` రైతులకు మంత్రి అచ్చెన్నాయుడు భరోసా
` బ్లాక్ బర్లీ రైతులు, కంపెనీల ప్రతినిధులతో ముఖాముఖిలో పాల్గొన్న మంత్రి
` కొనుగోలు ప్రణాళిక ప్రకటన
` కామన్ వెరైటీకి క్వింటా రూ.12 వేలు, లో గ్రేడ్ రకానికి రూ.6 వేల ధర ఖరారు
` ప్రాసెసింగ్ ఖర్చు ప్రభుత్వమే భరిస్తుందని మంత్రి హామీ
` చర్చల్లో పాల్గొన్న మంత్రి గొట్టిపాటి, ఎమ్మెల్యే ఏలూరి, అధికారులు
పర్చూరు (చైతన్యరథం): పొగాకు రైతులు పండిరచిన బ్లాక్ బర్లీ పొగాకుని చివరి ఆకు కొనే వరకు ప్రభుత్వం అండగా ఉంటుందని రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్ శాఖల మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు భరోసా ఇచ్చారు. బ్లాక్ బర్లీ పొగాకు రైతులు, బయ్యర్లుగా ఉన్న కంపెనీ ప్రతినిధులతో ముఖాముఖి కార్యక్రమం బాపట్ల జిల్లా మార్టూరు మండలంలోని పర్చూరు శాసనసభ్యులు ఏలూరి సాంబశివరావు క్యాంపు కార్యాలయంలో శనివారం జరిగింది. మంత్రి గొట్టిపాటి రవికుమార్ కూడా ఈ చర్చల్లో పాల్గొన్నారు. సుదీర్ఘ చర్చ అనంతరం బ్లాక్ బర్లీ పొగాకు కొనుగోలుపై రూపొందించిన కార్యాచరణ ప్రణాళికను మంత్రి అచ్చెన్నాయుడు ప్రకటించారు. బ్లాక్ బర్లీ పొగాకును రెండు గ్రేడ్లతో కొనుగోలు చేస్తామని మంత్రి తెలిపారు. కామన్ వెరైటీ క్వింటా ధర రూ.12 వేలకు, లో గ్రేడ్ రకాన్ని రూ.6,000కు కొనుగోలు చేయాలని ధరలను నిర్ణయించారు. అంతర్జాతీయ మార్కెట్ ధరలలో హెచ్చు, తగ్గులు ఉన్నప్పటికీ నిర్ణయించిన ధరను అమలు చేయాలని కంపెనీలకు సూచించారు. పొగాకు కొనుగోలులో ప్రాసెసింగ్ ఖర్చు ప్రభుత్వమే భరిస్తుందని హామీ ఇచ్చారు. అవసరమైతే మార్క్ ఫెడ్ ద్వారా బ్లాక్ బర్లీ పొగాకు కొనుగోలు ప్రారంభిస్తామని ప్రకటించారు. రైతులు పండిరచిన పొగాకు పంటను చివరి ఆకు వరకు కొనుగోలు చేసే బాధ్యత ప్రభుత్వానిదేనన్నారు. ఇందుకోసమే ఆరు సబ్ కమిటీలను ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు. కంపెనీలకు ప్రభుత్వం సహకారం అందిస్తుందన్నారు. కంపెనీల వద్ద సిబ్బంది లేకపోతే ప్రభుత్వ సిబ్బందిని నియమిస్తామని చెప్పారు. వేర్ హౌసింగ్ గోడౌన్లను వినియోగించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. సంక్షోభం నుంచి రైతులను బయటకు తెచ్చేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని మంత్రి అచ్చెన్నాయుడు చెప్పారు. కంపెనీలు సాకులు చెప్పడం మాని రైతులకు మేలు చేసే ఉద్దేశంతో స్పష్టమైన హామీ ఇవ్వాలని కోరారు. కంపెనీలు స్పందించకపోతే రైతులు తీవ్రంగా నష్టపోతారనే విషయాన్ని గుర్తించాలన్నారు. తాము ఫోన్ చేసినా బయ్యర్లుగా ఉన్న కంపెనీలు స్పందించడం లేదని, ఇలా వ్యవహరిస్తే ప్రభుత్వం