- అబద్ధాల ప్రచారానికి సుద్దపూస అభినయం
- వాస్తవాలను వూక్రీకరించేందుకు విశ్వ ప్రయత్నం
- ఏ దొంగా.. తానే దొంగనని చెప్పుకోడు
- మీడియా సమావేశంలో జగన్ సారాంశమిదే..
- ఎఫ్‌బీఐ పత్రాల్లో తన ‘పేరు’ లేదంటూ పిచ్చివాదన
- చంద్రబాబుకంటే తానే గొప్పవాడినంటూ థియరీ
- సెకీతో కుదుర్చుకున్న ఒప్పందాలే గొప్పవని వాదన
- ఇంటర్ స్టేట్ ట్రాన్స్‌మిషన్ చార్జీలపైనా అబద్ధాలే
- ఒప్పంద పత్రాల్లో ఆ విషయమే లేకపోవడం విడ్డూరం
- అసలు తేల్చకుండా.. అధికారపక్షంపై బురద
- తనకు అవార్డిచ్చి.. సత్కరించాలంటూ కొత్త డిమాండ్
- ఎఫ్‌బీఐ నుంచి బాబాయిలు వస్తున్నారు..
- సత్కారానికి సిద్ధంగా ఉండు జగన్‌రెడ్డీ!
అమరావతి (చైతన్య రథం): విద్యుత్ ముడుపుల వ్యవహారం గుప్పుమన్న మూడు రోజులకుగాని తాడేపల్లి గుడారంనుంచి సౌండ్ చేయని మాజీ సీఎం.. ఈ మూడురోజుల్లో రాయించుకున్న స్క్రిప్ట్‌ను అప్పగించడంలో అద్భుతమైన పర్ఫార్మెన్స్ చూపించారు. తిమ్మిని బమ్మిచేయగల అబద్ధాల ప్రావీణ్యాన్ని గుర్తించి సత్కారం చేయాల్సిందిపోయి.. అధికారపక్షం అనవసర విషయాలను కెలుకుతుందంటూ ప్రెస్‌మీట్ సీన్‌ను ఆసాంతం రక్తికట్టించే ప్రయత్నం చేశారు. కిందపడినా మీదమాట మానని జగన్. తనకు సత్కారం చేయకుండా, అవార్డు ఇవ్వకుండా నిందలు వేయడం దారుణమంటూ జగన్ తన భ్రష్టరాజకీయాన్ని మరోసారి ప్రదర్శించారు. పైగా జగన్ ‘సచ్ఛీలత’ను శంఖిస్తూ యూఎస్ కోర్టు డాక్యుమెంట్లే సవాలక్ష ప్రశ్నలను సంధిస్తుంటే.. అవన్నీ ‘తూచ్’ అంటూ వెర్రినవ్వుల సమాధానమివ్వడం `జగన్ నేరపూరిత రాజకీయ ప్రావీణ్యానికి పరాకాష్ట. మీడియాముందు.. అనుకూల మీడియా ద్వారా జనంలోకి తన పాతివ్రత్యాన్ని ప్రూవ్ చేసుకోవడానికి జగన్ చేసిన ‘మేక వన్నె అభినయం’ రక్తికట్టలేదు సరికదా.. బూమరాంగైంది.
