- చేనేతలకు ప్రోత్సహంపై ఎమ్మెల్యేలతో వర్కింగ్ గ్రూప్
- అవినీతిని అరికట్టడంద్వారా రూ.200 కోట్లు ఆదాచేశాం
- శాసనసభ్యలంతా వీవర్స్ శాలను అధ్యయనం చేయండి
- అసెంబ్లీలో రాష్ట్ర విద్య, ఐటి శాఖల మంత్రి నారా లోకేష్
అమరావతి (చైతన్య రథం): చేనేత సొసైటీలకు కొంతశాతం యూనిఫాం తయారీ ఆర్డర్ ఇచ్చే అంశంపై సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు ఎమ్మెల్యేలతో వర్కింగ్ గ్రూప్ ఏర్పాటు చేస్తామని రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ మంత్రి నారా లోకేష్ చెప్పారు. 5వరోజు అసెంబ్లీ సమావేశాల ప్రశ్నోత్తరాల్లో భాగంగా నగరి ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ అడిగిన ప్రశ్నకు మంత్రి నారా లోకేష్ సమాధానమిస్తూ… గతంలో ఆప్కోకు ఆర్డర్ ఇస్తే సొసైటీలు సకాలంలో యూనిఫాం సరఫరా చేయలేకపోయారు. చేనేతలను ప్రోత్సహించే అంశంపై గతంలోనూ పలుమార్లు చర్చలు జరిగాయి. అయితే ఇందుకోసం స్ట్రక్చరల్ చేంజ్ రావాలి. ప్రభుత్వ టెండరులో సొసైటీలు ఎలా పోటీపడాలనే విషయాన్ని పరిశీలించాల్సి ఉంది. దాదాపు 50 నియోజకవర్గాల్లో చేనేతలు ఉన్నారు. యూనిఫామ్ విషయంలో మార్కెట్ ధరల పోటీని ఎలా ఎదుర్కోవాలనే విషయమై సభ్యులందరం కూర్చుని మాట్లాడాలి. ఇందుకోసం నలుగురైదురు సభ్యులతో వర్కింగ్ గ్రూప్ ఏర్పాటు చేస్తాం. చేనేత వృత్తిని అందరం కలసికట్టుగా కాపాడాలి. అదే సమయంలో సరైన విధంగా సరఫరా జరిగేలా కూడా చూడాలి. అందరం కలసి చర్చిస్తే శాశ్వతమైన పరిష్కారం లభిస్తుంది. కమిట్మెంట్తో చేనేతలను ప్రోత్సహించాల్సిన బాధ్యత అందరిపైన ఉంది. ప్రధాని నరేంద్ర మోదీ స్వదేశీ గురించి చెప్పారు. ఇందులో చేనేత కీలకమైన పాత్ర పోషిస్తుందని మంత్రి లోకేష్ స్పష్టం చేశారు.
2019-24 నడుమ స్కూలు విద్యార్థులకు యూనిఫాం కొనుగోలులో అవకతవకలు జరిగినట్టు కొన్ని ఫిర్యాదులు అందాయి.
దీనిపై విజిలెన్స్ విచారణకు ఆదేశించాం. నివేదిక అందిన వెంటనే చర్యలు తీసుకుంటామని లోకేష్ పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక బెస్ట్ క్వాలిటీతో మంచి ఫ్యాబ్రిక్, డిజైన్తో విద్యార్థులకు అత్యుత్తమమైన కొత్త యూనిఫాం ఇచ్చాం. గతంలోకంటే డ్యూరబిలిటీ, బ్రీతబిలిటీ ఎక్కువ ఉండే దుస్తులిచ్చాం. బాయ్స్, గర్స్కు ఒకే విధమైన యూనిఫాం ఇచ్చాం. పాఠశాల విద్యశాఖలో ఐదేళ్లలో వెయ్యికోట్లు ఆదాచేయాలని అధికారులను ఆదేశించాం. టెండరు విధానం పారదర్శకంగా సడిపించాలని చెప్పాం. దీంతో గతఏడాది సర్వేపల్లి రాధాకృష్ణన్ పేరిట విద్యార్థులకు అందించే కిట్స్, గుడ్లు, చిక్కీలలో రూ.200 కోట్లు ఆదా చేశాం. ఇదే విధానాన్ని అమలుచేసి ఐదేళ్లలో రూ. వెయ్యికోట్లు ప్రభుత్వ ఖజానాకు ఆదా చేస్తామని మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు.
“చేనేతలను ప్రోత్సహించేందుకు మంగళగిరి నియోజకవర్గంలో నిర్మాణాత్మకంగా కృషి చేస్తున్నాం. మంగళగిరిలో వీవర్స్ శాల ద్వారా చేనేత కార్మికులకు 40నుంచి 50శాతం ఆదాయం పెంచాం’ అని మంత్రి లోకేష్ చెప్పారు. డిజైన్లు, మార్కెటింగ్పై టాటా టనేరాతో ఒప్పందం చేసుకున్నాం. మా వంతుగా చేనేత వస్త్రాలను ప్రమోట్ చేస్తున్నాం. గౌరవ సభ్యులు సమయం ఉన్నపుడు వీవర్స్ శాలను సందర్శించాలి. చేనేతలకు మెరుగైన ఉపాధి, ఆదాయం వచ్చేలా మార్కెట్ లింక్ చేసే అంశాన్ని అధ్యయనం చేయాలి. మేం మూడున్నరేళ్లుగా వీవర్స్ శాల ద్వారా చేనేతల ఆదాయం పెంచే ప్రయత్నం చేస్తున్నాం. అయినప్పటికీ ఈ వ్యవస్థలో ఇంకా దళారులు ఉన్నారు. చేనేతలను కాపాడుకునేందుకు దీర్ఘకాలిక ప్రణాళిక అమలుచేయాల్సి ఉంది. చేనేతలు వృత్తిపరంగా ఇబ్బంది పడుతున్న మాట వాస్తవం. పాదయాత్రలో ఇచ్చిన హామీమేరకు చేనేతలకు 200 యూనిట్లు ఉచిత విద్యుత్ ఇస్తున్నాం, ఇచ్చిన మాట నిలబెట్టుకున్నామని లోకేష్ స్పష్టం చేశారు.