- అప్పుడే.. పేదరిక నిర్మూలన, సంక్షేమ సుస్థిరత సాధ్యం
- పర్యటకం నుంచి రవాణా వరకూ.. ‘సీ ప్లేన్’
- విప్లవాత్మక ఆలోనచలకు ఇదే తొలి సంకేతం
- సీ-ప్లేన్ ప్రయాణం అద్భుత అనుభూతినిస్తుంది
- పర్యాటక అభివృద్ధితో లక్షలాది మందికి ఉపాధి
- కష్టాలు అధిగమించి.. ఏపీ బ్రాండ్‌కు పూర్వవైభవం
- రాష్ట్రాన్ని నెం.1గా నిలబెట్టేవరకూ నిద్రపోము
- పీపీపీ విధానంలో.. ప్రగతి మార్గాలు లెక్కలేనన్ని..
- నాలెడ్జ్ ఎకానమీలో మరిన్ని పెను మార్పులకు ఛాన్స్
- వచ్చే రోజుల్లో యువత స్మార్ట్‌వర్క్‌కే ప్రాధాన్యత
- టెక్నాలజీని వాడుకుంటే భవిష్యత్ బంగారమే..
- డీప్ టెక్నాలజీతో ప్రపంచానికే సేవలందించొచ్చు
- సీ-ప్లేన్ డెమో లాంచ్‌లో సీఎం చంద్రబాబు వెల్లడి
విజయవాడ (చైతన్య రథం): నవ ఆవిష్కరణలతోనే సంపద సృష్టి సాధ్యమని, తద్వారా పేదరిక నిర్మూలన, సంక్షేమ పథకాల సుస్థిరత వీలవుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. సీ-ప్లేన్ సౌకర్యంతో రవాణాతోపాటు పర్యాటక రంగంలోనూ విప్లవాత్మక మార్పులతో అభివృద్ధి సాధించగలుగుతామన్నారు. ఎన్ని కష్టాలున్నా రాష్ట్రాన్ని నెం.1గా నిలబెట్టే వరకు నిద్రపోకుండా పనిచేస్తామని చంద్రబాబు పునరుద్ఘాటించారు. వీలైనంత త్వరగా అనుకున్న ప్రగతిని సాధించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకెళ్తోందన్నారు. ‘నాలుగోసారి ముఖ్యమంత్రి పదవిలో ఉన్నాను. మూడుసార్లూ ఎప్పుడూ ఇంత కష్టమనిపించలేదు. ఈసారి మాత్రం విధ్వంస వ్యవస్థను బాగుచేయడానికి శ్రమిస్తూనే ఉన్నాం. సమస్యలను అధిగమిస్తూ.. పరిపాలనను గాడిలో పెట్టే బాధ్యతను ప్రభుత్వం తీసుకుంది’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. శనివారం విజయవాడ పున్నమి ఘాట్ వద్ద సీ-ప్లేన్ డెమో లాంచ్ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు.
కేంద్రం సహకారం.. స్వయంకృషితో..
‘ఆంధ్రప్రదేశ్ అంటే నిన్నటి వరకు అవహేళనగా చూసేవారు. రోడ్లన్నీ గుంతలమయం. పట్టణలన్నీ చెత్త అంటూ హేళనచేసే పరిస్థితి ఉండేది. ఇలాంటి పరిస్థితుల్ని చక్కదిద్ది ఏపీని మళ్లీ నెం.1గా నిలిపే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని రాష్ట్రంలోని యువతకు, మేధావులకు ప్రామిస్ చేస్తున్నా. చరిత్రలో ఎప్పుడూలేని విధంగా 93శాతం స్ట్రైకింగ్ రేటుతో గెలిపించారు. రాష్ట్రాన్ని నిలబెట్టినందుకు అందరికీ ధన్యవాదాలు. వెంటిలేటర్‌పై ఉన్న రాష్ట్రాన్ని ఇప్పుడిప్పుడే బయటకు తీసుకొస్తున్నాం. దీనికి కొంత సమయం పడుతుంది. కేంద్రం సహకారంతో, స్వయంకృషితో పనిచేసి రాష్ట్రాన్ని నెం.1గా నిలబెడతానని హామీ ఇస్తున్నా’ అంటూ చంద్రబాబు ప్రకటించారు.