ఉపేక్షించబోదని స్పష్టం చేశారు. సాధారణంగా 25 మిలియన్ కిలోల పొగాకు సాగు చేయాలని లక్ష్యం కాగా, ప్రస్తుతం 75 మిలియన్ కిలోల పొగాకు సాగు చేపట్టినట్లు తెలిపారు. ఇదే క్రమంలో అంతర్జాతీయ మార్కెట్లో కొంత డిమాండ్ తగ్గడమే సంక్షోభానికి కారణమని వివరించారు. మిర్చి, కొబ్బరి, బ్లాక్ బర్లీ, మామిడి పంటలు సంక్షోభంలోకి కూరుకుపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. సంక్షోభంలో ఉన్న రైతులకు ధైర్యం కల్పించాలి, వారి కోసం కంపెనీలు బాధ్యతతో ముందుకు రావాలని కోరారు. రైతు పక్షపాత ప్రభుత్వంగా రైతుల పక్షాన నిలిచామన్నారు. రైతు ఆత్మహత్యల మాట ఈ ప్రభుత్వంలో వినపడరాదన్నారు. ధరల స్థిరీకరణ నిధికి రూ.130 కోట్ల నిధులను ప్రభుత్వం కేటాయించిందన్నారు. ఇటీవల సంక్షోభంలోకి వెళ్లిన టమోటా రైతులను ఆ నిధి నుంచి ఆదుకున్నామన్నారు. రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటామని, రైతులు ధైర్యంగా ఉండాలని ఆయన సూచించారు. బ్లాక్ బర్లీ పొగాకు పంటను బయ్యర్లు ఆదివారం నుండే కొనుగోలులు ప్రారంభించాలన్నారు. ఇలాంటి పరిస్థితి రానున్న రోజుల్లో కనిపించరాదని, ప్రత్యామ్నాయ పంటల వైపునకు రైతులు వెళ్లేలా వ్యవసాయ శాఖ అధికారులు చైతన్య పరచాలన్నారు.
అండగా ఉంటాం: మంత్రి గొట్టిపాటి
పొగాకు రైతులకు ప్రస్తుతం కష్టకాలం నడుస్తోందని, వారికి కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ తెలిపారు. పొగాకు రైతులకు ఇబ్బందులు వచ్చినప్పుడే వారిని ఆదుకోవాలని అన్నారు. కంపెనీల ప్రోత్సాహంతోనే బ్లాక్ బర్లీ పొగాకును రైతులు సాగు చేశారని, చివరి ఆకు వరకు కొనేలా ప్రభుత్వం బాధ్యత వహిస్తుందన్నారు. ఆత్మహత్యలు అనే మాట వినపడరాదు, అలాంటి ఆలోచన రైతుల్లోకి రాకూడదన్నారు. రైతుల పక్షాన ప్రభుత్వం నిలిచిందని, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేక దృష్టి సారించారని, ఈ నేపథ్యంలో కంపెనీలు ముందుకు రావాలని కోరారు. సమస్యల్లో ఉన్న రైతులను ఆదుకోవాల్సిన బాధ్యతను గుర్తించాలన్నారు. వచ్చే ఏడాది పొగాకు పంట సాగు తగ్గించేలా అధికారులు ప్రణాళికలు పొందించుకోవాలన్నారు. రైతుల బాగుంటేనే, కంపెనీలు, కంపెనీలు బాగుంటేనే మీరూ ఇలా ఒకరికొకరు సంయమనంతో ముందుకు సాగాలన్నారు. ప్రాసెసింగ్ ఖర్చు ప్రభుత్వమే భరిస్తుందని, మంత్రి ప్రకటించడంతో ఐటిసి 10 మిలియన్లకు మించి కొనుగోలు చేయాలని, జీపీఐ కంపెనీ 20 మిలియన్లకు పైగా కొనుగోలు చేయాలన్నారు. అలాగే మిగిలిన కంపెనీలు లక్ష్యాలకు మించి పొగాకు కొనుగోలు చేపట్టాలన్నారు. బయ్యర్లు ముందుకు వచ్చి రైతులను ఆదుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయని ఆయన వివరించారు.
