- సీఎం చంద్రబాబు నేతృత్వంలో రాష్ట్రంలో మంచి పాలన
- సూపర్ సిక్స్ పథకాలతో నిరుపేద, మధ్య తరగతి ప్రజల్లో సంతోషం
- సుపరిపాలనలో తొలిఅడుగు కార్యక్రమంలో మంత్రి కొలుసు పార్థసారథి
ముసునూరు (చైతన్యరథం): అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం సుపరిపాలన అందిస్తోందని రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. సుపరిపాలనలో తొలి అడుగు – ఇంటింటికీ టీడీపీ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం ముసునూరు మండలం వేల్పుచర్ల, బలివే గ్రామాల్లో వివిధ శాఖల అధికారులు, కూటమి నాయకులతో కలిసి మంత్రి కొలుసు పార్థసారథి పర్యటించారు. ప్రజలకు అందుకున్న పథకాలు, సమస్యలు అడిగి తెలుసుకున్నారు. తొలుత ఆయా గ్రామాల్లో డాక్టర్ బీఆర్ అంబేద్కర్, ఎన్టీఆర్ విగ్రహాలకు మంత్రి పూల మాలలు వేసి అంజలి ఘటించారు. మంత్రికి గ్రామ ప్రజలు ఘన స్వాగతం పలికారు. మహిళలు మంగళహారతులు ఇచ్చి మంత్రి నుదుటన కుంకుమ తిలకం దిద్దారు. రాష్ట్ర ప్రభుత్వం ఏడాది పాలనలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల కరపత్రాలను ప్రజలకు అందజేసి, గోడ పత్రికలను గోడలకు మంత్రి స్వయంగా అతికించారు. ప్రభుత్వ పథకాలు అమలు తీరుపట్ల ప్రజలను అడిగి తెలుసుకోగా ప్రతి ఒక్కరూ తమకు పథకాలు ద్వారా లబ్ధి చేకూరిందని, కూటమి పాలనతో తమ బతుకులు మారాయని చెప్పడంతో మంత్రి సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజలు కొన్ని సమస్యలను తెలియజేయగా ఆరు రహదారులను మంత్రి మంజూరు చేశారు. ప్రజా సమస్యలను వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులకు మంత్రి పార్థసారథి ఆదేశాలు జారీ చేశారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభల్లో మంత్రి పార్థసారథి మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో జరిగిన అభివృద్ధి, సంక్షేమాన్ని, విజయాలను, సూపర్ సిక్స్ పథకాలు అమలును ప్రజల్లోకి తీసుకువెళ్లాలనే లక్ష్యంతో సుపరిపాలనలో తొలి అడుగు – ఇంటింటికీ టీడీపీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు. ఐదేళ్ల వైసీపీ పాలనలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేస్తే నేడు పరిపాలనా దక్షత గల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆర్థిక వ్యవస్థను చక్కబెడుతూ సుపరిపాలన అందిస్తున్నారన్నారు. గత ప్రభుత్వం రూ.10 లక్షలు కొట్లు అప్పుచేసి వెళ్లిందన్నారు. గత ప్రభుత్వం బటన్ నొక్కడం పైనే దృష్టి పెట్టిందని, రాష్ట్రానికి ఆదాయాన్ని పెంచే ఆలోచన చేయలేదన్నారు. గత ప్రభుత్వంలో పరిశ్రమలు, పారిశ్రామికవేత్తలు ఇతర రాష్ట్రాలకు తరలి వెళ్లిపోయారని అన్నారు. ఈ పరిస్థితుల్లో అధికారం చేపట్టిన ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రాన్ని తిరిగి గాడిలో పెట్టేందుకు ఎంతగానో శ్రమిస్తున్నారన్నారు. చంద్రబాబు పిలుపుతో పరిశ్రమలు, పారిశ్రామికవేత్తలు తిరిగి రాష్ట్రానికి తరలి వస్తున్నారని, రూ. 6 లక్షలు 50 వేల కోట్లు పెట్టుబడులు వచ్చాయని అన్నారు. రానున్న నాలుగేళ్ల కాలంలో యువతకు 20 లక్షలు ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామన్నారు. ప్రతి ఇంటికి ప్రగతిని, సంక్షేమాన్ని అందించాలనే లక్ష్యంతోనే కూటమి ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. దేశంలో మరే రాష్ట్రం కూడా ఇవ్వనంత మొత్తాన్ని పెన్షన్‌గా కూటమి ప్రభుత్వం అందిస్తోందన్నారు. తల్లికి వందనం కింద ఇంట్లో ఎంత మంది పిల్లలు ఉంటే అందరికీ రూ. 15 వేలు అందజేస్తూ తల్లిదండ్రులపై భారం తగ్గిస్తున్నామన్నారు. దీపం పధకం – 2 ద్వారా ప్రతిఏటా మూడు ఉచిత గ్యాసు సిలిండర్లు ఇస్తున్నామని తెలిపారు. మహిళలకు వచ్చే ఆగస్ట్ 15 తేదీ నుండి ఉచిత ఆర్టీసీి బస్సు ప్రయాణ పధకాన్ని అమలు చేస్తున్నామన్నారు. కేంద్రం ఇచ్చే రూ 6 వేలకు అదనంగా రూ 14 వేలు కలిపి మొత్తం రూ 20 వేలు చొప్పున అన్నదాత సుఖీభవ పధకం ద్వారా రైతులకు ఆర్థిక సాయం అందజేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో తహశీల్దారు కే వెంకటరమణ, ఎంపీడీఓ బీఏ సత్యనారాయణ, వివిధ శాఖల అధికారులు, సచివాలయ ఉద్యోగులు, కూటమి నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
ఇళ్ల స్థలాల కోసం భూమి పరిశీలన
ముసునూరు మండలం వేలుపుచర్ల లోని ఆరు ఏకరాలు కొండ పోరంబోకు భూమిని ఇళ్ల స్థలాల కోసం అధికారులు, కూటమి నాయకులతో కలిసి మంత్రి కొలుసు పార్థసారథి పరిశీలించారు. ఆరు ఏకరాల భూమిని సర్వే చేసి, చదును చేసి ఇళ్ల్ల స్థలాలకు సిద్ధం చేయాలని సంబంధిత అధికారులను మంత్రి ఆదేశించారు. ఎంతమందికి ఇళ్లస్థలాలు పట్టాలు ఇవ్వవచ్చునని తహశీల్దారును మంత్రి అడగగా 60 మందికి ఇవ్వవచ్చునని తెలిపారు. సర్వే పనులు, లెవెలింగు పనులు పూర్తి చేసి అర్హులైన నిరుపేదలకు ఇళ్ల పట్టాలు అందజేసేందుకు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.