- పార్టీ భావజాలం, సిద్ధాంతాలపై పూర్తి అవగాహన ఉండాలి
- డబ్బుతోనే ఎన్నికలు గెలవలేం
- ప్రభుత్వం చేస్తున్న మంచిని ప్రజల్లోకి తీసుకెళ్లాలి
- సంక్షేమ పథకాల లబ్ధిని వివరించాలి
- ప్రతి పోలింగ్ బూత్లో లోనూ పార్టీ బలోపేతం కావాలి
- మండల పార్టీ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులతో ‘కాఫీ కబుర్లు’ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు
అమరావతి (చైతన్యరథం): మారుతున్న కాలానికి అనుగుణంగా నాయకత్వం ఆలోచనలు కూడా మారాలని పార్టీ నేతలకు టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపు ఇచ్చారు. పార్టీ సిద్ధాంతాలు, భావజాలంపై నాయకులు, కార్యకర్తలందరికీ పూర్తి అవగాహన ఉండాలన్నారు. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో జరుగుతున్న టీడీపీ క్యాడర్ శిక్షణా తరగతుల్లో భాగంగా గురవారం ‘కాఫీ కబుర్లు- పేరుతో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్, మానవ వనరుల విభాగం చైర్మన్ వేపాడ చిరంజీవిరావు, ఇతర ముఖ్య నాయకులు, శిక్షణకు హాజరైన ప్రతినిధులు సీఎంకు
సాదర స్వాగతం పలికారు. శిక్షణలో పాల్గొన్న మండల పార్టీ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులతో ముచ్చటించిన చంద్రబాబు.. శిక్షణ కార్యక్రమాలు ఎలా జరుగుతున్నాయని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ హయాంలో జరిగిన శిక్షణ కార్యక్రమాలను ఆయన గుర్తు చేసుకున్నారు.
నాడు చెట్ల కింద ఎర్రటి ఎండలో శిక్షణ తరగతులు చేపట్టేవాళ్ళం, కానీ నేడు మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా చల్లటి ఏసీ గదుల్లో శిక్షణ నిర్వహిస్తున్నాం. మారుతున్న టెక్నాలజీ, పరిస్థితులకు అనుగుణంగా నాయకులు కూడా తమ నాయకత్వ పటిమను మెరుగుపరుచుకోవాలని సీఎం సూచించారు. ప్రతి కార్యకర్తకు పార్టీ సిద్ధాంతాలు, భావజాలంపై పూర్తి అవగాహన ఉండాలని ఆయన స్పష్టం చేశారు. పనితీరు, క్రమశిక్షణే గెలుపు మంత్రం పార్టీ శ్రేణులు సమన్వయంతో, క్రమశిక్షణతో పనిచేయాలని చంద్రబాబు ఉద్బోధించారు. ప్రతి పోలింగ్ బూత్లోనూ పార్టీ బలోపేతం కావాలని, ఎప్పటికప్పుడు బలాబలాలు చూసుకోవాలని సూచించారు. సమర్థవంతమైన నాయకత్వం ఉంటే బలహీనంగా ఉన్న నియోజకవర్గంలోనూ పార్టీ బలపడుతుంది. అదే బలహీన నేతకు మంచి నియోజకవర్గం ఇచ్చినా పార్టీని బలహీన పరుస్తారని విశ్లేషించారు. డబ్బుతోనే ఎన్నికలు గెలవలేమని, మనం చేసే మంచి పనులను ప్రజల్లోకి సమర్థవంతంగా తీసుకెళ్లినప్పుడే విజయం సాధ్యమని స్పష్టం చేశారు. చక్కటి పనితీరు, క్రమశిక్షణే గెలుపు మంత్రంగా అభివర్ణించారు. డబ్బుతోనే ఎన్నికలను గెలవగలమని కొందరు భావిస్తారు… కానీ మనం చేసే మంచి పనుల్ని ప్రజలకు నిత్యం వివరిస్తేనే గెలవగలం. గతంలో టెక్నాలజీ ఉండేది కాదు… ఇప్పుడు చాలా పీక్కు వెళ్లింది. దానిని సద్వినియోగం చేసుకోవాలని సీఎం చంద్రబాబు సూచించారు.
