- ఏపీ శకటానికి జాతీయ పురస్కారం
- ముప్పై ఏళ్ల తర్వాత ఆంధ్రప్రదేశ్‌కు బహుమతి
- రిపబ్లిక్‌డే పెరేడ్‌లో యావద్దేశాన్ని ఆకట్టుకున్న ఏపీ శకటం
- కొలువు తీరిన బొమ్మల దర్పానికి నెటిజన్ల ఫిదా
- జ్యూరీ అవార్డు ప్రకటించిన కేంద్రం
- సీఎం చంద్రబాబు అభినందనలు
అమరావతి,(చైతన్యరథం) : దేశ రాజధాని ఢల్లీిలోని కర్తవ్యపథ్‌లో జరిగిన 76వ గణతంత్ర దినోత్సవం పెరేడ్‌లో భాగంగా ప్రదర్శించిన శకటాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ శకటానికి కేంద్ర ప్రభుత్వం జ్యూరీ అవార్డు ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని చేతి వృత్తి కళలు, కళాకారుల ప్రాముఖ్యత చాటుతూ, సత్సాంప్రదాయ వారసత్వానికి ప్రతీకగా నిలిచిన ఏటి కొప్పాక బొమ్మలను కొలువు తీర్చి ప్రదర్శించిన శకటం గణతంత్ర ఉత్సవాల ప్రదర్శనలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. యావద్భారతావనిలో ప్రజలందరి దృష్టినీ కట్టిపడేసింది. సామాజిక మాధ్యమాలలో సైతం లక్షలాది మంది ఈ శకటం రాజసానికి మంత్రముగ్దులయ్యారు. ప్రశంసల వెల్లువతో ముంచెత్తారు. రాష్ట్రంలో చేతివృత్తులు, హస్తకళలకు జాతీయ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో విస్తృత ప్రచారం తీసుకురావాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేసిన ఆలోచనలకు అనుగుణంగా రాష్ట్ర సమాచార పౌర సంబంధాలశాఖ ఈ శకటాన్ని రూపొందించింది. శకటం ముందు వినాయకుడు, చివరిగా కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరస్వామి నిలువెత్తు రూపాలతో, ఇరువైపులా బొబ్బిలి వీణలు, తెలుగువారి కట్టూ బొట్టూ ప్రతిబింబించేలా అమర్చిన ఏటికొప్పాక బొమ్మల కొలువుతో శకటం ఆధ్యంతం నయనానంద భరితమై ఆకట్టుకుంది. శకటం కదులుతున్నంత సేపు ఏటి కొప్పాక బొమ్మల ప్రాశస్త్యాన్ని చాటుతూ బొమ్మలు.. బొమ్మలు.. ఏటికొప్పాక బొమ్మలు, ఆంధ్రప్రదేశ్ బొమ్మలు, విద్యను నేర్పే బొమ్మలివి, వినోదభరితమైన బొమ్మలు, భక్తిని చాటే బొమ్మలు, హస్తకళల హంగులు, సహజ ప్రకృతి రంగులు’’ అంటూ సాగే గీతం జన హృదయాలను రంజింపజేసింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్రమంత్రులు సైతం ఈ శకటం ముగ్దమనోహర ముస్తాబును చూసి పులకించిపోయారు. నెటిజన్లు సైతం ఏపీ ప్రదర్శించిన ఏటి కొప్పాక బొమ్మల శకటాన్ని పెద్ద ఎత్తున సామాజిక మధ్యమాల్లో షేర్ చేసుకున్నారు. చాలా మంది తమ సామాజిక మాధ్యమ చరవాణుల్లో డీపీలుగా కూడా ఈ శకటాన్ని ప్రదర్శించారు. ఓటింగ్‌లో ఏటికొప్పాక శకటానికి పెద్ద ఎత్తున జేజేలు పలికారు.
మూడు దశాబ్దాల తర్వాత జ్యూరీ అవార్డు
దేశ రాజధానిలో జరిగే గణతంత్ర దినోత్సవాల్లో ప్రదర్శించే శకటాలకు సంబంధించి 30 సంవత్సరాల సంవత్సరాల తర్వాత తొలిసారిగా ఆంధ్రప్రదేశ్ శకటానికి కేంద్ర ప్రభుత్వ జ్యూరీ పురస్కారం లభించింది. ఏటికొప్పాక బొమ్మలు కొలువు తీరిన శకటం తృతీయ బహుమతి అందుకుంది.
సీఎం, డిప్యూటీ సీఎం ప్రశంసలు
చూడ ముచ్చటగా ముస్తాబయిన ఏటికొప్పాక శకటాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కల్యాణ్‌లు సైతంమెచ్చుకున్నారు. రిపబ్లిక్ డే సందర్భంగా ఇద్దరూ తమ సామాజిక మధ్యమల వేదికగా ఈ శకటాన్ని ప్రశంసలతో ముంచెత్తారు. ఏటి కొప్పాక బొమ్మలకు జియో ట్యాగింగ్ చేసి, ఈ బొమ్మలను అంతర్జాతీయంగా ప్రాచుర్యం పొందేలా రాష్ట్ర ప్రభుత్వం మరింత ప్రోత్సాహాన్ని అందిస్తోంది.