రాష్ట్ర భవిష్యత్‌ను ఫణంపెట్టి.. విద్యుత్ కొనుగోలులో గత ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి దారుణ అవినీతికి పాల్పడ్డారన్నది ఎఫ్‌బీఐ డాక్యుమెంట్లు బయటపెట్టిన నిఖార్సైన నిజం. జగన్ కక్కుర్తి చర్య కారణంగా `రాష్ట్ర ప్రజలపై దాదాపు రూ.2 లక్షల కోట్ల రూపాయల భారం మోపారన్నది అందులోని సారాంశం. బహిర్గతమైన డాక్యుమెంట్లలో పచ్చినిజాలు వెలుగు చూస్తున్నా.. గురువారం తగుదునమ్మా అని మీడియా ముందుకొచ్చిన జగన్ అలవాటయిన అబద్ధాలనే అద్భుత నటనతో అలవోకగా వల్లెవేశారు. తన కక్కుర్తి చర్యను కప్పిపుచ్చుకునే సాహసం చేశారు. వెలుగుచూసిన నిజాలన్నీ అబద్ధాలేనంటూ.. మసిపూసి మారేడుకాయ చేసే ప్రయత్నం చేశారు. ఎక్కడ అవినీతి జరిగిందని చెప్తున్నారో.. అక్కడ జాతికి మేలు చేకూర్చే నిర్ణయాన్నే తీసుకున్నానంటూ ఏమాత్రం తడబాటులేకుండా చెప్పుకున్న జగన్.. `ఒకవేళ ఆ రోజు ఆ ‘ఆఫర్’ను తీసుకొని ఉండకపోతే.. ఎందుకు వదిలేశారని ఇదే మీడియా, ప్రజలు ప్రశ్నించి ఉండేవారని ‘రివర్స్’ అటాక్‌కు దిగడం ప్రెస్‌మీట్‌లో హైలెట్. నిజాలను అబద్ధాలుగా వక్రీకరిస్తూనే.. నిజాలు రాసిన ప్రధాన పత్రికలపై పరువు నష్టం దావా వేస్తానంటూ పబ్లిక్‌గా బెదిరింపులకు దిగడం జగన్ తెంపరితనానికి పరాకాష్ట. అంతర్జాతీయ ఆర్థిక నేరగాడిగా కేసులు ఎదుర్కొంటూ పరువును పాతాళానికి తొక్కేసుకున్న జగనే.. రివర్స్‌లో పరువునష్టం బెదిరింపులకు దిగడం సిగ్గుచేటు. అసలు పరువేలేని జగన్ దావా వేస్తాననడం పెద్ద జోక్ అయితే.. జగన్ సవాల్‌ను స్వాగతించిన అధికారపక్షానికి సమాధానం ఇవ్వలేకపోవడం రాజకీయ పిరికితనానికి నిదర్శనం.
‘ఒక్క ఛాన్స్’ సింపతీతో గద్దెనెక్కిన జగన్‌రెడ్డి ఐదేళ్ల పాలనాకాలంలో వ్యవస్థలను భ్రష్టుపట్టించినట్టే.. పటిష్టమైన విద్యుత్ వ్యవస్థనూ నట్టేట ముంచారన్నది కళ్లముందు కనిపించే నిజం. తన పాలనా వైఫల్యాలను కప్పిపుచ్చుతూ.. తన అవినీతి బండారానికి ముసుగేస్తూ.. తానేదో విద్యుత్ వ్యవస్థను ఉద్దరించానని జగన్ గొప్పలు చెప్పుకోవడం గురువారంనాటి మీడియా సమావేశంలో హైలెట్. అంతర్జాతీయ, జాతీయస్థాయిలో వివిధ దర్యాప్తు సంస్థలు జగన్‌ను అవినీతిపరుడుగా తేల్చినా.. జగన్‌రెడ్డి ఇంకా అవే అబద్ధాలతో ప్రజలను మోసగించే ప్రయత్నమే చేస్తున్నారు. రాష్ట్ర విద్యుత్ వ్యవస్థను చంద్రబాబు దెబ్బతీశారన్న అబద్ధపు ప్రచారం తప్ప.. జగన్ అవినీతిని నిర్థారిస్తూ బహిర్గతమైన ఎఫ్‌బిఐ డాక్యుమెంట్లపై ఒక్క మాటా మాట్లాడకపోవడం `జగన్ డైవర్షన్ రాజకీయానికి నిదర్శనం. రూ.1750 కోట్ల రూపాయల మేర జగన్‌కు ముడుపులు ముట్టాయని ఎఫ్‌బిఐ కేసు డాక్యుమెంట్లు స్పష్టం చేస్తున్నా.. అసలు తన పేరే ఎక్కడా లేదని జగన్ పదేపదే చెప్పుకోవడంలోని మర్మాన్ని ప్రజలు అర్థం చేసుకోకపోరు. అమెరికాలోని సెక్యూరిటీ సంస్థ పెట్టిన కేసులో స్పష్టంగా ఆంధ్రా చీఫ్ మినిష్టర్ అని పదే పదే వ్రాసినా.. నా ‘పేరు’ ప్రస్తావించలేదంటూ ‘సుద్దపూస’ అభినయాన్ని ప్రదర్శించడం జగన్‌కే చెల్లింది.