సీ-ప్లేన్ వినూత్న అవకాశం:
రాష్ట్రాన్ని ప్రమోట్ చేయడానికి, ఆర్థిక కార్యకలాపాలు పెంచడానికి, ఉపాధి, ఉద్యోగావకాశాలు సృష్టించడానికి అందుబాటులో ఉన్న అన్ని అవకాశాలనూ ఉపయోగించుకోవాల్సిన అవసరముందని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. అభివృద్ధి జరగాలి.. సంపద సృష్టి జరగాలి.. అప్పుడే ఆదాయం పెరుగుతుంది. ఆదాయం పెరిగితే పేదరిక నిర్మూలన కోసం సంక్షేమ కార్యక్రమాలను ప్రవేశపెట్టేందుకు అవకాశముంటుంది. అసలు సంపదే లేకుంటే అప్పులు చేసి.. అరకొర సంక్షేమ కార్యక్రమాలు అమలుచేస్తే అది శాశ్వతం కాదు. ఇదే మాట అప్పుడూ చెప్పాను. ఇప్పుడూ చెబుతున్నాను. నేటి ఆధునిక టెక్నాలజీని పూర్తిగా వినియోగించుకొని జీరో పావర్టీకి కృషిచేసి.. పేదలను కూడా పైకి తీసుకురావొచ్చు. ఒక ప్రభుత్వ విధానం వల్ల ప్రస్తుత తరాలతో పాటు భావితరాల భవిష్యత్తును మార్చేందుకు అవకాశముంటుంది. 25ఏళ్ల ముందే ఐటీని ప్రమోట్ చేశాను. దీనివల్ల అమెరికాలో అత్యధిక తలసరి ఆదాయం భారతీయులకొస్తోంది. అందులో ఎక్కువగా తెలుగువారున్నారు. అమెరికాలోని భారతీయుల తలసరి ఆదాయం 1,20,000 డాలర్లు కాగా.. అమెరికాలోని అమెరికన్ల తలసరి ఆదాయం 60 వేల డాలర్లు. ఆంధ్రప్రదేశ్‌లో చూస్తే తలసరి ఆదాయం 3 వేల డాలర్లు. ఈ పరిస్థితిని అధిగమించడానికి అమెరికాలో ఉన్నా.. విజయవాడలో ఉన్నా ఆదాయం పెంచేందుకు ప్రయత్నిస్తున్నా. అర్థం చేసుకొని ముందుకొస్తే ఆకాశమే హద్దుగా అభివృద్ధికి ఈ ప్రభుత్వం అవకాశాలు ఇస్తుంది’ అని సీఎం చంద్రబాబు భరోసానిచ్చారు.
రాబోయే రోజుల్లో సీ-ప్లేన్ ట్రాన్స్‌పోర్టు
‘ప్రధాని నరేంద్ర మోదీ సైతం సీ-ప్లేన్ అభివృద్ధికి ముందుకొచ్చారు. నేనూ ప్రయత్నం చేశాను. మామూలుగా విమాన ఛార్జీలు ఎంతుంటాయో అదే విధంగా సీ-ప్లేన్ ఛార్జీలు కూడా ఉండేస్థాయికి తేగలిగితే ఈ రంగానికి మంచి భవిష్యత్తు ఉంటుంది. సీ-ప్లేన్‌కు ఎక్కడా విమానాశ్రయాలు అవసరం లేదు. 934 కి.మీ.మేర మనకు తీరప్రాంతముంది. పక్కనే నగరాలున్నాయి. సీ-ప్లేన్ సహాయంతో పనులను చక్కబెట్టుకునే పరిస్థితి ఉంటుంది. రాబోయే రోజుల్లో విమనాశ్రయాలే కాకుండా సీ-ప్లేన్ ద్వారా ఎక్కడికక్కడ రవాణా సదుపాయాలు ఏర్పాటు చేసుకునే పరిస్థితి వస్తుంది. దానికి మనం కృషిచేయాల్సిన అవసరముంది. ఒక్క రూపాయి ఖర్చుపెట్టకుండా హైదరాబాద్‌లో శంషాబాద్ ఎయిర్‌పోర్టు తీసుకొచ్చాం. ఈరోజు ఆ విమానాశ్రయం వల్ల 18-20 శాతం వృద్ధిరేటు పెరిగింది. దేశంలో 800 విమానాలు ఉన్నాయి.. 275 హెలికాప్టర్లు ఉన్నాయి. ఈరోజు విమానయాన మంత్రి రామ్మోహన్‌నాయుడుకు ఒకటే చెబుతున్నా. రాబోయే ఏడాదికాలంలో పది స్లీ-ప్లేన్లు అభివృద్ధి చేయండి. ఒకటి, రెండు సీ-ప్లేన్‌లను ఇక్కడే వాడుకునేందుకు ఏర్పాటు చేస్తానని హామీ ఇస్తున్నా. ఒకప్పడు మొత్తం మనమే చేయాలనేది విధానం.. ఇప్పుడు ప్రభుత్వ విధానం.. మనం ఒక పాలసీ ఇస్తే ప్రైవేటు వ్యక్తులు వచ్చి పెట్టుబడులు పెట్టి సంపద సృష్టించే పరిస్థితికి ఉంది. దీన్నే మనం ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం (పీపీపీ) విధానం అన్నాం. రోడ్లు వచ్చినా, విమానాశ్రయాలు వచ్చినా, విద్యుత్ వచ్చినా, అనేక మౌలిక వసతులు వచ్చినా అన్నీ పీపీపీలో వచ్చే పరిస్థితి వచ్చింది’ అని సీఎం చంద్రబాబు వివరించారు.
