- రాష్ట్రంలో కొత్తగా 1.9 లక్షలమందికి వితంతు పింఛన్లు
- కొద్ది గంటల్లో రైతుల ఖాతాకు అన్నదాత సుఖీభవ సొమ్ము
- 15నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం
- పక్షం రోజుల వ్యవధిలో రెండు సంక్షేమ పథకాలు అమలు
- పింఛన్లు పంపిణీ చేసిన మంత్రి డోలా
సింగరాయకొండ (చైతన్య రథం): ప్రజా సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని సాంఘిక సంక్షేమ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి పేర్కొన్నారు. ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీలో భాగంగా శుక్రవారం ఉదయం కొండపి నియోజకవర్గంలోని సింగరాయకొండ, మర్రిపూడి మండలం చిమట గ్రామాల్లో మంత్రి పర్యటించారు. ముందుగా సింగరాయ కొండలోని పంచాయతీ కార్యాలయంలో, లబ్ధిదారుల ఇళ్లవద్ద పింఛన్లు అందించారు. అనంతరం ముచ్చట గ్రామంలో లబ్ధిదారుల ఇళ్ళకువెళ్లి పింఛన్లు అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలలో మంత్రి డోలా మాట్లాడుతూ.. ఈరోజు నుంచి రాష్ట్రంలో కొత్తగా లక్షా 8వేల 206 మందికి వింతతు పింఛన్లు అందిస్తున్నామన్నారు. జిల్లాలో 5వేల174 మందికి, కొండపి నియోజక వర్గంలో 799 మందికి, సింగరాయకొండ మండలంలో 157 మందికి, ఈ పంచాయతీ సచివాలయం పరిధిలో 52 మందికి స్పౌజ్ పింఛన్లు ఇస్తున్నట్లు మంత్రి వివరించారు. స్థానిక ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తున్నామన్నారు. రాజకీయాలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు.
ఈ నెలలో మూడు హామీలు అమలు చేస్తున్నామన్నారు. 2019 నుంచి నిలిచిపోయిన స్పౌజ్ పింఛన్లను ఈనెల నుంచి ఇస్తున్నామన్నారు. రేపు దర్శిలో ముఖ్యమంత్రి అన్నదాత సుఖీభవ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని చెప్పారు. ఈనెల 15నుంచి మహిళలకు ఉచిత బస్సు హామీ అమలు చేస్తున్నామన్నారు. ఇప్పటికే ఎంతమంది పిల్లలుంటే అంతమందికి తల్లికి వందనం అమలు చేయడం జరుగుచున్నదన్నారు. పేదరికం లేని సమాజమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పి`4 కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందన్నారు. ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడేలా అనేక అభివృద్ధి సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారన్నారు. పేదప్రజల సంక్షేమం, అభివృద్దే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తున్నదని మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి ఉద్ఘాటించారు.