సోలార్ విద్యుత్ కొనుగోలులో వెలుగు చూసిన అవినీతిని అస్సలు ప్రస్తావించకుండా.. ఎదురుదాడికి దిగడం జగన్‌కు అలవాటైన రాజకీయమే. ‘నేనే సంపద సృష్టించాను. ఇంకో పాతికేళ్లకు అత్యంత చవకగా విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు చేసి.. లక్ష కోట్లు మిగిల్చానని అతి తెలివి ప్రదర్శిస్తూ.. జనాన్ని నమ్మించడానికి సెకీ లేఖలను ప్రదర్శించడం కపట రాజకీయాన్ని తేటతెల్లం చేసింది.
మీడియాముందు జగన్ కక్కిన కుళ్లులో కీలకాంశం `సోలార్ విద్యుత్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు ఎక్కువ ధరకుకొంటే.. తాను అందులో సగం ధరకే కొనుగోలు చేశానన్నది. ఏ సంవత్సరంలో ఎవరు ఏ ధరకు కొన్నారన్న విషయాన్ని జగన్ మరుగున పెట్టడం అతి తెలివిలో భాగం. `2021లో జగన్ కొన్న రేటుకి, 2015లో చంద్రబాబు కొన్న రేటుకి పోలికపెట్టి.. లెక్కలు చెప్పడం జగన్ కపట రాజకీయాన్ని తేటతెల్లం చేసింది. వాస్తవానికి 2010లో సోలార్ పవర్ యూనిట్ రూ.12.16 ఉంది. 2016నాటికి రూ.5.30కి తగ్గింది. 2020నాటికి రూ.1.99కే చేరింది. కానీ జగన్ మాత్రం 2021 డిసెంబర్లో రూ.2.49 ధరకు కొనడాన్ని గొప్పగా చెప్పుకోవడం విడ్డూరం. సోలార్ పవర్ యూనిట్ ధర రూ.1.99కి దొరికే సమయంలో.. రూ.2.49కి ఎలా కొన్నారన్న ప్రశ్నకు జగన్ చెప్తోన్న సమాధానం.. 2015లో చంద్రబాబు రూ.4.63కి కొన్నారని. ఈ పిచ్చి లాజిక్‌తో జనాన్ని నమ్మించడానికే జగన్ చేసిన ప్రయత్నం పూర్తిగా వికటించింది.
2015లో ఆనాటి సీఎం చంద్రబాబు ఆనాటి విద్యుదుత్పత్తి ధరలతో పోల్చిచూస్తే.. అన్ని రాష్ట్రాలకంటే తక్కువ రేటుకే విద్యుత్ కొనుగోలు చేశారన్నది రికార్డులే చెప్తున్నాయి. ఏడేళ్ల తరువాత జగన్ పక్క రాష్ట్రాలకంటే ఎక్కువ ధరకు కొనడం వెనుక రూ.1750కోట్లు చేతులు మారాయాన్నది అసలు వివాదం. ప్రజలు అడుగుతున్నది కూడా అదే. అమెరికా కోర్టులు ఫిక్స్ చేసిందీ ఇక్కడే. అసలు వివాదంమీద సమాధానం దాటవేసిన జగన్.. 2015లో చంద్రబాబు కొన్న ధరకంటే.. 2021లో తాను పెట్టిన ధర తక్కువని వితండ వాదానికి దిగడం దిగజారుడు రాజకీయం. గత దశాబ్దకాలంలో విండ్ ఎనర్జీ ధర కిలోవాట్‌కు రూ.7నుంచి రూ.3కి తగ్గింది. అలాగే, సోలార్ ఎనర్జీ ధర రూ.8నుండి రూ.2.5కి తగ్గింది. అందుకు సాంకేతిక అభివృద్ధి, నూతన ఆవిష్కరణలు, ప్యానల్స్‌లో స్టోరేజ్ కెపాసిటీ, వృధా నియంత్రణ, లార్జ్‌స్కేల్ ఎకనామిక్స్, కార్బన్ క్రెడిట్స్ కాంపిటీషన్, చంద్రబాబు చేపట్టిన విద్యుత్ సంస్కరణలతో ప్రజలు పవర్ ఉత్పత్తిపై దృష్టిపెట్టడంలాంటి కారణాలు అనేకం.
