగాణ ప్రజలకు ఎలాంటి వరద కష్టాలూ లేవు. ఈ పరిస్థితుల్లో వృధాజలాల వినియోగానికి బనకచర్ల ప్రాజెక్టు నిర్మిస్తే.. తెలంగాణ సోదరులకు వచ్చిన నష్టమేంటని సోమిరెడ్డి ప్రశ్నించారు. ‘తెలుగు బిడ్డలందరం కలిసి పెరిగాం. మీరూ ఉమ్మడి ఏపీలో మంత్రులుగా వ్యవహరించారు. రాష్ట్రం విడిపోయినంత మాత్రాన మన మధ్య విభేదాలెందుకు? సముద్రంలోకి గోదావరి జలాలు వృధాగానైనా పోనిస్తాం కానీ.. బనకచర్ల ప్రాజెక్టు ద్వారా ఏపీ వాడుకోవడానికి ఒప్పుకోబోమని హరీష్‌రావు వ్యాఖ్యానించడం బాధాకరం. ఒక్క చుక్క గోదావరి నీటిని కూడా ఏపీ ప్రజలు వాడుకోవడానికి లేదని చెప్పడానికి నోట మాటెలా వస్తుంది? అందరం అన్నదమ్ములమన్న విషయాన్ని తెలంగాణ సోదరులు మరచిపోవడం దారుణం. ఏపీ ప్రజలను పెహల్గాంలో దారుణానికి పాల్పడిన ఉగ్రవాదులుగా పరిగణిస్తున్నారా?’ అని సోమిరెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు.
గోదావరి నదిమీద తెలంగాణలో ప్రాజెక్టులు కట్టినా అభ్యంతరం చెప్పబోమని ముఖ్యమంత్రి చంద్రబాబు కేబినెట్ వేదికగా ఇప్పటికే స్పష్టం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు కింద 20 రిజర్వాయర్లు కట్టుకుని 450 టీఎంసీ వాడుకుంటున్నారు. నికర జలాలు 1540 టీఎంసీ పక్కన పెడితే మిగులు జలాలను కింద రాష్ట్రం వాడుకునే హక్కుంది. అవి కూడా వాడుకోవడానికి వీల్లేదంటే ఎలా? కాళేశ్వరానికి కేంద్రం స్పష్టమైన అనుమతులు ఇవ్వలేదని మాకు తెలుసు. అయినా కట్టుకున్నారు సంతోషం. బనకచర్ల ప్రాజెక్టుపై అభ్యంతరాలుంటే కేంద్రానికి నివేదించండి. మేంమాత్రం మా హక్కుగా మిగులు జలాలను రోజుకు 2 టీఎంసీ చొప్పున 200 టీఎంసీ వాడుకుంటాం. ఎగువ ప్రాంతంలో మీరు భారీగా ప్రాజెక్టులు కట్టి మాకు నీళ్లురాకపోతే నష్టపోయేది మేమే కదా. ఐదారేళ్లకు ఒకసారి గోదావరి మిగులు నీళ్లు రాకపోతే ఇబ్బందులు పడేది మేమే కదా. కరవొచ్చినా, వరదొచ్చినా నష్టాలు ఎదుర్కొనేది మేమే. అయినా.. అసలు ప్రాజెక్టే వద్దంటే ఎలా?’ అని సోమిరెడ్డి ప్రశ్నించారు. ‘ఏపీ ప్రజలతోపాటు తెలంగాణ బిడ్డలూ బాగుండాలని మేం కోరుకుంటున్నాం. హైదరాబాద్ అభివృద్ధి, ఐటీ సంస్థలు, ప్రాజెక్టులు, ఆదాయం, తలసరి ఆదాయం పెరగడం తదితర అంశాలన్నింటినీ చూసి తెలుగు ప్రజలుగా గర్వపడుతున్నాం. ఏపీలో ఓడరేవుల ఏర్పాటు, కొత్త పరిశ్రమల స్థాపనను మీరూ స్వాగతించి సంతోషించండి.
తెలుగు రాష్ట్రాలు సంపూర్ణంగా అభివృద్ధి చెందాలని, దేశంలోనే అగ్రస్థానంలోనే నిలవాలని మేం ఆకాంక్షిస్తాం. కేసీఆర్‌తో కలిసి మేమంతా ఉమ్మడి ఏపీలో ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా పనిచేశాం. స్నేహితులుగా మెలిగాం. తెలంగాణ సోదరులూ ఆలోచించండి. దయచేసి మమ్మల్ని ద్వేషించకండి. ఏపీ ప్రజలను కూడా మీ కుటుంబసభ్యులుగానే భావించండి. కరవు పరిస్థితులను ఎదుర్కొనే రాయలసీమ ప్రాంతానికి మిగులు జలాలను తరలించేందుకే బనకచర్ల ప్రాజెక్టు చేపడుతున్నాం. ఏడాదికి ఒక పంట పండిరచుకుంటే రాయలసీమ ప్రజలు కూడా అందరితో పాటు సంతోషంగా ఉంటారు. రాయలసీమ, నెల్లూరు, పల్నాడు ప్రాంతాల్లో 60 టీఎంసీతో అదనంగా 7.42 లక్షల ఎకరాలను సాగులోకి తెచ్చుకునే అవకాశం ఉంది. మరో 20 టీఎంసీతో 2.58 లక్షల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించుకోవచ్చు. 80 లక్షల మందికి తాగునీటి కోసం 20 టీఎంసీ, పరిశ్రమలకు మరో 20 టీఎంసీ కేటాయించేందుకు ఈ ప్రాజెక్టు చేపడుతున్నాం. గోదావరి జలాలు ఏపీకి తెచ్చి రాయలసీమను రతనాల సీమగా మారుస్తానని కేసీఆర్ ఇచ్చిన మాటను మరిచిపోతే ఎలా?’ అని సోమిరెడ్డి బాధాతప్త హృదయంతో ప్రశ్నించారు. ఏపీ అవసరాలను తెలంగాణ రాజకీయ పార్టీలన్నీ అర్థం చేసుకోవాలని, అన్నదమ్ముల్లాంటి తెలుగు ప్రజల మనోభావాలు దెబ్బతీసేలా వ్యవహరించవద్దని సోమిరెడ్డి విజ్ఞప్తి చేశారు.