- సుప్రీంకోర్టు స్పష్టీకరణ
- నిందితుల బెయిల్ రద్దు చేయాలని కోరిన సునీత, సీబీఐ తరఫు న్యాయవాదులు
- తదుపరి విచారణ వచ్చే 9కు వాయిదా
న్యూఢిల్లీ: వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్య కేసులో ఆయన కుమార్తె డాక్టర్ నర్రెడ్డి సునీతకు భారీ ఊరట లభించింది. సునీత సహా ఆమె భర్త రాజశేఖర్ రెడ్డి, అప్పట్లో ఈ కేసును విచారించిన సీబీఐ ఏఎస్పీ రాంసింగ్‌లపై అప్పట్లో కడప పోలీసులు నమోదు చేసిన కేసులను సుప్రీంకోర్టు కొట్టేసింది. సాక్షులను బెదిరిస్తున్నందున ఎంపీ అవినాష్‌రెడ్డి సహా, నిందితుల బెయిల్స్ రద్దు చేయాలని, తమపై పెట్టిన అక్రమ కేసులను కొట్టేయాలని వైఎస్ సునీత దాఖలు చేసిన పిటిషన్లపై సుప్రీంకోర్టులో మంగళవారం విచారణ జరిగింది. జస్టిస్ ఎంఎం సుందరేశ్, జస్టిస్ ఎన్‌కే సింగ్ ధర్మాసనం విచారణ చేపట్టింది. వివేకా కుమార్తె సునీతతోపాటు, అల్లుడు నర్రెడ్డి రాజశేఖర్రెడ్డి, అప్పటి సీబీఐ విచారణాధికారి రాంసింగ్‌పై పెట్టిన కేసులను క్వాష్ చేస్తామని ధర్మాసనం స్పష్టం చేసింది. చట్టాన్ని దుర్వినియోగం చేయడానికే వారిపై కేసు పెట్టారని ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది.
వివేకా కుమార్తె సునీత తరపున న్యాయవాది సిద్ధార్థ లూడ్రా వాదనలు వినిపించారు. అవినాష్ సహా ప్రధాన నిందితుల బెయిల్ రద్దు చేయాలని కోరారు. సుప్రీంకోర్టు గడువు వల్లే దర్యాప్తు ముగించినట్లు సీబీఐ చెబుతోందని లూథ్రా వివరించారు. వివేకా హత్య కేసులో మరింత లోతుగా దర్యాప్తు అవసరం ఉందని పేర్కొన్నారు. అసలు సూత్రధారులు, పాత్రధారులు ఎవరో బయటకు రావాల్సి ఉందన్నారు. సాక్షులను బెదిరించడంతో పాటు, సాక్ష్యాలను నాశనం చేయాలని ప్రయత్నిస్తున్నారని లూథ్రా కోర్టుకు వెల్లడిరచారు. సునీత దంపతులతోపాటు రాంసింగ్‌పైనా కుట్రపూరితంగా కేసులు నమోదు చేశారని వివరించారు. దీంతో ఆ కేసులను సుప్రీంకోర్టు క్వాష్ చేసింది.
సీబీఐ తరపున అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వీ రాజు వాదనలు వినిపించారు. నిందితుల బెయిల్ రద్దు చేయాలని సుప్రీంను కోరారు. హత్య తీరు చూస్తే నిందితులకు 2, 5 ఏళ్లు జైలు శిక్ష చాలా తక్కువే అనిపిస్తోంది. ఆధారాలు చెరిపేయడం, సాక్ష్యాధారాలు లేకుండా చేశారని నిరూపితమైంది. ముందు గుండెపోటు అని.. తర్వాత రక్తపు వాంతులని ప్రచారం చేశారు. హత్య అని తెలియకుండా ఆధారాలను చెరిపేసేందుకు అన్ని విధాలా ప్రయత్నం చేశారు. అన్ని వివరాలు దర్యాప్తులో పూర్తిగా బయటపడ్డాయని ఎస్వీ రాజు కోర్టుకు వివరించారు.
ఏపీ ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది హుజేఫా అహ్మదీ వాదనలు వినిపిస్తూ.. నిందితుడు శివశంకర్ రెడ్డి కొడుకు చైతన్య రెడ్డి మెడికల్ క్యాంప్ పేరుతో కడప జైలుకు వెళ్లారు. ఇందుకు సంబంధించి అన్ని ఆధారాలు ఫొటోలతో సహా ఉన్నాయి. జైలుకెళ్లి అప్రూవర్ దస్తగిరిని బెదిరించినట్లు సాక్ష్యాలున్నాయని పేర్కొన్నారు. ఇక ఈ కేసులో కోర్టు మరణశిక్ష విధించే అవకాశం కూడా ఉందని సీబీఐ తరపు న్యాయవాది పేర్కొన్నారు.
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఎంత మంది నిందితుల బెయిల్ రద్దు చేయాలో చెప్పాలని సీబీఐని సుప్రీంకోర్టు ఆదేశించింది. అలాగే తదుపరి దర్యాప్తు అవసరమో లేదో చెప్పాలని కూడా సీబీఐకి నిర్దేశించింది. ఈ మేరకు సుప్రీం ధర్మాసనం తదుపరి విచారణను వచ్చే నెల 9కి వాయిదా వేసింది.
తప్పుడు కేసులు
వివేకానందరెడ్డి దారుణ హత్య కేసులో కొందరిని బలవంతంగా అరెస్టు చేస్తున్నారని, వారిని ఈ కేసును ఒప్పుకోవాలంటూ ఒత్తిడి చేస్తున్నారని పేర్కొంటూ అప్పట్లో ఎంపీ అవినాష్ రెడ్డి అనుచరులు పులివెందుల పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో సీబీఐ ఏఎస్పీ రాంసింగ్‌పై కేసులు నమోదు చేయడంతో పాటు నోటీసులు కూడా ఇచ్చారు. ఇక సునీత దంపతుల ప్రమేయంతోనే ఈ హత్య జరిగిందని మరో కేసు నమోదైంది. ఆస్తి వివాదాల కారణంగానే హత్యకు ప్రేరేపించారని, తమను బెదిరిస్తున్నారని పేర్కొన్నారు. దీనిపైనా కేసు నమోదైంది. ఈ కేసులను తాజాగా సుప్రీంకోర్టు కొట్టి వేసింది.