ఇది దేశ, ప్రపంచవ్యాప్తంగా కనిపిస్తోన్న ధోరణి. ఇక మునుపటి చంద్రబాబు ప్రభుత్వ హయాంలో 10,000 మెగావాట్ల సామర్థ్యంగల సోలార్, విండ్ ప్రాజెక్టులు నెలకొల్పారు. దాంతోపాటు అప్పట్లో లభించిన తక్కువ ధరలకు పీపీఏలూ వేశారు. దానిని రద్దుచేసి, కోర్టులద్వారా అనవసరంగా వాటికి జగన్ చెల్లించిన మూల్యాన్ని మీడియా సమావేశంలో ప్రస్తావించకపోవడం జగన్ ‘సుద్దపూస’ రాజకీయానికి నిదర్శనం.
పైగా.. జగన్ తన ప్రభుత్వం సెకీతో చేసుకొన్న ధరలను పాత పీపీఏ ధరలతో పోల్చి, ‘రూ.2.90 రూపాయల తక్కువకు కేంద్రం ఇస్తోంది కాబట్టి, అదీ ఇంటర్ స్టేట్ ట్రాన్స్‌మిషన్ చార్జీలు లేవు కాబట్టి, సెకీ ఆఫర్‌కు వెళ్లాము. ఇక్కడ థర్డ్ పార్టీ ప్రమేయం లేదు. అవినీతికి ఆస్కారం లేదు. పైగా అమెరికాలోని సెక్యూరిటీ సంస్థ డాక్యుమెంట్లలో నా ‘పేరు’ ఎక్కడా లేదం’టూ అద్భుతమైన హావభావాలు ప్రదర్శించడంలోనే అర్థమవుతుంది `అవినీతి పొగవెనుక నిప్పు ఎంతుందన్నది. రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాలు యూనిట్‌ను రెండు రూపాయలకంటే తక్కువకు ఎందుకు తయారు చేసుకోగలవంటే `ఎక్కువగా ఏడారులు వున్నాయి కనుక, ఇర్రేడియేషన్ ఎక్కువ కనుక.. అంటూ మరో అబద్ధపు థియరీని ప్రస్తావించారు జగన్. మరి `ఏపీ స్టేట్‌లో రాయలసీమ రీజియన్ కూడా అనుకూలమనే విషయాలను ఎందుకు ప్రస్తావించలేదో జగనే సమాధానం చెప్పాలి. పైగా జగన్ చెప్తున్నట్టు `ఇంటర్ స్టేట్ ట్రాన్స్‌మిషన్ చార్జీలు ఉండవన్న విషయం ఆనాటి ఒప్పందాల్లో ఎక్కడా కనిపించడం లేదు. పైగా ఎక్కడినుంచో విద్యుత్‌ను కొనుగోలు చేయడంకంటే.. రాష్ట్రంలోని అనుకూల ప్రాంతంలో ప్రాజెక్టులు నెలకొల్పి ‘ఉత్పత్తి`వినియోగా’నికి ఎందుకు చర్యలు తీసుకోలేకపోయారన్న అంశాలకు సమాధానం లేదు. అదే జరిగివుంటే `రాష్ట్రంలో నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు మెరుగయ్యేవి.. జిఎస్టీల రూపంలోనూ రాష్ట్రానికి ఆదాయం వచ్చి ఉండేది. జగన్ స్వార్థపూరిత నిర్వాకంతో.. రాష్ట్రం భారీగా నష్టపోయిన అంశాన్నీ మీడియా సమావేశంలో ఉద్దేశపూర్వకంగా దాచారు జగన్.
కేవలం తన లంచాల భాగోతంనుంచి ప్రజలని కన్ఫ్యూజ్ చేయటానికి, ఏడేళ్లనాటి ధరలతో కంపేర్ చేయడం, టెక్నాలజీ పెరిగే కొద్దీ ఉత్పత్తి ధరలు తగ్గుతాయన్న విషయాన్ని ప్రజలు గ్రహించకుండా చేయడానికి జగన్ చాలా ప్రావీణ్యాన్నే ప్రదర్శించారు. చంద్రబాబు హయాంలో కుదుర్చుకున్న పీపీఏలపై ఇప్పటికీ అబద్ధాలు చెప్తోన్న జగన్.. చట్టబద్ధమైన అప్పటి పీపీఏల్లో ఎలాంటి లోటు పాట్లు లేవని, అవి రాష్ట్రానికే కాదు, దేశానికీ ఉపయుక్తమని కేంద్రం ఇచ్చిన కితాబును.. ఫేక్ ప్రచార హీరో దాచడం మరీ దారుణం. 2015లో చంద్రబాబు కొన్న సోలార్ పవర్ యూనిట్‌తో పోలుస్తున్న జగన్, 2009లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్సార్.. అదే సోలార్ విద్యుత్‌ను యూనిట్‌కు రూ.14 పెట్టి కొన్న విషయాన్ని ఎందుకు ప్రస్తావించలేదో జగనే సమాధానం చెప్పాలి. సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందేకొద్దీ సోలార్ పవర్ ధరలు తగ్గుతాయని జగన్‌కు తెలియక కాదు, చంద్రబాబు ప్రభుత్వంపై బురదజల్లితే తాను గొప్పవాడినని ప్రజలు నమ్ముతారన్న అతి తెలివి.