రైతులను ఆదుకుంటాం: ఎమ్మెల్యే ఏలూరి
సంక్షోభంలో ఉన్న పొగాకు రైతులను ప్రభుత్వం ఆదుకునేలా చర్యలు తీసుకోవాలని పర్చూరు శాసనసభ్యులు ఏలూరి సాంబశివరావు చెప్పారు. రెండు గ్రేడ్లతోనే పొగాకు కొనుగోలు జరగాలన్నారు. కొనుగోళ్ల పర్యవేక్షణకు ప్రభుత్వం ప్రత్యేకంగా సెల్ ఏర్పాటు చేసిందన్నారు. ప్రభుత్వం చేపట్టే విధి విధానాలను ఆయన వివరించారు. రైతులకు మేలు చేయడమే లక్ష్యంగా కంపెనీలు ముందుకు రావాలని ఆయన కోరారు.
సంక్షోభంలో ఉన్న రైతులను ప్రభుత్వం కాపాడుతుందని, ఆఖరి కిలో సైతం పొగాకు కంపెనీలు కొనేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని వ్యవసాయ శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి బి రాజశేఖర్ హామీ ఇచ్చారు. రైతుల వద్ద ఉన్న పొగాకు మొత్తాన్ని కొనుగోలు చేయిస్తామని ప్రభుత్వం భరోసా ఇచ్చిందన్నారు. రైతుల శ్రమను ప్రభుత్వం గుర్తించిందన్నారు. మంచి ధరలతో రైతులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటుందన్నారు.
పొగాకు రైతులకు మేలు జరిగేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు జిల్లా కలెక్టర్ జె వెంకట మురళి తెలిపారు. మంత్రి ప్రకటించిన ధరలతో కంపెనీలు ముందుకు వచ్చి పొగాకు పంటను కొనుగోలు చేయాలన్నారు. కొనుగోలు ప్రక్రియ, ధరల అమలుపై నిరంతరం పర్యవేక్షిస్తామన్నారు. ప్రభుత్వం కేటాయించిన మేరకు కంపెనీలు కొనుగోలు చేస్తున్నాయా లేదా నిరంతరం పరిశీలిస్తామన్నారు.
బ్లాక్ బర్లీ పొగాకు సాగుతో తీవ్రంగా నష్టపోయామని, కనీస మద్దతు ధర అమలు చేయాలని ఇంకొల్లు, దుద్దుకూరు రైతులు హరిబాబు, వాసు బాబు, కె వెంకట సుబ్బారావు, సూది సుబ్బారావు, మహిళా రైతు రమాదేవి, జె పంగులూరు మండల రైతులు రావూరి రమేష్ బాబు కోరారు. న్యాయం చేయాలంటూ మంత్రిని అభ్యర్థించారు.
ఈ సమావేశంలో వ్యవసాయ శాఖ కమిషనర్ ఢల్లీి రావు, టుబాకో బోర్డు చైర్మన్ యశ్వంత్, ఈడీ విశ్వసే, వేర్ హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ సురేష్, సంతనూతలపాడు శాసనసభ్యులు బీఎన్ విజయకుమార్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి రామకృష్ణ, మార్కెటింగ్ శాఖ అధికారి రమేష్ బాబు, మార్క్‌ఫెడ్ అధికారి కరుణ, ఉద్యాన శాఖ ఏడీ జెన్నమ్మ, 20 కంపెనీల ప్రతినిధులు, రైతు సంఘాల నాయకులు, ప్రతినిధులు, రైతులు, తదితరులు పాల్గొన్నారు.