- కార్యకర్తల కుటుంబాలకు భువనేశ్వరి భరోసా
- ఐదు కుటుంబాలకు పరామర్శ
వినుకొండ, తిరువూరు(చైతన్యరథం): పార్టీ కార్యకర్తలు తమ కుటుంబసభ్యులని, వారికి కష్టం వస్తే ఆదుకోవటం తమ బాధ్యత అని టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి స్పష్టం చేశారు. పార్టీ అధినేత కోసం ప్రాణాలొదిలిన కార్యకర్తల కుటుంబాలకు అండగా ఉండటం తమ కర్తవ్యమన్నారు. నిజం గెలవాలి కార్యక్రమంలో భాగంగా పల్నాడు జిల్లా వినుకొండ, ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గాల్లో శుక్రవారం భువనేశ్వరి పర్యటించి కార్యకర్తల కుటుంబాలను పరామర్శించారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు అక్రమ అరెస్టును తట్టుకోలేక మనస్తాపానికి గురై గుండెపోటుతో మృతి చెందిన కార్యకర్తల కుటుంబాలను పరామర్శించి, ధైర్యం చెప్పేందుకు నిజం గెలవాలి పేరుతో భువనేశ్వరి రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తున్నారు. శుక్రవారం ఐదు కుటుంబాలను భువనేశ్వరి పరామర్శించారు. మృతి చెందిన కార్యకర్తల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. తనను చూసి ఉద్వేగానికి గురైన మృతుల కుటుంబసభ్యులను ఓదార్చి, ధైర్యం చెప్పారు. పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
వినుకొండ నియోజకవర్గం, బొల్లాపల్లి మండలం, రేమిడిచర్ల గ్రామంలో గత ఏడాది సెప్టెంబర్ 10న మృతిచెందిన షేక్ హుస్సేన్ (64), తిరువూరు నియోజకవర్గం, విసన్నపేట మండలం, కొండపర్వ గ్రామంలో గత ఏడాది సెప్టెంబర్ 17న మృతి చెందిన శ్రీనివాసరావు(39), అదే గ్రామంలో గత ఏడాది సెప్టెంబర్ 13న మృతి చెందిన బాణావత్ దానమ్మ (65), అదే నియోజకవర్గం, ఎ.కొండూరు మండలం, కుమ్మరికుంట్ల గ్రామంలో గత ఏడాది సెప్టెంబర్ 23న మృతి చెందిన గుగులోతు బాబ్ల (70), అదే మండలం, పోలిశెట్టిపాడు గ్రామంలో గత ఏడాది అక్టోబర్ 19న మృతిచెందిన బొల్లెపోగు నాగరాజు (38) కుటుంబాలను భువనేశ్వరి పరామర్శించారు.