- కాలువల్లో పూడికతీత ఫైలుపై తొలి సంతకం
అమరావతి: రాష్ట్రానికి జీవనాడి అయిన పోలవరంతో పాటు ఇతర ప్రాజెక్టులను ప్రాధాన్యతగా తీసుకుని పూర్తిచేస్తామని ఏపీ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. సచివాలయంలోని నాలుగో బ్లాక్‌లో మంత్రిగా గురువారం ఆయన బాధ్యతలు చేపట్టారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. కీలకమైన జలవనరుల శాఖ బాధ్యతలు అప్పగించిన సీఎం చంద్రబాబుతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేష్‌కు ఆయన ధన్యవాదాలు తెలిపారు. వ్యవసాయం, రైతుల విషయంలో గత ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని, కాలువల్లో నీరు పారకుండా చేశారని విమర్శించారు. కాలువల్లో పేరుకుపోయిన గుర్రపుడెక్క తొలగింపు, పూడికతీతపై తొలి సంతకం చేసినట్టు వివరించారు. గత ప్రభుత్వం వ్యవసాయం, రైతుల పట్ల నిర్లక్ష్యం వహించిందని.. కాలువల్లో నీరు పారకుండా చేశారని మంత్రి నిమ్మల ఆరోపించారు. గేట్లు, షట్టర్లు, లాకుల మరమ్మతు కోసం నిధులు విడుదల చేస్తున్నామన్నారు.
వర్షాల సీజన్‌లో వరదలకు ఏటి గట్లు తెగిపోకుండా ముందస్తు చర్యలకు ఆదేశాలు ఇచ్చామని వివరించారు. సాగునీరు, వ్యవసాయ రంగాలను జగన్ ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని.. వాటిని గాడిలో పెట్టాల్సి ఉందన్నారు. గతంలో తెదేపా ప్రభుత్వ హయాంలో సాగునీటికి రూ.80వేల కోట్ల కేటాయింపులు చేశామని గుర్తుచేశారు. పోలవరం ప్రాజెక్టు ద్వారానే రాష్ట్రం మొత్తాన్ని సస్యశ్యామలం చేయగలమని మంత్రి చెప్పారు. 2019-24 మధ్య పోలవరాన్ని విధ్వంసం చేశారని.. వైకాపా ప్రభుత్వం ఆ ప్రాజెక్టును 20 ఏళ్లు వెనక్కి నెట్టిందని విమర్శించారు. ప్రాజెక్టును క్లిష్టతరం చేశారన్నారు. ఆ సవాళ్లను అధిగమించి పోలవరాన్ని పూర్తిచేస్తామని తెలిపారు. ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పినా వైకాపా నేతలు తమ తప్పులను సమర్థించుకునే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు.తనను గెలిపించి మంత్రిని చేసిన నియోజకవర్గ ప్రజలకు పాదాభివందనం చేస్తున్నానన్నారు. కూటమి ద్వారా తన గెలుపునకు సహకరించిన డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్‌కు ధన్యవాదాలు తెలిపారు.
అన్నదాతకు సేవ చేసే ఇరిగేషన్ లాంటి శాఖలను జగన్‌రెడ్డి నిర్వీర్యం చేశారన్నారు. ఎన్‌టీఆర్, చంద్రబాబు నాయుడు ఇరిగేషన్‌కు అత్యంత ప్రాధాన్యం ఇచ్చారన్నారు. పోలవరం ఏపీకి వరమని, జీవనాడి అని పేర్కొన్నారు. అందుకే గతంలో చంద్రబాబు 5 ఏళ్లపాటు అప్పట్లో అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి పోలవరం పనులను పరుగులు పెట్టించారన్నారు. 2019లో జగన్ అధికారం లోకి వచ్చాక నిర్మాణ సంస్థను మార్యారు. 13 నెలల పాటు ప్రాజెక్ట్ పై అధికారుల పర్యవేక్షణ లేకుండా చేశారు. ప్రాజెక్టు కాంట్రాక్టర్ మార్పు తగదని కేంద్రం చెప్పినా వినకుండా మార్చేసి ప్రాజెక్టును దెబ్బ తీశారు. పోలవరం డయాఫ్రం వాల్ దెబ్బతినడం వెనుక కాంట్రాక్టర్ మార్పే ప్రధాన కారణం. ఇప్పుడు డయాఫ్రమ్ వాల్ కొత్తది నిర్మించాల్సి వుంటుంది. పోలవరంలో ఎంత డబ్బు.. ఎవరెలా దోచేశారో విచారిస్తాం.. తప్పు చేసిన వాళ్ళను వదిలిపెట్టం. వెంటనే జలవనరుల శాఖ పరిస్థితిపై, గత ప్రభుత్వ విధ్వంసంపై సమీక్షించి శ్వేత పత్రం విడుదల చేస్తామని నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు.
ప్రస్తుత వర్షాకాలంలో కాలువ, ఏటి గట్లు తెగిపోకుండా ముందస్తు చర్యలకు ఆదేశాలు ఇచ్చినట్టు తెలిపారు. పోలవరం పూర్తిచేసి రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేస్తామని చెప్పారు. రామానాయుడు బాధ్యతల స్వీకరణకు ముందు కొందరు దివ్యాంగులు ఆయనను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. తనను కలిసిన దివ్యాంగులతో ఆప్యాయంగా ముచ్చటించిన ఆయన స్వయంగా మిఠాయిలు తినిపించారు. దివ్యాంగులకు ప్రస్తుతం ఇస్తున్న రూ. 3 వేల పింఛన్‌ను వచ్చే నెల నుంచి రూ. 6 వేలకు పెంచి ఇవ్వబోతున్నట్టు తెలిపారు.