ఒక్క వాట్సాప్ మెసేజ్‌తో 100 రకాల సేవలు:
ఎవరూ ఎక్కడికీ వెళ్లాల్సిన అవసరం లేకుండా వాట్సాప్‌లో మెసేజ్ పెడితే అవసరమైన సర్టిఫికేట్ వచ్చే పరిస్థితి త్వరలో రానుందని.. 100 రకాల సేవలు అందుబాటులో రానున్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. టెక్నాలజీని ఉపయోగించుకుంటే భవిష్యత్తు బంగారమవుతుంది. ప్రపంచం నేడు వేగంగా ముందుకెళ్తోంది. మారుతున్న పరిస్థితులను మనం ఎప్పటికప్పుడు అధ్యయనం చేసుకోవాలి. టెక్నాలజీలో వస్తున్న మార్పులను అడాప్ట్ చేసుకొని ముందుకెళ్లాలి. దీనివల్ల మన భవిష్యత్తుతోపాటు రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుంది. ప్రతి ఛాలెంజ్‌నూ ఒక అవకాశంగా మార్చుకోవాలి.
ప్రతి సంక్షోభాన్నీ అవకాశంగా మలచుకోవాలని యువతకు సూచిస్తున్నా. మన రాష్ట్రంలో అపార వనరులున్నాయి. డైనమిక్ ప్రజలు ఉన్నారు. అదృష్టమో దురదృష్టమో తెలీదుకానీ ఇక్కడ ఉన్నవారు ఇక్కడ రాణించరుగానీ అమెరికాలో రాణిస్తారు. పక్క రాష్ట్రాల్లో రాణిస్తారు. ఇక్కడున్న వారు కూడా రాణించే విషయంపై నేను చాలా స్పష్టతతో ఉన్నాను. అందుకే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అని ఒకప్పుడు అంటే ఇప్పుడు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటున్నాను. వ్యవసాయ రంగంలో డ్రోన్ వినియోగం విస్తృతంగా పెరుగుతుంది. రాబోయే రోజుల్లో డ్రోన్ల ద్వారా ఎరువులను కూడా స్ప్రే చేసే పరిస్థితికి వస్తున్నాం. భూసారస్థాయిని కూడా డ్రోన్లు ద్వారా, శాటిలైట్ల ద్వారా తెలుసుకునే పరిస్థితి వస్తుంది. పంట ఎంత వస్తుందో డ్రోన్ల ద్వారా అంచనా వేసి.. కోతలకు, మార్కెటింగ్‌కు ముందుగానే ఏర్పాట్లు చేసుకునే పరిస్థితి వస్తుంది. నాలెడ్జ్ ఎకానమీలో పెను మార్పులు వచ్చాయి. ఇంకా వస్తాయి. రాబోయే రోజుల్లో హార్డ్ వర్క్ కంటే స్మార్ట్ వర్క్‌కు ప్రాధాన్యమివ్వాలి. స్మార్ట్ వర్క్ వల్ల పదిరెట్లు ఎక్కువ పనిచేసే అవకాశం వస్తుంది. రియల్‌టైమ్ డేటాతో విప్లవాత్మక ప్రయోజనాలు ఉంటాయి. భవిష్యత్తులో ఏ నిర్ణయమైనా 80 శాతం కచ్చితత్వంతో తీసుకుంటే ఆ నిర్ణయం వల్ల మంచి ఫలితాలు వస్తాయి’ అని ముఖ్యమంత్రి వివరించారు.
