- నవంబర్ లో టెట్, 2026 జనవరిలో డీఎస్సీ నోటిఫికేషన్, మార్చిలో పరీక్ష
- డీఎస్సీ, స్పెషల్ డీఎస్సీలకు అభ్యర్థులంతా సన్నద్ధం కండి
- 11 జవహర్ నవోదయ విద్యాలయాల పనుల ప్రారంభానికి కార్యాచరణ
- విద్యాప్రమాణాలపై అధ్యయనానికి సింగపూర్కు ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీతలు
- పాఠశాల, ఇంటర్మీడియట్, కళాశాల విద్యపై సమీక్షలో మంత్రి నారా లోకేష్
అమరావతి (చైతన్యరథం): ప్రతిఏటా డీఎస్సీ ద్వారా టీచర్ పోస్టుల భర్తీకి ఇచ్చిన హామీకి కట్టుబడి ఈ ఏడాది నవంబర్ చివరివారంలో టెట్, 2026 జనవరిలో డీఎస్సీ నోటిఫికేషన్, మార్చిలో డీఎస్సీ పరీక్షల నిర్వహించి, టీచర్ పోస్టులను భర్తీ చెయ్యాలని అధికారులను రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ ఆదేశించారు. పాఠశాల విద్య, ఇంటర్మీడియట్, కళాశాల విద్య ఉన్నతాధికారులతో మంత్రి లోకేష్ గురువారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ… టెట్, డీఎస్సీలకు అభ్యర్థులంతా సన్నద్ధం కావాలన్నారు. కొత్త డీఎస్సీ నిర్వహణ తర్వాత వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి కొత్త ఉపాధ్యాయులు విధుల్లో చేరేలా ప్రణాళిక అమలుచేయాలని సూచించారు. 2026 జనవరిలో నోటిఫికేషన్, మార్చిలో డీఎస్సీ, స్పెషల్ డీఎస్సీ నిర్వహిస్తామని తెలిపారు. విద్యార్థుల్లో కనీస అభ్యసన సామర్థ్యాలపై లక్ష్యసాధనకు యాక్షన్ ప్లాన్ రూపొందించాలని, బేస్ లైన్ టెస్ట్ నిర్వహణకు విధివిధానాలు రూపొందించాల న్నారు. అధికారులు మాట్లాడుతూ ఉపాధ్యాయుల సమస్యలకు సంబంధించి 423 విన్నపాలు తమ దృష్టికి రాగా, ఇప్పటికే 200 పరిష్కరించాం.. మిగిలిన విన్నపాలు విధానపరమైన, ఆర్థికపరమైన అంశాలకు సంబంధించినవని తెలిపారు. మెరుగైన ఫలితాలకు 100 రోజుల ప్రణాళిక పదోతరగతి విద్యార్థులకు డిసెంబర్ కల్లా సిలబస్ పూర్తిచేసి, ఆ తర్వాత 100 రోజుల ప్రణాళిక ద్వారా మెరుగైన ఫలితాల సాధనకు కృషిచేయాలని మంత్రి లోకేష్ ఆదేశించారు. 1నుంచి 5వ తగరతి వరకు పాఠ్యప్రణాళిక సంస్కరణలను సమర్థవంతంగా అమలు చేయాలన్నారు. రాష్ట్రానికి కొత్తగా మంజూరైన 11 జవహర్ నవోదయ విద్యాలయాలకు సంబంధిం చిన పనులను త్వరగా ప్రారంభించేందుకు కార్యాచణ సిద్దం చేయాలన్నారు. నవంబర్ 26వతేదీన రాజ్యాంగ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని, ఆ రోజున నిర్వహించనున్న స్టూడెంట్ అసెంబ్లీకి ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, స్పీకర్ తోపాటు తాను కూడా హాజరవుతామని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా 78 మంది ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీతలను మెరుగైన విద్యాప్రమాణాలపై అధ్యయనానికి సింగపూర్ పర్యట నకు పంపించాలని, ఇందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాల్సిందిగా సూచించారు. వచ్చే విద్యాసంవత్స రంలో విద్యార్థులకు సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర పథకం కింద అందించాల్సిన స్టూడెంట్ కిట్స్పై సమావేశంలో చర్చించారు. మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించి కడప స్మార్ట్ కిచెన్ మోడల్ను రాష్ట్ర వ్యాప్తంగా అన్నిజిల్లాల్లో అమలుచేసేందుకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. హైస్కూళ్లలో కంప్యూటర్ ల్యాబ్లు, ఇతర కనీస మౌలిక సదుపాయాల కల్పనకు చర్యలు చేపట్టాలన్నారు.
అత్యుత్తమంగా సెంట్రల్ లైబ్రరీ
అమరావతిలో రూ.100 కోట్ల వ్యయంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్న సెంట్రల్ లైబ్రరీ నిర్మాణానికి సంబంధించి డిజైన్ కోసం హ్యాకథాన్ నిర్వహించి, బెస్ట్ మోడల్ను ఎంపిక చేయాలని మంత్రి లోకేష్ ఆదేశించారు. జిల్లా, అసెంబ్లీ నియోజకవర్గాల్లో లైబ్రరీల ఆధునీకరణకు ప్రణాళికలు రూపొందించాలన్నారు. రాష్ట్రవ్యాప్తంగా స్థానిక సంస్థల నుంచి రావాల్సిన లైబ్రరీ సెస్సును రాబట్టేందుకు చర్యలు చేపట్టాలని సూచించారు. ఇటీవల ప్రకటించిన షెడ్యూలుకు అనుగుణంగా ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలి.. మెరుగైన ఫలితాలను రాబట్టేందుకు వందరోజుల ప్రణాళికను అమలు చేయాలని సూచించారు.రాష్ట్రవ్యాప్తంగా హైస్కూల్ ప్లస్లను మెరుగుపర్చేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. త్వరలో ప్రారంభించబోయే కలలకు రెక్కలు పథకం విధివిధానాలపై సమావేశంలో చర్చించారు. ఈ సమావేశంలో మానవవనరుల శాఖ కార్యదర్శి కోన శశిధర్, పాఠశాల విద్యాశాఖ కమిషనర్ విజయరామరాజు, కళాశాల విద్యాశాఖ డైరెక్టర్ నారాయణ భరత్ గుప్త, సమగ్ర శిక్ష ప్రాజెక్ట్ డైరెక్టర్ బి.శ్రీనివాసరావు, పబ్లిక్ లైబ్రరీస్ డైరెక్టర్ కృష్ణమోహన్, గ్రంథాలయ మౌలిక సదుపాయాల సంస్థ ఎండి దీవన్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.