ప్రజా సంక్షేమమే ధ్యేయం.. కార్యకర్తలే బలం
ప్రజా సంక్షేమమే తమ ధ్యేయమని, కార్యకర్తలే పార్టీకి కొండంత బలమని సీఎం చంద్రబాబు అన్నారు. నేతలు, కార్యకర్తలను కలిసేందుకు వినూత్న కార్యక్రమాలు చేపడుతున్నామని చంద్రబాబు తెలిపారు. అన్నదాత సుఖీభవ, దీపం-2.0, స్త్రీశక్తి, తల్లికి వందనం వంటి కీలక పథకాలను ప్రభుత్వం సమర్థవంతంగా అమలు చేస్తోందని వెల్లడించారు. ఈ పథకాల లబ్ధిని ప్రజలకు వివరించి, మహిళల ఓటు బ్యాంక్ మెజార్టీ శాతం పార్టీకే దక్కేలా చూడాల్సిన బాధ్యత కార్యకర్తలదేనని దిశానిర్దేశం చేశారు. 2019 నుంచి 2024 వరకు జరిగిన విధ్వంసం వల్ల వ్యవస్థలు నిర్వీర్యం అయ్యాయని, వాటిని ఇప్పుడు సరిచేసి గాడిన పెట్టామని సీఎం పేర్కొన్నారు. పింఛన్ల కోసం ఏడాదికి రూ.33 వేల కోట్లు ఖర్చు చేస్తున్నామని గుర్తు చేశారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎంత పట్టుదలతో పనిచేశారో.. ఇప్పుడూ అంతకు మించిన స్థాయిలో పనిచేయాలని పార్టీ శ్రేణులకు చంద్రబాబు పిలుపునిచ్చారు.
శిక్షణ విధానాన్ని సీఎంకు వివరించిన విప్ వేపాడ
ఈ సందర్భంగా శిక్షణా తరగతులను పర్యవేక్షిస్తున్న ప్రభుత్వ విప్ వేపాడ చిరంజీవిరావు తరగతుల నిర్వహణా తీరును సీఎం చంద్రబాబుకు వివరించారు. పార్లమెంటుకు ఇద్దరు చొప్పున 50 మండల పార్టీ ప్రెసిడెంట్లకు, 50 సెక్రటరీలకు కలిపి సుమారు 100 మంది చొప్పున ఇప్పటికి రెండు బ్యాచ్లు నిర్వహించామన్నారు. ఇది మూడవ బ్యాచ్ అని చెప్పారు. 100 మందిని నాలుగు గ్రూపులుగా.. అన్నదాత సుఖీభవ, దీపం, స్త్రీ శక్తి, తల్లికి వందనంగా విభజించి నాలుగు గ్రూపులకు వేరు వేరుగా శిక్షణ ఇస్తున్నామన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలతో శిక్షణ ఇస్తున్నట్టు చెప్పారు.
ఉదయం 6 గంటల నుండి 7 గంటల వరకు -యోగా లేదా ధ్యానంతో శిక్షణ ప్రారంభించి ప్రతీ క్లాస్ అయిన తర్వాత ఆ అంశం పై ఇంటరాక్టివ్ సెషన్ పెడుతున్నామన్నారు. పార్టీ ఆవిర్భావం చరిత్ర – భావజాలం, పార్టీ నిర్మాణం, మండల పార్టీ అధ్యక్షుడి పాత్ర- బాధ్యతలు, కేస్ స్టడీస్ గ్రూప్ డిస్కషన్, క్యాడర్కు బీమా సంక్షేమం సాధికారత, సూపర్ సిక్స్ – 18 నెలల ప్రభుత్వ సాధనలు, సాంకేతిక పరిజ్ఞానం,సోషల్ మీడియా వినియోగం, తదితర అంశాలపై శిక్షణ ఇస్తున్నట్టు చెప్పారు. పాల్గొన్న ప్రతినిధులు, ట్రైనర్స్ నుంచి శిక్షణ ఎలా ఉంది, మెరుగుపరచడానికి సూచనలు తీసుకుంటు న్నట్టు చెప్పారు. ప్రతినిధులతో ఫోటో సెషన్ నిర్వహించి, ప్రశంసా పత్రం అందిస్తున్నట్టు చెప్పారు.















