- సంపద సృష్టించి సంక్షేమాన్ని అమలు చేస్తున్నాం
- అర్హులైన దివ్యాంగుల పింఛన్లను తొలగించేది లేదు
- పార్టీలకతీతంగా సంక్షేమ కార్యక్రమాలు అమలు
- జగన్ అసమర్థ పాలనతో రాష్ట్రానికి లక్షల కోట్ల నష్టం
- స్త్రీశక్తి విజయోత్సవ సభలో మంత్రి గొట్టిపాటి రవికుమార్
పిడుగురాళ్ల (చైతన్య రథం): ఎన్నికల ముందు ఇచ్చిన ప్రతీ హామీని కూటమి ప్రభుత్వం నెరవేర్చుతున్నదని ఇంధన మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్పష్టం చేశారు. పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో సోమవారం స్థానిక ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు ఏర్పాటు చేసిన స్త్రీశక్తి విజయోత్సవ సభలో సహచర మంత్రి వంగలపూడి అనితతో కలిసి మంత్రి గొట్టిపాటి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన భారీ ర్యాలీ అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో మంత్రి గొట్టిపాటి మాట్లాడుతూ… కూటమి ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోను సమర్థంగా అమలు చేస్తోందన్నారు. మంత్రి నారా లోకేష్ నాయకత్వంలో రూ.9,500 కోట్లతో తల్లికి వందనం పథకాన్ని విజయవంతంగా అమలు చేశామన్నారు. అదేవిధంగా స్వాతంత్య్ర దినోత్సవ కానుకగా స్త్రీశక్తి పథకాన్ని ప్రారంభించామని అన్నారు. రూ.2 వేల కోట్లతో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించామని వివరించారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా సుమారు 63 లక్షల పింఛన్ల కోసం ఏటా రూ.33 వేల కోట్లుకు పైగా ఖర్చు చేస్తున్నామన్నారు. భర్త చనిపోయిన వారికి కొత్తగా 1.11 లక్షల స్పౌజ్ పింఛన్లను మంజూరు చేశామని మంత్రి తెలిపారు. అర్హులైన దివ్యాంగుల పింఛన్లను ఎప్పటికీ తొలగించబోమని చెప్పారు. దివ్యాంగుల పింఛన్ల విషయంలో జగన్ అండ్ కో చేస్తున్న అబద్ధపు ప్రచారాన్ని ఖండిరచారు.
చంద్రబాబు నాయుడుపై నమ్మకంతో రాజధాని రైతులు 33 వేల ఎకరాలు ఇచ్చారని మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. అబద్దాలతో అధికారంలోకి వచ్చిన జగన్మోహన్‌రెడ్డి మూడు రాజధానుల పేరుతో వ్యవస్థలను నాశనం చేసిన చరిత్రహీనుడని తీవ్రంగా విమర్శించారు. రాష్ట్రానికి రాజధాని లేని పరిస్థితిని జగన్ సృష్టించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా సీఎం చంద్రబాబు పనిచేస్తుంటే.. ప్రజా దోపిడీనే లక్ష్యంగా జగన్‌రెడ్డి పాలన సాగిందని వ్యాఖ్యానించారు. వైసీపీ ఐదేళ్ల కాలంలో కనీసం ఒక్క సాగునీటి ప్రాజెక్టును కూడా పట్టించుకున్న పాపాన పోలేదని మంత్రి గొట్టిపాటి ఆరోపించారు. టీడీపీ హయాంలో 70 శాతం పూర్తి చేసిన పోలవరంను కూడా జగన్ పూర్తి చేయలేకపోయాడని అన్నారు. జగన్ రెడ్డి పాలనలో తీసుకున్న తప్పుడు నిర్ణయాలతో రాష్ట్రానికి లక్షల కోట్ల నష్టం వాటిల్లిందని వివరించారు.
జగన్ పాలనలో విద్యుత్ శాఖ పూర్తిగా నిర్వీర్యమైందని మంత్రి గొట్టిపాటి వ్యాఖ్యానించారు. తొమ్మిదిసార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి ప్రజలపై భారం మోపారని ఆరోపించారు. అధిక ధరలకు విద్యుత్ కొనుగోలు చేసి భారీ అవినీతికి పాల్పడ్డారని, జగన్మోహన్‌రెడ్డి విధ్వంస పాలన కారణంగా విద్యుత్ శాఖ రూ.1.10 లక్షల కోట్ల నష్టపోయిందని మంత్రి వివరించారు. దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించిన చంద్రబాబు నాయుడు… అబ్దుల్ కలాంలాంటి రాష్ట్రపతిని, వాజపేయిలాంటి ప్రధానిని దేశానికి అందించారని మంత్రి గొట్టిపాటి గుర్తు చేశారు. దేశ విదేశాల్లో తెలుగు యువతకు ఉద్యోగావకాశాలు లభించడం కూడా చంద్రబాబు సంస్కరణల వలనేనన్నారు. దేశంలో ఎక్కడాలేని విధంగా నదుల అనుసంధానంతో సీఎం చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ సర్వతోముఖాభివృద్ధిలో ఎంతో కీలక పాత్ర పోషిస్తున్నారని మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే గల్లా మాధవి, టీడీపీ సీనియర్ నాయకురాలు నన్నపనేని రాజకుమారితోపాటు పలువురు కూటమి నేతలు పాల్గొన్నారు.