- అన్నదాతలు ఆధునిక పద్ధతులను అందిపుచ్చుకోవాలి
- నా మొదటి సంతకం 45 వేల వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ల మీదే
- వైసీపీ ప్రభుత్వంలో వ్యవసాయరంగం నిర్వీర్యం
- ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్
పల్నాడు (చైతన్యరథం): రాష్ట్ర రైతాంగానికి వ్యవసాయాన్ని లాభసాటి చేయడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ముందుకు వెళుతోందని ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్పష్టం చేశారు. పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం నడికుడిలో గురువారం జరిగిన కిసాన్ మేళా మహాత్సవ ప్రారంభ కార్యక్రమంలో మంత్రి గొట్టిపాటి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వ్యవసాయరంగంలో వినియోగించే ఆధునిక పరికరాలతో పాటు ఆధునాతన డ్రోన్లు, సాగు యంత్రాలు, పనిముట్లను మంత్రి పరిశీలించారు. వాటి పనితీరును మంత్రికి అధికారులు వివరించారు. అనంతరం మంత్రి గొట్టిపాటి మాట్లాడుతూ…. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రైతు సంక్షేమానికి అనేక చర్యలు చేపట్టామన్నారు. ఇంధనశాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన రోజే 45 వేల వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లను మంజూరు చేస్తూ తొలి సంతకం చేసినట్లు గుర్తు చేశారు. అనంతరం మరో 25 వేల వ్యవసాయ కనెక్షన్లను మంజూరు చేశామని తెలిపారు. ఒక్కో వ్యవసాయ కనెక్షన్‌కు రూ.2.40 లక్షలను ప్రభుత్వం ఖర్చు చేస్తోందన్నారు. వ్యవసాయానికి 9 గంటల ఉచిత కరెంట్‌ను అందిస్తున్నామన్నారు. కిసాన్ మేళా వంటి కార్యక్రమాలు జరుగుతూ ఉంటే రైతులు ఆధునిక పద్దతులను అందిపుచ్చుకునే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.
పొగాకు కొనుగోళ్లకు కంపెనీలు వెనకడుగు వేసినా….
అత్యధిక దిగుబడి రావటంతో నల్లబర్లీ పొగాకును కొనుగోలు చేయడానికి కంపెనీలు ముందుకు రాకపోవడంతో ప్రభుత్వమే పొగాకు కొనుగోలు చేస్తోందని మంత్రి గొట్టిపాటి చెప్పారు. పొగాకు రైతుల ఇబ్బందులు సీఎం దృష్టికి తీసుకెళ్లగానే కొనుగోళ్లకు రూ.270 కోట్లు కేటాయించారని స్పష్టం చేశారు. పొగాకుతో పాటు కోకో, మామిడి రైతులను అదనపు మద్దతు ధరతో ప్రభుత్వం ఆదుకుందని తెలిపారు. తక్కువ ఖర్చుతో అధిక దిగుబడి వచ్చే పంటలను పండిరచే పద్ధతులు అనుసరించాలని రైతులకు సూచించారు. ఆధునిక వ్యవసాయ పరికరాలు, యంత్రాలు, పనిముట్లు కొనుగోళ్లకు సంబంధించి అందుబాటులో ఉండే సబ్సిడీ రుణాలను రైతులు వినియోగించుకోవాలని ఆయన స్పష్టం చేశారు.
రైతులకు జరిగే మంచిని ఓర్వలేక జగన్ దుష్ప్రచారం…
రైతులకు అందుతున్న ప్రయోజనకరమైన పథకాలను చూసి ఓర్వలేని జగన్మోహన్ రెడ్డి… కూటమి ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నాడని మంత్రి గొట్టిపాటి రవికుమార్ మండిపడ్డారు. మామిడి కొనుగోళ్లలో ఇబ్బందులు ఎదురైతే వ్యాపారులు ఇచ్చేదానికి అదనంగా కేజీకి రూ.4 మద్దతు ధరను కూటమి ప్రకటించిందన్నారు. మామిడి పంట కొనుగోళ్లు 90 శాతం పూర్తైన తరువాత రోడ్లపైకి వచ్చి జగన్ డ్రామాలాడారని విమర్శించారు. రాష్ట్ర ప్రజలు నమ్మి ఐదేళ్లు అధికారం ఇస్తే.. వ్యవస్థల్ని సర్వనాశనం చేశారని ఆరోపించారు. జగన్ ప్రభుత్వ హయాంలో వ్యవసాయ రంగాన్ని నిర్వీర్యం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ నేతల విష ప్రచారాన్ని నమ్మడానికి ప్రజలు సిద్ధంగా లేరని తెలిపారు. కూటమి ప్రభుత్వంలోనే అన్ని వర్గాల ప్రజలకూ న్యాయం జరుగుతుందని మంత్రి గొట్టిపాటి స్పష్టం చేశారు. కార్యక్రమంలో గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు, నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, కలెక్టర్ అరుణ్ కుమార్, అధికారులు, స్థానిక కూటమి నేతలు పాల్గొన్నారు.