- రైతులకు ఎలాంటి ఆందోళనా వద్దు
- పంటలన్నింటికీ మద్దతు ధర దక్కాల్సిందే
- ధాన్యం కొనుగోళ్లలోనూ… చెల్లింపుల్లోనూ ఇబ్బంది తలెత్తకూడదు
- రైతులకు గోనె సంచుల సరఫరాలో లోపాలు ఉండొద్దు
- పత్తి, అరటి, మొక్క జొన్న రైతుల కష్టాన్ని అధిగమించేందుకు చర్యలు
- రైస్ మిల్లర్లు, ట్రేడర్లు, ఎగుమతిదారులతో టెలీకాన్పరెన్స్ నిర్వహించండి
- వ్యవసాయ, పౌర సరఫరాల శాఖల సమీక్షలో సీఎం చంద్రబాబు
- పత్తి కొనుగోలులో ఇబ్బందులపై కేంద్ర టెక్స్ టైల్స్ శాఖ కార్యదర్శికి ఫోన్ చేసిన సీఎం
అమరావతి (చైతన్య రథం): రాష్ట్రంలో పండుతున్న అన్ని పంటలకు ధరలు తగ్గకుండా… ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా… రైతులకు ఎలాంటి నష్టం జరగకుండా చూడాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. ధాన్యం కొనుగోలు, చెల్లింపుల్లోనూ ఎలాంటి అడ్డంకులు లేకుండా చూడాలని ఆదేశించారు. బుధవారం సచివాలయంలో వ్యవసాయ, పౌరసరఫరాల శాఖపై ముఖ్యమంత్రి సమీక్షించారు. అలాగే పత్తి, అరటి, జొన్నవంటి పంటలు సాగు చేసే రైతులకు ఉన్న ఇబ్బందులను అధిగమించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. రబీ సీజన్లో 50.75 లక్షల టన్నులమేర ధాన్యాన్ని సేకరించాలనే అంచనాలు పెట్టుకున్నట్టు అధికారులు వివరించారు. ధాన్యం కొనుగోలు నిమిత్తం రూ.13,451 కోట్లు చెల్లింపులు జరపాల్సి ఉంటుందని అధికారులు చెప్పారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ… ‘‘చెల్లింపుల్లో ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకోవాలి. రెండు రోజుల్లో ధాన్యం కొనుగోలుకు సంబంధించిన చెల్లింపుల ప్రక్రియను పూర్తి చేయాలి. దీనికి సంబంధించిన నిధుల విషయంలో ఆర్థిక శాఖతో సమన్వయం చేసుకోవాలి. భారీ వర్షాలు ఉంటాయనే వాతావరణ హెచ్చరికల నేపథ్యంలో రైతులకు ఇబ్బందులు కలగకుండా గోనె సంచులను రైతులకు అందించాలి’’ అని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.
సమీక్షనుంచే కేంద్ర కార్యదర్శికి ఫోన్
పత్తి కొనుగోలులో సీసీఐ తెచ్చిన కొత్త విధానాలవల్ల ఇబ్బందులు వస్తున్నాయని మంత్రి అచ్చెన్నాయుడు ముఖ్యమంత్రి దృష్టికి తెచ్చారు. దీంతో సమీక్ష నుంచే కేంద్ర టెక్స్ టైల్స్ కార్యదర్శి నీలం రావుతో ముఖ్యమంత్రి మాట్లాడారు. పత్తి కొనుగోలు విషయంలో ఎదురవుతున్న సమస్యను వివరించారు. కొత్తగా తెచ్చిన విధానాలవల్ల రాష్ట్రంలోని పత్తి రైతులు ఇబ్బందులు పడుతున్నారని నీలంరావుకు ముఖ్యమంత్రి వివరించారు. అలాగే రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో భారీ వర్ష సూచన ఉండడంతో సమస్యను త్వరితగతిన పరిష్కారించాలని కేంద్ర టెక్స్ టైల్స్ శాఖ కార్యదర్శిని సీఎం కోరారు. అనంతరం సమీక్షలో సీఎం మాట్లాడుతూ… ‘‘పత్తి కొనుగోలు అంశంలో ఎదురవుతున్న ఇబ్బందుల విషయంలో కేంద్రంతో నిత్యం సంప్రదింపులు జరపాలి. ఈ మేరకు కేంద్ర మంత్రి రామ్మోహన్నాయుడు, ఎంపీ శ్రీకృష్ణ దేవరాయలుకు బాధ్యతలు అప్పజెప్పాలి. అరటి, జొన్న ధరలపై ఉన్న సమస్యలను అధిగమించాలి. వీటికి సంబంధించి స్థానిక ట్రేడర్లు, ఎగమతిదారులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించాలి. అలాగే ధాన్యం కొనుగోలు విషయంలోనూ రైస్ మిల్లర్లతో సంప్రదింపులు జరపాలి. వాతావరణాన్ని ఎప్పటికప్పుడు అంచనా వేయాలి. భారీ వర్షాలు వచ్చే అవకాశముంటే.. రైతులను అలెర్ట్ చేయడంతోపాటు పంటలను కాపాడేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలి’’ అని ముఖ్యమంత్రి చెప్పారు. సమీక్షలో వ్యవసాయ, పౌర సరఫరాల శాఖలకు చెందిన ఉన్నతాధికారులు పాల్గొన్నారు.











