టిడిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆర్యవైశ్యులు స్వేచ్చగా వ్యాపారాలు చేసుకునే అవకాశం కల్పిస్తామని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వెల్లడించారు. యువగళం పాదయాత్ర సందర్భంగా మంగళవారం కడప గోకుల్ సర్కిల్ లో ఆర్యవైశ్య సామాజికవర్గ ప్రతినిధులు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు.
ఆర్యవైశ్యుల్లో చాలా మంది నిరుపేదలున్నారు. వారికి ప్రభుత్వ పథకాలు అమలు చేయాలి. అర్హత ఉన్న పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించాలి. వ్యాపార సముదాయాలకు పెట్టే బోర్డులపై మోయలేనివిధంగా పన్నులు వేస్తున్నారు. గతంలో ఆర్యవైశ్యుల అభివృద్ధికి ఆర్యవైశ్య కార్పొరేషన్ కు నిధులు కేటాయించారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక ఆర్యవైశ్య కార్పోరేషన్ ను నిర్వీర్యం చేశారు. కడప పట్టణంలో ఎలాంటి ఫ్యాక్టరీలు, పరిశ్రమలు లేక యువతకు ఉపాధి దొరకడం లేదు. మీరు అధికారంలోకి వచ్చాక మా సమస్యలను పరిష్కరించాలి అని వారు విజ్ఞప్తి చేశారు. వారి విజ్ఞప్తులపై నారా లోకేష్ సానుకూలంగా స్పందించారు.
వైసిపి అధికారంలోకి వచ్చాక అమలుచేస్తున్న జె-ట్యాక్స్ విధానాల కారణంగా ఆర్యవైశ్యులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రకరకాల పన్నులతో వ్యాపారులను వేధింపులకు గురిచేస్తున్నారు. వైసిపి ప్రభుత్వం అక్రమాలను ప్రశ్నించిన వ్యాపార ప్రముఖులపై దాడులు, హత్యలకు పాల్పడుతున్నారు. ఒంగోలులో సుబ్బారావు గుప్తాపై గంజాయి కేసు బనాయించి జైలులో పెట్టారు. నంద్యాల మండీ మర్చంట్ అసోసియేషన్ అధ్యక్షుడు తిరువీధి వెంకటసుబ్బయ్య కిరాతకంగా చంపిన రౌడీలు దర్జాగా రోడ్లపై తిరుగుతున్నారు. అనవసరమైన పన్నుల భారాన్ని తగ్గించి వ్యాపారాలను ప్రోత్సహిస్తాం. అర్హులైన పేదవ్యాపారులకు ఇళ్ల స్థలాలుకేటాయిస్తాం. ఆర్యవైశ్య కార్పొరేషన్ కు నిధులు కేటాయించి, చిరువ్యాపారులకు సబ్సిడీరుణాలు అందజేస్తాం. ఆర్యవైశ్యులకు రాజకీయంగా అవకాశాలు కల్పిస్తామని లోకేష్ వారికి హామీ ఇచ్చారు.