- ఎంపీ కేశినేని శివనాథ్ ఉద్ఘాటన
- ఆర్యవైశ్య డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ గా డూండీ రాకేష్ ప్రమాణ స్వీకారం
- శుభాకాంక్షలు తెలిపి శాలువాతో సత్కరించిన ఎంపీ
విజయవాడ (చైతన్యరథం): రాష్ట్రం బాగుండాలంటే వ్యాపారస్తులు బాగుండాలి.. వ్యాపారస్తుల్లో ఎక్కువగా ఆర్యవైశ్యులే వున్నారు.. వారి సంక్షేమం కోసం, అభివృద్ది కోసం ప్రజా ప్రభుత్వం కృషి చేస్తుందని విజయవాడ ఎంపి కేశినేని శివనాథ్ అన్నారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని గాంధీ మున్సిపల్ హైస్కూల్‌లో ఆదివారం ఆర్యవైశ్య డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ డూండీ రాకేష్ పదవీ బాధ్యతల స్వీకార కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎంపీ కేశినేని శివనాథ్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ ఛైర్మన్‌గా డూండీ రాకేష్‌తో పాటు డైరెక్టర్‌గా ప్రమాణాస్వీకారం చేసిన ఏచూరి రాముకి ఎంపీ కేశినేని శివనాథ్ అభినందనలు తెలిపారు. ఛైర్మన్‌గా డూండీ ప్రమాణా స్వీకారం చేసిన అనంతరం ఎంపీ కేశినేని పుష్పగుచ్చం అందించి శాలువాతో సత్కరించారు.
ఈ సందర్భంగా ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడుతూ ఆర్యవైశ్యులు తెలుగుదేశం పార్టీకి ఏకపక్షంగా మద్దతు ప్రకటించారన్నారు. ఈ విషయాన్ని ఎన్నికలకి ముందే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనేక సభల్లో చెప్పారని గుర్తు చేశారు.
సామాజిక సేవలో ఆర్య వైశ్య సామాజిక వర్గం ముందుంటుందని కొనియాడారు. డూండీ రాకేష్ ప్రమాణ స్వీకారం కార్యక్రమం జాతిపిత గాంధీ మున్సిపల్ హైస్కూల్‌లో జరగటం ఆనందంగా వుందన్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఆర్యవైశ్యులకి సమస్య అంటే డూండీ ముందు వుంటాడన్నారు. యువగళం సమయంలో యువనేత నారా లోకేష్‌కి తోడుగా పాదయాత్ర చేయటమే కాకుండా, రాష్ట్ర వ్యాప్తంగా వ్యాపారస్తుల సమస్యలపై పొరాటం చేసి జగన్ ఆరాచక పాలనకు వ్యతిరేకంగా డూండీ రాకేష్ ధైర్యంగా నిలబడి ఉద్యమాలు చేశాడన్నారు. ఇక విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని వ్యాపారస్తులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.. వాటిలో పార్కింగ్ సమస్య ఒకటి..ఆ సమస్యను పరిష్కరించేందుకు కలెక్టర్, మున్సిపల్ కమిషనర్‌తో చర్చించి ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు ఎంపీ తెలిపారు. అలాగే పలు సమాజసేవ కార్యక్రమాలు చేపట్టే వాసవీ మహిళ క్లబ్ సభ్యులకి అభినందనలు తెలిపారు.