డీప్ టెక్నాలజీని ప్రమోట్ చేస్తున్నాం
నేడు డీప్ టెక్నాలజీ ప్రమోట్ చేస్తున్నామని ముఖ్యమంత్రి అన్నారు. ఈ డీప్ టెక్నాలజీని అడాప్ట్ చేసుకుంటే ప్రపంచానికి సేవలు అందించే అవకాశం యువతకు వస్తుందన్నారు. థింక్ గ్లోబల్లీ.. యాక్ట్ గ్లోబల్లీ అని అందుకే చెబుతూ వస్తున్నాను. ప్రధాని సైతం సీ-ప్లేన్ ఆలోచన చాలా మంచిదన్నారు. సీ-ప్లేన్ విధానాలను సరళీకృతం చేశారు. ప్రజలకు ఉపయోగపడేది ఏదైనా చేయగలిగే పరిస్థితిలో వారున్నారు. మనకు ఏడు పోర్టులున్నాయి. ఇంకా అయిదారు పోర్టులు వస్తాయి. మనకు ఏడు విమానాశ్రయాలున్నాయి. ఇంకా అయిదారు వస్తాయి. సీ-ప్లేన్ సహాయంతో ఎక్కడ కావాలంటే అక్కడ దిగొచ్చు. సముద్రంలో దిగొచ్చు. రిజర్వాయర్‌లో దిగొచ్చు. సీ-ప్లేన్ ప్రయాణం కొత్త అనుభూతినిస్తుంది. మౌలిక వసతులు మీద డబ్బులు ఖర్చుచేస్తే 2నుంచి 2.5 రెట్లు మల్టిప్లయర్ ఎఫెక్ట్ వస్తుంది. ఉద్యోగాలు, ఆదాయం, జీవీఏ, జీఎస్‌డీపీ.. వంటివన్నీ ఆ మేరకు వస్తాయి. అదే పర్యాటకంపై పెట్టుబడులు పెడితే నాలుగునుంచి 6 రెట్లు మల్టిప్లయర్ ఎఫెక్ట్ వస్తుంది. ఈ విషయాన్ని అందరూ గుర్తించాల్సిన అవసరముంది.
ప్రపంచంలోని అతి సుందరమైన 10 ప్రాంతాల్లో గండికోట ఒకటి. అమెరికాలోని గ్రాండ్ కేనియన్‌తో సమానంగా మన గండికోట ఉంటుంది. దీన్ని మనం ఉపయోగించుకోలేకపోయాం. ఆరోజు ఎన్‌టీ రామారావు ఇరిగేషన్ ప్రాజెక్టు గండికోటలో కట్టారు. దాన్ని ఈరోజు పూర్తిచేసిన తర్వాత 25 టీఎంసి జలాలు అందులో పెట్టే పరిస్థితికి వచ్చాం. నేరుగా ఇక్కడ సీ-ప్లేన్ ఎక్కి వెళితే నేరుగా గండికోటలో దిగి.. అక్కడ హోటల్లో ఉండి.. మళ్లీ విజయవాడకు వచ్చే పరిస్థితి. టూరిజం డెవలప్‌మెంట్‌కు ఉండాల్సింది, మంచి హోటళ్లు, ఆతిథ్యం, మంచి రవాణా సౌకర్యాలు, మంచి ప్రాంతాలు. మనకు అన్నీ ఉన్నాయి. కానీ.. ఇప్పటివరకు వీటిని సద్వినియోగం చేసుకోలేదు. టూరిజం వల్ల వైట్ కాలర్ జాబ్స్ వస్తాయి’ అని సీఎం వివరించారు.
‘టూరిజానికి ఇండస్ట్రియల్ స్టేటస్ ఇచ్చాం. త్వరలోనే విధానం వస్తుంది. మంచి హోటళ్లు తీసుకొస్తాం. ఆతిథ్యానికి ప్రాధాన్యం ఇస్తాం. కోనసీమ, అరకు వంటి సుందర ప్రాంతాలున్నాయి. అరకులో ప్రకృతి సోయగాలను చూస్తూ కాఫీ తాగితే వచ్చే అనుభవం పారిస్‌లో రాదని చెబుతున్నా. రాష్ట్రంలో లా అండర్ ఆర్డర్ సమస్య ఉంటే టూరిజం రాదు. రౌడీలుండే ప్రాంతానికి ఎవరూ రారు. ప్రశాంతమైన వాతావరణముంటే, దానికోసమే ప్రపంచం మొత్తం వచ్చే పరిస్థితి ఉంటుంది. పరిశ్రమలు వస్తాయి. మన భవిష్యత్తు బాగుంటుందని నమ్మకంగా చెబుతున్నా’ అని చంద్రబాబు స్పష్టం చేశారు.
సీ-ప్లేన్ ఓ కొత్త ప్రయోగం
సీ-ప్లేన్ ఓ కొత్త ప్రయోగమని.. చాలా సంతోషమని.. ఇలాంటి ప్రయోగాలు దేశంలో, ప్రపంచంలో ఎక్కడ జరిగినా మొదట అది అమరావతిలోనే జరగాలి.. మొట్టమొదట మనమే ప్రారంభించాలనేది మా అభిమతం. భవిష్యత్తులో ఇలాంటి వినూత్న కార్యక్రమాలన్నో చేసి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు, కష్టాలను అధిగమించి లక్ష్య సాధనకు పనిచేస్తామంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రానికి హామీ ఇచ్చారు.