జగన్ సమాధానం చెప్పాల్సిన ప్రశ్నలు
సాంకేతిక అభివృద్ధితో సోలార్ విద్యుత్ ధరలు భారీగా తగ్గిన కాలంలో.. యూనిట్ ధర రూ.2.49కు ఒప్పందం చేసుకోవడంలో మతలబేమిటి? సెకీ కేంద్ర ప్రభుత్వ సంస్థే అయితే.. ‘విద్యుత్ కొనుగోలు ఆఫర్’ ఇతర రాష్ట్రాలకు ఇవ్వకుండా ఏపీ ప్రభుత్వానికి మాత్రమే లేఖ రాయటంలో ఆంతర్యమేమిటి? తన అవినీతి నిర్వాకంతో రాష్ట్రంపై భారీ విద్యుత్‌భారం మోపిన జగన్.. ఏటా రూ.44వేల కోట్లు నష్టం చేకూర్చడం నిజం కాదా? కేవలం రూ.2కే యూనిట్ విద్యుత్ వచ్చే అవకాశాలున్న పీపీఏలను రద్దుచేసి.. సెకీ మాటున వేరొక విద్యుదుత్పత్తి కంపెనీతో ఒప్పందం చేసుకోవడం వెనుక ఏం రహస్యం దాగివుంది? ఒప్పందంలో కేవలం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలే ఉన్నాయి, థర్డ్ పార్టీకి ఆస్కారం లేదంటున్న జగన్.. ఎఫ్‌బీఐ డాక్యుమెంట్లు బోగస్ అని నిరూపించగలరా? ఈ ప్రశ్నలకు కదా జగన్ సమాధానం ఇవ్వాల్సింది.
బాబాయిలు రావడం ఖాయం?
అద్వితీయమైన తెలివి తేటలతో రాష్ట్రానికి భారీగా సంపద సృష్టించానని చెప్పుకున్న జగన్ `‘సుద్దపూస’ అభినయంతో సత్కారం కోరుకున్నారు. కనీసం అవార్డయినా ఇవ్వాలన్న జగన్ డిమాండకు జనం నవ్వుకుంటున్నారు. కాకపోతే.. జగన్ దగాకోరు రాజకీయాలకు రాష్ట్ర ప్రజలు ఎప్పుడో అవార్డిచ్చారన్న విషయాన్ని జగన్ విస్మరించడం దారుణం. సార్వత్రిక ఎన్నికలకు ముందు ‘వైనాట్ వన్ సెవెంటీఫైవ్’ అంటూ రెచ్చిపోయిన జగన్‌ను ‘పదకొండు స్థానాలకు’ పరిమితం చేయడం కంటే గొప్ప సత్కారం ఏముంటుంది. ‘అబద్ధాల జగన్’ అంటూ ప్రజలిచ్చిన అవార్డును మించినదేముంటుంది? పదకొండు స్థానాల బలంకూడా లేని తనకు సీఎం ప్రొటోకాల్ భద్రత కల్పించాలని, జనమివ్వని ప్రతిపక్ష హోదా కనీసం చంద్రబాబైనా ఇవ్వాలని గొంతెమ్మ కోర్కెలు కోరుతున్న జగన్.. సత్కారం కోరుకోవడంలో తప్పులేదు. తన ‘అవినీతి ప్రతిభ’ను గుర్తించి సత్కారం చేయాలన్న జగన్ డిమాండ్‌లో నిజాయితీవుంటే.. అమెరికా నుంచి ఎఫ్‌బీఐ బాబాయిలు రాకపోరు, సత్కారం చేయకపోరు! జగన్ ఆశ నెరవేరాలని కోరుకుందాం!!