చిత్తూరు జిల్లా కుప్పం బహిరంగ సభలో టీడీపీ అధినేత చంద్రబాబు పాల్గొన్నారు. ఏపీ సీఎం జగన్ అవినీతి, అక్రమాలపై.. కేంద్ర హోంమంత్రి అమిత్ షా .. ఎప్పుడు చర్యలు తీసుకుంటారని.. చంద్రబాబు ప్రశ్నించారు. జూన్ 11న విశాఖపట్నం సభలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా పాల్గొన్నారు. నాలుగేళ్లుగా .. జగన్ రెడ్డి ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని.. దేశంలోనే అతిపెద్ద అవినీతి నాయకుడు ఏపీ సీఎం జగన్ తప్ప.. మరెవరూ లేరన్నారు. సీఎం జగన్ రెడ్డిపై .. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా విమర్శలు గుప్పించారు. ఎన్నడూ చూడనంత అవినీతి ప్రభుత్వం.. జగన్ రెడ్డి సర్కారేనని నడ్డా వ్యాఖ్యానించారు. కుప్పంలో సభలో పాల్గొన్న చంద్రబాబు.. కేంద్ర మంత్రులు అమిత్ షా, నఢ్డా.. కేవలం ప్రకటనలు చేయడమే కాదు, అవినీతి ముఖ్యమంత్రిపై ఎప్పుడు చర్యలు తీసుకుంటారో ప్రకటించాలని డిమాండ్ చేశారు.
కుప్పంలో గ్రానైట్ దోపిడీ చేస్తున్న వారికి చంద్రబాబు గట్టి వార్నింగ్ ఇచ్చారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే.. దోచుకున్న వారందరికీ బదులిచ్చేలా చూస్తామని చంద్రబాబు ప్రకటించారు. ఒకప్పుడు ప్రశాంతంగా ఉండే కుప్పంలో రౌడీల హవా నడుస్తోందని వ్యాఖ్యానించారు. నాలుగేళ్లలో ఆంధ్రప్రదేశ్ ను.. రౌడీల అడ్డాగా మార్చారని విచారం వ్యక్తం చేశారు. అన్నీ గమనిస్తున్నానని, టీడీపీ కార్యకర్తలపై దౌర్జన్యాలకు పాల్పడిన వారు.. వడ్డీతో సహా తిరిగి చెల్లిస్తారని.. టీడీపీ నేతలపై తప్పుడు కేసులు పెట్టిన వారిపై కూడా కఠిన చర్యలు తీసుకుంటామని చంద్రబాబు హెచ్చరించారు.
35 ఏళ్లు ఎమ్మెల్యేగా, 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా, 13 ఏళ్లు ప్రతిపక్ష నాయకుడిగా .. ప్రజల కోసమే పనిచేశానని చంద్రబాబు అన్నారు. తన ఇంటి నిర్మాణానికి అనుమతులు మంజూరు చేసేదే లేదని.. జగన్ రెడ్డి అంటున్నారని.. రాష్ట్రమంటే జగన్ రాజ్యమా.. అని ప్రశ్నించారు. మహిళలు, యువత, రైతులు సహా అన్ని వర్గాలకు న్యాయం జరిగే విధంగా టీడీపీ మినీ మేనిఫెస్టో రూపకల్పన చేశామని.. చంద్రబాబు చెప్పారు. ఏపీకి ఆదాయం సృష్టించాలంటే.. పరిశ్రమలు రావాల్సిన అవసరం ఉందన్నారు. టీడీపీ అధికారంలోకి రాగానే.. అన్ని వర్గాల్లోని పేదలకు సమానంగా.. సంక్షేమం అందిస్తామని చంద్రబాబు తెలిపారు.